సాక్షి, హైదరాబాద్: గత ఏడాది గచ్చిబౌలిలోని లాల్‌స్ట్రీట్ పబ్‌లో ఓ మైనర్ బాలిక డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కూకట్‌పల్లిలోని క్లబ్ మస్తీ రెస్టో బార్ అండ్ పబ్‌పై ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి.. అశ్లీల నృత్యాలు చేస్తున్న 9 మంది యువతులతో పాటు మరో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇలా అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలకు మారిపోయిన పబ్‌లపై సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక నిఘా పెట్టారు.
పబ్‌లలో మద్యం, ధూమపానం, కస్టమర్లను ఆకర్షించేందు కు మహిళలతో నృత్యాలను నియంత్రించని, నిబ ంధనలు పాటించని యజమానులపై చర్యలు తీసుకోనున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లోని పబ్‌లు, రిసార్ట్‌లు, ఫామ్ హౌస్‌లు, గెస్ట్ హౌస్‌లు, ఓయో రూమ్స్‌లపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆయా ప్రాంతాలలో పగలు, రాత్రి వేర్వేరు సమయాల్లో ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
అనుమానం వస్తే వెంటనే తనిఖీలు..
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 800 మంది నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలో అందులో వివరించారు. వీటిని అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీటన్నింటినీ కలిపి ఒకటే గ్రూప్‌లోకి తీసుకొచ్చారు. పబ్బుల్లో ఏం జరుగుతోంది? ఎవరు బుకింగ్ చేసుకుంటున్నారు? వేడుకలు, ఈవెంట్లు, పార్టీలకు సంబంధించిన వివరాలు, ఎంత మంది హాజరవుతున్నారనే వివరాలు పోలీసులకు ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. అనుమానం ఉంటే వెంటనే తనిఖీలు చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు.
సత్ప్రవర్తనకు బాండ్ పేపర్
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారితో సీపీ కార్యాలయంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కొంతమంది పాత నేరస్తులు హత్యలు తదితర కేసులలో ఉన్నటువంటి వారు సత్ప్రవర్తనతో మెలగడానికి, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించకుండా ఉండేందుకు హామీ ఇవ్వాలని ఆదేశించారు. ఇద్దరు జామీనుదారులతో పాటు, రూ.50 వేల హామీ బాండ్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. అతిక్రమించిన వారిపై సెక్షన్ 107/122 సీఆర్‌పీసీ ప్రకారం ఏడాది జైలు శిక్ష విధిస్తామని చెప్పారు. సమావేశంలో క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ శింగేనవర్, ఏసీపీ రవిచంద్ర పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment