గ్రామాల్లో పోటాపోటీగా దసరా ఆఫర్లు
ఆరాతీస్తున్న పోలీసులు
చిట్యాల, మర్రిగూడ: దసరా పండగ సమీపిస్తుండటంతో గ్రామాల్లో సందండి నెలకొంటోంది. చిట్యాల, మర్రిగూడ తదితర మండలాల్లో దసరా పండుగ సందర్భంగా యువకులు సరికొత్త స్కీం ప్రారంభించారు. చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో కొందరు యువకులు “51 రూపాయలు కొట్టు.. మేకను పట్టు’ అని ప్రచారం చేస్తున్నారు.
ఈ స్కీంలో 51 రూపాయలు చెల్లించి కూపన్ తీసుకుంటే.. కూపన్‌ల నుంచి డ్రా తీస్తారు. మొదటి బహుమతిగా పన్నెండు కిలోల మేక, రెండో బహుమతిగా రెండు లిక్కర్ బాటిళ్లు, మూడో బహుమతిగా మరో రెండు లిక్కర్ బాటిళ్లు, నాలుగో బహుమతిగా రెండు కడక్‌నా«థ్ నాటు కోళ్లు, ఐదో బహుమతిగా కాటన్ బీర్లు ఇచ్చేట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు.
ఇక్కడ వంద రూపాయల స్కీం
మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి గ్రామంలో మరో తీరుగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వంద రూపాయలు చెల్లించి కూపన్ తీసుకున్న వారిలో నుంచి డ్రా తీసి మొదటి బహుమతి 10కిలోల మేక, రెండవ బహుమతి రెండు మద్యం బాటిళ్లు(బ్లెండర్ స్ప్రైడ్), మూడవ బహుమతి కాటన్ బీర్లు, నాలుగవ బహుమతి రెండు నాటు కోళ్లు, ఐదవ బహుమతి ఒక మద్యం బాటిల్ అందించనున్నామని, వచ్చే నెల 10న గ్రామంలో డ్రా తీయనున్నట్లు నిర్వాహకులు బ్యానర్ ఏర్పాటు చేశారు. కాగా, ఈ ప్రచారాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment