హైదరాబాద్: సిఫారసు లేఖలతో పోస్టింగ్‌లు పొందిన పోలీసులపై సైబరాబాద్ కమిషనర్ కొరఢా ఝళిపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధుల పలుకుబడితో పోస్టింగ్‌లు కొట్టేసిన అధికారులను సాగనంపే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ దిశగా ఇప్పటికే పలువురిపై బదిలీ/సస్పెన్షన్ వేటు వేసిన కమిషనర్ అవినాశ్ మహంతి..మరికొంత మంది చిట్టాను కూడా రూపొందించారు.
రూల్స్ బుక్ కమిషనర్‌గా పేరొందిన మహంతి..విధుల్లో నిర్లక్ష్యం, బాధితులపై విచక్షణారహితంగా దాడులు, అవినీతికి పాల్పడుతున్న వారిపై పోలీసు మాన్యువల్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో సమాచారం సేకరించిన సీపీ..త్వరలోనే సంబంధిత అధికారులకు చెక్‌చెప్పే అవకాశాలున్నట్లు పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రతిభావంతులకు పట్టం..
పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులతో ఠాణా సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో బాధితులు సామాజిక మాధ్యమాల ద్వారా లేదా నేరుగా పోలీసు బాస్‌లను కలుస్తున్నారు.
వీరి ఫిర్యాదులను సీపీలు స్వయంగా పరిశీలిస్తున్నారు. బాధితులు చెప్పే వివరాల ఆధారంగా ఏసీపీ స్థాయి అధికారులతో అంతర్గత విచారణ జరుపుతున్నారు. పోలీసు సిబ్బంది చేసింది తప్పని తేలితే వెంటనే సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. కొత్త బాస్ రాకతో అప్రాధాన్యత పోస్టులలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న ప్రతిభావంతులలో ఆశలు చిగురించాయి. చాలా వరకు ఠాణాలలో కొత్త ఇన్‌స్పెక్టర్లు బాధ్యతలు చేపట్టే సూచనలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment