సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సైతం తండ్రి కేసీఆర్ మాదిరిగానే కొలువుల భర్తీ విషయంలో అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1,32,899 ఉద్యోగా లను భర్తీ చేసిందని, దీనిపై ఎవరికైనా సందేహాలు ఉంటే చర్చకు సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌కు శ్రవణ్ కుమార్ ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు. తెలంగాణ అమరవీరుల స్థూపం ‘గన్‌పార్క్’ వద్ద శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్చకు రావాలంటూ కేటీఆర్‌కు ప్రతి సవాల్ చేశారు. మీడియా ఎదుట శాంతియుతంగా జరిగే చర్చకు కేటీఆర్ హాజరైతే శాలువా, పూలదండతో సత్కరించి చర్చకు ఆహ్వానించాలని కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ కేటీఆర్, ఇతర నాయకులు చర్చకు రాకపోవడంతో ఆగ్రహించిన కాంగ్రెస్ నేతలు... కేటీఆర్ కోసం వేసిన కుర్చీకి చెప్పుల దండ వేయడంతోపాటు కేటీఆర్‌కు పసుపు, కుంకుమ, చీర, గాజులను సమర్పించారు.
అపాయింట్‌మెంట్ లెటర్లు కావాలి...
ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లా డుతూ యువతను గందరగోళానికి గురిచేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ కేటీఆర్ లేఖలు రాయడాన్ని తప్పుబట్టారు. రాత్రిపూట ఇంట్లో కూర్చొని రాసుకొనే లవ్ లెటర్స్ తమకు అక్కరలేదని, కొలువుల భర్తీ కోసం యువతకు అపాయింట్‌మెంట్ లెటర్లు కావాలని చురకలం టించారు. 2014లో లక్షా 7 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని స్వయంగా కేసీఆరే అసెంబ్లీలో ప్రకటిం చారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వేసిన బిశ్వాల్ కమిటీ సైతం లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కేసీఆర్ కుటుంబం ఇంట్లో ఉద్యోగాలు ఉంటే సరిపోదని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసుకున్న వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమి కావాలని ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా 47% ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదంటూ మాట్లాడటాన్ని ఖండించారు. తెలంగాణ వ్యతిరేకి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి లక్షా పది వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు. కాంట్రాక్టు పదాన్నే లేకుండా చేస్తామన్న కేటీఆర్... ఎందుకు కాంట్రాక్టు విధానాన్ని ప్రోత్స హిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, కాంగ్రెస్ నేతలు మందడి అనీల్ కుమార్, ఇందిరా శోభన్, రవీందర్, డాక్టర్ మురళీ మనోహర్, మెట్టు సాయి, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment