Cyberabad Commissioner
-
దళిత మహిళపై షాద్‌నగర్ పోలీసుల వీరంగం.. సీపీ చర్యలు
సాక్షి, హైదరాబాద్: షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఓదళిత మహిళను కర్రలతో కొట్టి హింసించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మహిళపై దాడి చేసిన షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంరెడ్డితోపాటు మరో అయిదుగురు కానిస్టేబుళ్లను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఏసీపీ రంగస్వామి తన నివేదికను సీపీకి సమర్పించారు. నివేదిక ఆధారంగా బాధ్యులను గుర్తించి వారిని సస్పెండ్ చేసినట్లు సీపీ వెల్లడించారు.ఏం జరిగిందంటే.. సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులను పోలీసులు ఓ దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. పక్కింట్లో నివాసముంటున్న నాగేందర్ అనే వ్యక్తి తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని గత నెల 24వ తేదీన షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న సునీత, భీమయ్య దంపతులపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో డీఐ రామిరెడ్డి 26వ తేదీన వీరిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. తాము చోరీ చేయలేదని వారు చెప్పడంతో ఇంటికి పంపేశారు. అనంతరం జూలై 30వ తేదీ రాత్రి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి మరో నలుగురు పోలీసు సిబ్బంది రఫీ, మోహన్ లాల్, కరుణాకర్,అ ఖిల.. మొత్తం ఐదుగురు పోలీసులు సునీత భీమయ్య దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు కుమారుడు 13 ఏళ్ల జగదీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇష్టమొచ్చినట్లు హింసించారు.. అయితే డిఐ రాంరెడ్డి తనను చిత్రహింసలకు గురి చేసినట్టు బాధితురాలు సునీత పేర్కొంది. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కన్న కొడుకు జగదీశ్వర్ ముందే అతి దారుణంగా చితకబాదారని ఆరోపించింది. తన చీర విప్పేసి సగం నిక్కరు తొడిగారని, తన భర్త చొక్కా విప్పించి వేసుకోమంటూ కొట్టాురని ఆరోపించింది. ఆ సమయంలో మహిళా పోలీసులెవరూ పక్కన లేరని పేర్కొంది. తన కుమారుడిని కూడా రబ్బరుబెల్టుతో కొట్టారని తెలిపిందిరాత్రి 2 గంటల వరకు చితకబాదడంతో పోలీసుల దెబ్బలకు తాళలేక స్పృహ తప్పి పడిపోగా.. ఫిర్యాదుదారుకు చెందిన వాహనంలోనే తనను ఇంటికి పంపించారని తెలిపింది. మర్నాడు నా భర్తతో కలిసి స్టేషన్‌కు వెళ్తే.. పిలిచినప్పుడు రావాలని పోలీసులు చెప్పారు. తర్వాత చికిత్స కోసం నేను ఆసుపత్రిలో చేరాను’ అని బాధితురాలు సునీత వివరించారు. -
మియాపూర్ సీఐ సస్పెండ్.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మియాపూర్ సీఐ ప్రేమ్‌కుమార్‌ను సీపీ సస్పెండ్ చేశారు. సదరు సీఐ ఓ మహిళతో అమర్యాదకంగా ప్రవర్తించిన కారణంగా ఆయనను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. మియాపూర్ సీఐ ప్రేమ్‌కుమార్‌ను సైబరాబాద్ సీపీ సస్పెండ్ చేశారు. కాగా, తనతో అమర్యాదగా ప్రవర్తించారని ఓ మహిళ సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో, సదరు మహిళ ఫిర్యాదుపై సీపీ అవినాష్ మహింతి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఆమెతో ప్రేమ్‌కుమార్ అమర్యాదగా ప్రవర్తించాడని తేలడంతో సీఐని సస్పెండ్ చేశారు. -
సిఫారసు లేఖలతో పోస్టింగ్‌లు: సైబరాబాద్ కమిషనర్ కొరఢా
హైదరాబాద్: సిఫారసు లేఖలతో పోస్టింగ్‌లు పొందిన పోలీసులపై సైబరాబాద్ కమిషనర్ కొరఢా ఝళిపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధుల పలుకుబడితో పోస్టింగ్‌లు కొట్టేసిన అధికారులను సాగనంపే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ దిశగా ఇప్పటికే పలువురిపై బదిలీ/సస్పెన్షన్ వేటు వేసిన కమిషనర్ అవినాశ్ మహంతి..మరికొంత మంది చిట్టాను కూడా రూపొందించారు. రూల్స్ బుక్ కమిషనర్‌గా పేరొందిన మహంతి..విధుల్లో నిర్లక్ష్యం, బాధితులపై విచక్షణారహితంగా దాడులు, అవినీతికి పాల్పడుతున్న వారిపై పోలీసు మాన్యువల్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో సమాచారం సేకరించిన సీపీ..త్వరలోనే సంబంధిత అధికారులకు చెక్‌చెప్పే అవకాశాలున్నట్లు పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రతిభావంతులకు పట్టం.. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులతో ఠాణా సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో బాధితులు సామాజిక మాధ్యమాల ద్వారా లేదా నేరుగా పోలీసు బాస్‌లను కలుస్తున్నారు. వీరి ఫిర్యాదులను సీపీలు స్వయంగా పరిశీలిస్తున్నారు. బాధితులు చెప్పే వివరాల ఆధారంగా ఏసీపీ స్థాయి అధికారులతో అంతర్గత విచారణ జరుపుతున్నారు. పోలీసు సిబ్బంది చేసింది తప్పని తేలితే వెంటనే సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. కొత్త బాస్ రాకతో అప్రాధాన్యత పోస్టులలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న ప్రతిభావంతులలో ఆశలు చిగురించాయి. చాలా వరకు ఠాణాలలో కొత్త ఇన్స్పెక్టర్లు బాధ్యతలు చేపట్టే సూచనలున్నాయి. -
సీఎం ఆగ్రహం.. బుక్ మై షో నిర్వాహకులకు పోలీసుల వార్నింగ్!
సన్ బర్న్ షోకు సంబంధించి ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ ఫ్లాట్‌ఫామ్ బుక్ మై షో టికెట్లు విక్రయించడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా షో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అసలు ఈ సన్ బర్న్ షో నిర్వాహకులు ఎవరని నిలదీశారు. ఎలాంటి అనుమతి లేకుండా టికెట్లు విక్రయించడంపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను సీఎం ఆదేశించారు. సీఎం రేవంత్ ఆదేశాలతో సన్ బర్న్ ఈవెంట్‌కు ఎలాంటి అనుమతులు లేవని సైబరాబాద్ సీపీ మహంతి వెల్లడించారు. అనుమతి కోసం కూడా ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని అన్నారు. బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించినట్లు సీపీ తెలిపారు. అనుమతుల్లేకుండా టికెట్లు విక్రయిస్తే చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ఈ సంఘటనపై బుక్ మై షోతో పాటు సన్ బర్న్ షో నిర్వాహకులపై కూడా మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు సన్ బర్న్ షోకు పోలీసులు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. -
HYD: అతిపెద్ద సైబర్ స్కాం గుట్టురట్టు.. ఇన్సూరెన్స్, క్రెడిట్‌కార్డు, లోన్ డేటా..
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైమ్ స్కామ్‌ను బయటపెట్టారు. దేశంలో కోట్లాది మంది పర్సనల్ డేటాను అమ్మకానికి పెట్టిన సైబర్ దొంగలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా 16 కోట్ల మంది దేశపౌరుల డేటా అమ్మకానికి గురైనట్టు వివరించారు. వివరాల ప్రకారం.. డేటాను చోరీ చేస్తూ అమ్ముతున్న సైబర్ కేటుగాళ్ల ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. డేటా దొంగతనంపై హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో సైబరాబాద్ పరిధిలో ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్టు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కాగా, వీరిని ఢిల్లీ, నాగపూర్, ముంబైకి చెందిన ముఠాగా గుర్తించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా కూడా చోరీ అయ్యింది. దేశ భద్రతకు భంగం కలిగేలా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్నారు. బీమా, లోన్లకు అప్లై చేసిన నాలుగు లక్షల మంది డేటా చోరీకి గురైంది. కోట్లాదిగా సోషల్ మీడియా ఐడీలు, పాస్వర్డ్లు కూడా లీకయ్యాయి. ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా, ఢిల్లీలో 35 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల డేటా చోరీకి గురైంది. ఈ ముఠా సభ్యులు ఇన్సూరెన్స్, క్రెడిట్‌కార్డులు, లోన్ అప్లికేషన్ల నుంచి వివరాల సేకరిస్తున్నారు. డేటా చోరీ గ్యాంగ్‌లకు ఆయా కంపెనీల్లో కొందరు ఉద్యోగులు సాయం చేస్తున్నారు. సెక్యూరిటీ ఉందనుకున్న బ్యాంక్ అకౌంట్ల నుంచి కూడా నేరగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. సేకరించిన వ్యక్తిగత డేటాను అమ్మేస్తున్నారు. ఇప్పటికే పలు ముఠాలను అరెస్ట్ చేశామని తెలిపారు. ఇది కూడా చదవండి: గుట్టుగా అబార్షన్ల దందా! రూ.30వేలు ఇస్తే లింగ నిర్ధారణ పరీక్ష -
హైదరాబాద్: పబ్బుల్లో ఏం జరుగుతోంది?
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది గచ్చిబౌలిలోని లాల్‌స్ట్రీట్ పబ్‌లో ఓ మైనర్ బాలిక డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కూకట్‌పల్లిలోని క్లబ్ మస్తీ రెస్టో బార్ అండ్ పబ్‌పై ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి.. అశ్లీల నృత్యాలు చేస్తున్న 9 మంది యువతులతో పాటు మరో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇలా అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలకు మారిపోయిన పబ్‌లపై సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక నిఘా పెట్టారు. పబ్‌లలో మద్యం, ధూమపానం, కస్టమర్లను ఆకర్షించేందు కు మహిళలతో నృత్యాలను నియంత్రించని, నిబ ంధనలు పాటించని యజమానులపై చర్యలు తీసుకోనున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లోని పబ్‌లు, రిసార్ట్లు, ఫామ్ హౌస్‌లు, గెస్ట్ హౌస్‌లు, ఓయో రూమ్స్‌లపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆయా ప్రాంతాలలో పగలు, రాత్రి వేర్వేరు సమయాల్లో ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అనుమానం వస్తే వెంటనే తనిఖీలు.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 800 మంది నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలో అందులో వివరించారు. వీటిని అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీటన్నింటినీ కలిపి ఒకటే గ్రూప్‌లోకి తీసుకొచ్చారు. పబ్బుల్లో ఏం జరుగుతోంది? ఎవరు బుకింగ్ చేసుకుంటున్నారు? వేడుకలు, ఈవెంట్లు, పార్టీలకు సంబంధించిన వివరాలు, ఎంత మంది హాజరవుతున్నారనే వివరాలు పోలీసులకు ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. అనుమానం ఉంటే వెంటనే తనిఖీలు చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. సత్ప్రవర్తనకు బాండ్ పేపర్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారితో సీపీ కార్యాలయంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కొంతమంది పాత నేరస్తులు హత్యలు తదితర కేసులలో ఉన్నటువంటి వారు సత్ప్రవర్తనతో మెలగడానికి, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించకుండా ఉండేందుకు హామీ ఇవ్వాలని ఆదేశించారు. ఇద్దరు జామీనుదారులతో పాటు, రూ.50 వేల హామీ బాండ్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. అతిక్రమించిన వారిపై సెక్షన్ 107/122 సీఆర్పీసీ ప్రకారం ఏడాది జైలు శిక్ష విధిస్తామని చెప్పారు. సమావేశంలో క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ శింగేనవర్, ఏసీపీ రవిచంద్ర పాల్గొన్నారు. -
‘ఆ తుపాకీని రాజస్తాన్‌లో కొన్నారు’
సాక్షి, హైదరాబాద్: శంకర్ పల్లి, ఆర్సీపురంలో దొంగల ముఠా ఒకటి ఆయుధాలు వాడి కన్స్ట్రక్షన్ సైట్లలో సెక్యూరిటీలను బెదిరించి దొంగతనాలకు పాల్పడ్డ సంగతి తేలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు బుధవారం వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. ‘ఆర్సీ పురం, శంకర్పల్లి ఘటనలతో అంతరాష్ట్ర దొంగలు రాష్ట్రంలోకి వచ్చారని భావించి టీమ్స్ ఏర్పాటు చేశాము. ఖచ్చితమైన సమాచారం మేరకు దొంగలను అరెస్ట్ చేశాం. వారితో పాటు దొంగతనం చేసిన వారి దగ్గర నుంచి మెటీరియల్ కొనేవారిని కూడా అరెస్ట్ చేశాం. వీరిలో మనీష్ అనే ఓ ఎలక్ట్రికల్ షాప్ ఓనర్‌తో పాటు, స్క్రాప్ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తి ఒకరు ఉన్నారు. వారి దగ్గర నుంచి సుమారు 55 లక్షల రూపాయలు విలువ చేసే మెటీరియల్ స్వాధీనం చేసుకున్నాం. 9,50,000 రూపాయల నగదు సీజ్ చేశాం. ఇందులో ప్రధాన నందితులైన యూపీ రాజస్తాన్‌కు చెందిన 11 మందిని అరెస్ట్ చేశాం’ అని తెలిపారు సజ్జనార్. (చదవండి: నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్టు) ఇక ‘నిందితులంతా ఎలక్ట్రిషన్స్.. వీరందరూ ఢిల్లీలో పని చేసినపుడు కలుసుకున్నారు. కొన్ని రోజులు హైదరాబాద్‌లో నిర్మాణ సంస్థలో పని చేశారు. కొల్లూరులో దొంగతనం చేశాక ఆ మెటీరియల్‌ను మనీష్ ఎలక్ట్రికల్ షాపులో అమ్మేశారు. వచ్చిన డబ్బులను జల్సాలకు వాడేవారు. దొంగతనం చేయడానికి వర్క్ కావాలనే సాకుతో సైట్లోకి వెళ్లి రెక్కి నిర్వహించేవారు. ఒకరు వర్క్ గురించి మాట్లాడుతుంటే మరి కొందరు అక్కడ పరిసరాలను గమనించేవారు. ఈ ముఠా రాత్రి 11 నుంచి 3 గంటల మధ్య దొంగతనాలకు పాల్పడేవారు. ఎంసీబీ ప్యానెల్ బోర్డ్లను చోరి చేసేవారు.. వాటిని మనీష్ ఎలక్ట్రికల్ షాపులో అమ్మేవారు’ అని సజ్జనార్ తెలిపారు. (చదవండి: మోస్ట్ వాంటెడ్ ఫహీమ్ దొరికాడు) ఇక మూడు రోజుల క్రితం మాకు ఓ స్పెసిఫిక్ కేసు వచ్చింది...ఇంతకు ముందు ఆర్సీపురం, శంకర్ పల్లి, ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో గట్టి నిఘా ఏర్పాటు చేశాం.. ఎట్టకేలకు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశాము. ఇందులో రాజస్తాన్‌కు చెందిన ప్రదీప్ కుష్వాల్ ప్రధాన నిందితుడిగా గుర్తించాము. ఇన్ఫ్రా కంపెనీలు సెక్యూరిటీ పెంచుకోవాలి. అంతర్గతంగా విజిలెన్స్ ఏర్పాటు చేసుకోవాలి. అలారాలను ఏర్పాటు చేసుకోవాలి..అరెస్ట్ అయిన వారందరిపై పీడి యాక్ట్ పెడతాం. దొంగతనాలు చేసేటప్పుడు బెదిరించటానికి వాడిన తుపాకిని రాజస్తాన్‌లో కొన్నారు’ అని తెలిపారు. -
నిబంధనలు ఉల్లంగిస్తే...
-
పోలీసులకు సహకరించడం మన బాధ్యత: సాయి పల్లవి
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని, వారు చేస్తున్న కార్యక్రమాలు నిజంగా గ్రేట్ అని హీరోయిన్ సాయి పల్లవి అన్నారు. హైదరాబాద్‌లో మహిళలకు ఉన్న భద్రత మరెక్కడా లేదని అభిప్రాయపడ్డారు. హెచ్ఐఐసీలో సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తాధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. అనంతరం మహిళల భద్రత, ఇతర అంశాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ఈ సదస్సులో హీరోయిన్ సాయిపల్లవితో పాటు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, ఐజీ స్వాతి లక్రా, సైంటిస్ట్ టెస్సీ థామస్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ.. చదువు, ఉద్యోగాల కోసం సిటీకి వచ్చే మహిళలు, యువతులు, వారి తల్లిదండ్రులు భయపడేవారని కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. పోలీసుల భద్రతతో మహిళలు నిశ్చింతగా ఉంటున్నారన్నారు. పోలీసులకు సహకరించడం మనందరి బాధ్యత అని సాయి పల్లవి అన్నారు. పోలీసులకు సెల్యూట్ చేస్తున్నా: థామస్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు సెల్యూట్ చేస్తున్నట్టు సైంటిస్ట్ టెస్సీ థామస్ పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం పోలీసులు పెద్దపీట వేస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మహిళలకు భద్రత ఎక్కువగా ఉందని కొనియాడారు. ‘సమానత్వం అంటారు. కానీ ఆస్తులు పురుషుల పేర్లపై పది శాతం ఉంటే మహిళల పేర్లపై ఒక శాతం మాత్రమే ఉంటున్నాయి. నిర్ణయాలు స్వతహాగా తీసుకునేలా మహిళలు తయారవ్వాలి. మిస్సైల్ అగ్ని-4కు డైరెక్టర్‌గా నన్ను నియమించినప్పుడు పెద్ద ప్రాజెక్ట్ చేపట్టడానికి ముందు భయపడ్డాను. మన ముందు ఉండే సవాళ్లను స్వీకరించి ఎదుర్కొనేందుకు సిద్దం అయితే విజయం సాధిస్తాం. ఎదుటి వారి విమర్శలను కూడా పాజిటీవ్‌గా తీసుకోవాలి’ అని థామస్ వ్యాఖ్యానించారు. సైబరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని మహిళా ఉద్యోగుల భద్రత కోసం షీ సేఫ్ అనే ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ఈ సదస్సులో పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. చదవండి: త్వరలో ‘షీ సేఫ్’ యాప్ ‘రష్మిక చించావ్ పో’.. అది నేనన్లేదు -
సైబర్ సెక్యూరిటీ అందరికీ అవసరమే
సాక్షి, హైదరాబాద్: పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలకు సమాధానం అందిస్తున్నా సైబర్ నేరాలు తగ్గకపోవడంపై సైబరాబాద్ కమిషనర్ వి.కె.సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు.సైబర్ సెక్యూరిటీ అంటే కేవలం ఐటీ సంస్థలకు చెందిన వ్యవహారమని అనుకోరాదని, స్మార్ట్ఫోన్లు ఉపయోగించే వారికీ హ్యాకర్ల నుంచి ముప్పు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ అంశంపై అవగాహన మరింత పెంచుకోవాలని ఆయన ప్రజలకు గురువారం సూచించారు. హైదరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఓ సదస్సుకు హాజరైన వి.కె.సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఐదేళ్లుగా ‘సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్’ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల పోలీసులతోపాటు ప్రభుత్వ నిఘా సంస్థల అధికారులు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారని చెప్పారు. అధికాదాయం గల వ్యక్తులనూ లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు నేరాలకు పాల్పడుతున్నారని సజ్జనార్ వివరించారు. ఫేస్బుక్ ద్వారా శత్రుదేశాల గూఢచారులు దేశీ రక్షణదళాల సిబ్బందిని వలలో వేసుకోవడమూ సైబర్ నేరంగానే పరిగణిస్తామని స్పష్టం చేసిన ఆయన ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతీసారి సంబంధిత శాఖకు అప్రమత్తంగా ఉండాల్సిందిగా లేఖలు రాస్తున్నామని వివరించారు. విశాఖపట్నంలో ఇటీవల కొంతమంది నేవీ అధికారులను పాకిస్తాన్ గూఢచారులు హనీట్రాప్ చేసి సున్నితమైన సమాచారాన్ని రాబట్టిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడిందన్నారు. హైదరాబాద్‌లో సుమారుగా ఐదు లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా.. వీరిలో చాలామంది తమ ఉద్యో గాలు చేసుకుంటూనే ట్రాఫిక్ నియంత్రణ, మహిళల అంశాల విషయంలో పోలీసులకు సహకరిస్తున్నారని, సైబర్ సెక్యూరిటీ విషయంలో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ సదస్సులో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ) ఉన్నతాధికారి సంజయ్ భాల్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. -
లేపాక్షిలో సైబరాబాద్ సీపీ సజ్జనార్
సాక్షి, లేపాక్షి: దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనతో వార్తల్లోకెక్కిన తెలంగాణలోని సైబరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్.. అనంతపురం జిల్లా లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సూర్యప్రకాష్‌రావు, నరసింహశర్మ స్వాగతం పలికారు. వీరభద్రస్వామిని తమ ఇలవేల్పుగా భావించే సజ్జనార్ ఇక్కడికి వచ్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం నుంచి ఆయన బయటకు రాగానే ఏపీ, కర్ణాటక యువతీ యువకులు సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. -
పాక్‌లో ప్రశాంత్: క్లారిటీ ఇచ్చిన సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్ చెరలో తెలుగు యువకుడు ప్రశాంత్ చిక్కుకున్నట్లు వస్తున్న వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రశాంత్‌ను సురక్షితంగా భారత్‌కు తీసుకరావాలంటూ సోషల్ మీడియా వేదికగా పోలీసులను నెటిజన్లు అభ్యర్థిస్తున్నారు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ ప్రేమించిన అమ్మాయి కోసం పాక్ సరిహద్దును దాటినట్లు వస్తున్న వార్తలపై సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ చెరలో తెలుగు యువకుడు ప్రశాంత్ చిక్కుకున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇప్పటివరకు ప్రశాంత్‌ది కేవలం మిస్సింగ్ కేస్‌గా మాత్రమే నమోదు చేసుకున్నట్లు తెలిపారు. దర్యాప్తులో పూర్తి వివరాలు బయటపడతాయన్నారు అయితే సోషల్ మీడియాలో, ప్రసార మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. ఎవరైన అసత్య ప్రచారాలు చేసినా, షేర్ చేసినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. ‘ప్రశాంత్ వ్యవహారంపై తెలంగాణ పోలీసుల ఆరా, ప్రశాంత్ వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు, 10 నెలల క్రితమే ఇండియన్ రా ఏజెంట్ ప్రశాంత్ తండ్రి బాబురావు దగ్గరికి వచ్చినట్లు గుర్తింపు, పది నెలల క్రితమే ప్రశాంత్ వివరాలు అడిగిన రా ఏజెంట్, ప్రశాంత్ పాకిస్తాన్లో ఉన్నట్లు బాబురావుకు పది నెలల క్రితమే సమాచారం ఇచ్చిన రా ఏజెంట్’ వంటి సందేశాలు, వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అయితే ఇవన్నీ తప్పుడు వార్తలని సజ్జనార్ స్పష్టం చేశారు. -
‘కార్’కు ఏడీసీపీ గంగిరెడ్డి బదిలీ
సాక్షి, హైదరాబాద్: ముత్యాల యోగి కుమార్ అనే వ్యక్తిని బూటు కాలితో తన్నిన షీటీమ్స్ ఇన్చార్జి, మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డిని సిటీ ఆర్మ్డ్ రిజర్వు(సీఎఆర్) హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. షార్టు ఫిలింలో నటించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హారిక ఫిర్యాదు మేరకు యోగిని విచారణకు పిలిచి ఏడీసీపీ గంగిరెడ్డి బూటు కాలితో తన్నినట్లు టీవీ చానళ్లలో వచ్చింది. అందులో వాస్తవం ఎంత ఉందో విచారణ చేపట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. ఈమేరకు డీసీపీ విశ్వప్రసాద్‌ను విచారణ అధికారిగా నియమించిన విషయం విదితమే. ఈ క్రమంలో గంగిరెడ్డిని బదిలీ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు. -
ఎన్నికల ఏర్పాట్లు పూర్తి : ఆనంద్
ఎన్నికల నేపథ్యంలో తమ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు రూ.5.40 కోట్లు సీజ్ చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. గురువారం సైబరాబాద్ కమిషనరేట్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ...రూ. 5.60 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసినట్లు తెలిపారు. అలాగే 1,407 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 1,462 మంది తమ వద్ద ఉన్న ఆయుధాలు పోలీసులకు అప్పగించారన్నారు.ఎన్నికల కోసం 8,478 మంది సివిల్ పోలీసులు..30 కంపెనీల పారా మిలిటరీ బలగాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.ఎవరైన సభలు,సమావేశాలు,ర్యాలీలు నిర్వహించాలంటే అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని ఆయన సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.మీర్‌పేటలో పోలీసులపై దాడికి పాల్పడిన ఇండిపెండెంట్ అభ్యర్థి యాదయ్య నామినేషన్‌ను రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరనున్నట్లు సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.