సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏడేళ్లుగా దళితులు, గిరిజనులకు చేస్తున్న మోసాలను రాష్ట్రవ్యాప్తంగా ఎండగట్టేందుకు ఆగస్టు 9న ఇంద్రవెల్లి నుంచి లక్షమందితో దండోరా మోగించనున్నామని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని చిరాన్‌పోర్ట్ క్లబ్‌లో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నేతలతో రేవంత్ సమావేశమయ్యారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కె. ప్రేంసాగర్‌రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కె.సురేఖ, జాతీయ యువజన కాం గ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎం.అనిల్‌కుమార్ యాదవ్, టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ పాల్గొన్నారు. రేవంత్ మాట్లాడుతూ ఒక్క హుజూరాబాద్‌లోనే దళితబంధు పథకం అమలు చేస్తే, మిగిలిన 118 నియోజకవర్గాల్లోని దళితుల పరి స్థితి ఏంటని ప్రశ్నిం చారు.
రాష్ట్రంలోని 1.35 కోట్ల మంది దళిత, గిరిజనులకు ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులను మోసం చేసి డబ్బాల్లో ఓట్లు వేసుకుంటామంటే ఊరుకునే ప్రసక్తే లేదని, ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ ప్రభుత్వంపై ‘దళిత, గిరిజన దండోరా’మోగిస్తామని చెప్పారు. ప్రేంసాగర్‌రావుతోపాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలెవ్వరితోనూ తనకు విభేదాలు లేవని రేవంత్ స్పష్టం చేశారు. కాగా, అంతకుముందు బోనాల సందర్భంగా ఉజ్జయిని అమ్మవారిని రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన నిజాంపేటకు చెందిన వెంకటేశ్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసాయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment