దేశవ్యాప్తంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యం సంకట స్థితిలో ఉంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు మొదలు గుండెజబ్బులు, ఇతర అత్యవసర వైద్యం కోసం జిల్లా ప్రధాన ఆస్పత్రులకు వచ్చే బాధితులకు సకాలంలో చికిత్స అందట్లేదు. నిపుణుల కొరత, మౌలిక వసతుల లేమి, సాంకేతిక పరికరాల్లో లోపాలు ఇందుకు ప్రధాన కారణం. ఈ పరిణామం తీవ్ర ఆందోళనకరం. – నివేదికలో ఢిల్లీ ఎయిమ్స్
రోడ్డు ప్రమాదాల వల్ల అత్యధిక మెడికో
లీగల్ కేసులు నమోదవుతున్న దేశంలోని జిల్లా ఆస్పత్రుల్లో కరీంనగర్ జిల్లా ఆస్పత్రిది ప్రథమ స్థానం. 300కుపైగా పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో క్షతగాత్రులకు అత్యవసరంగా రక్తం అందించేందుకు ప్రత్యేక రక్తనిధి కేంద్రం లేదు. అదే సమయంలో అత్యవసర విభాగానికి ప్రత్యేక బ్లడ్ బ్యాంకులు ఉన్న దేశంలోని ఐదు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో హైదరాబాద్ జిల్లా కింగ్‌కోఠి ఆస్పత్రి ఒకటి. ఈ ఆస్పత్రిలో అతితక్కువ సమయంలోనే బాధితులకు రక్తం ఎక్కిస్తున్నారు. – ఎయిమ్స్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అత్యవసర వైద్యం అంతంత మాత్రంగానే అందుతోందని ఢిల్లీ ఎయిమ్స్ అధ్యయనం తేల్చిచెప్పింది. ప్రమాదాల బారినపడి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే బాధితులకు అత్యవసర చికిత్సలు అందుతున్న తీరును విశ్లేషించగా ఈ వాస్తవం బయటపడిందని వెల్లడిం చింది. 29 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాం తాలకు చెందిన 34 జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులను ఎంపిక చేసుకొని ఆయా ఆస్పత్రుల్లోని వైద్య సదుపాయాలు, పాటిస్తున్న ప్రమాణాలు, నెలకొన్న లోపాలు, అందుకుగల కారణాలపై ఢిల్లీ ఎయిమ్స్ అత్యవసర విభాగం ఇటీవల అధ్యయనం చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం నుంచి కరీంనగర్ జిల్లా ఆస్పత్రితోపాటు హైదరాబాద్ జిల్లా కింగ్‌కోఠి ఆస్పత్రిని ఇందుకోసం ఎంపిక చేసుకుంది. ‘ఎమర్జెన్సీ అండ్ ఇంజురీ కేర్ ఎట్ డిస్ట్రిక్ట్ హాస్పిట ల్స్ ఇన్ ఇండియా’ పేరిట చేపట్టిన ఈ అధ్యయన నివేదికను నీతి ఆయోగ్‌కు సమర్పించగా ఆ సంస్థ దాన్ని తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం ఎమర్జెన్సీ కేసుల్లో ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో 19% నుంచి 24% నమోదవుతున్నాయి. ఎమర్జెన్సీ సర్వీసు కోసం వచ్చే బాధితుల్లో 70% పెద్దలు ఉంటుండగా 30% మంది పిల్లలు ఉంటున్నారు.
పరిశీలనలో బయటపడ్డ లోపాలివి...
►ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ఆస్పత్రి బెడ్ సామర్థ్యంలో కనీసం మూడో వంతు బెడ్‌లు కేటాయించాలి. కానీ చాలా చోట్ల ఎమర్జెన్సీ బెడ్‌ల సంఖ్య 2–3 శాతం మించడం లేదు.
►ఎమర్జెన్సీ విభాగాల్లో నిర్ణీత సిబ్బంది, నిపుణులు ఉండాలన్న నిబంధనను పలు ఆస్పత్రులు పాటించడం లేదు.
► పీడియాట్రిక్ ఎమర్జెన్సీ విభాగాల్లో 96% పరికరాలు లేవు. అత్యవసర సర్జరీలు చేయాల్సిన చోట 41 శాతం వరకే వసతులున్నాయి.
► 24/7 వైద్య సేవలు అందించే ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగికి సగటున 205 నిమిషాల్లో సేవలు కల్పిస్తున్నారు. ఈ జాప్యంతో మరణాలు సంభవిస్తున్నాయి.
► దాదాపు 88 శాతం ప్రధాన ఆస్పత్రుల్లో అంబులెన్స్ సర్వీసులు ఉన్నప్పటికీ వాటిల్లో పనిచేస్తున్న నిపుణులు కేవలం 3 శాతమే ఉండటంతో దాని ప్రభావం అత్యవసర సేవలపై పడుతోంది.
► 90 శాతం అంబులెన్స్‌ల్లో సరైన పరికరాలు, ఆక్సిజన్ సౌకర్యం లేవు. తీవ్ర రోడ్డు ప్రమాదాలకు గురై అత్యవసర సేవలు అందించే క్రమంలో అంబులెన్స్‌లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వాటిలో బ్రతుకుతున్నది కేవలం 1.5 శాతమే.
►దేశంలో సగటున రోజుకు 1,374 రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే వాటిలో 30 శాతం బాధితులు మరణిస్తున్నారు.
► ప్రతి ప్రధాన ఆస్పత్రిలో రక్త నిధి కేంద్రాలు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉండగా... అత్యవసర వైద్య విభాగానికి ప్రత్యేక రక్త నిధిని నిర్వహించాలనే నిబంధన ఉంది. అయితే 50శాతం ప్రధాన ఆస్పత్రుల్లోనే రక్త నిధి కేంద్రాలు ఉన్నాయి. ఇందులోనూ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక బ్లడ్ బ్యాంకులు లేనివే ఎక్కువగా ఉన్నాయి. జనరల్ విభాగాల్లో రక్త నిధి కేంద్రాల నుంచి రక్తంతీసుకొచ్చి బాధితుడి శరీరంలోకి ప్రవేశపెట్టేందుకు ఎక్కువ సమయం పట్టడంతో కూడా మరణాలు సంభవిస్తున్నాయి.
► ప్రధాన ఆస్పత్రుల్లో పోలీస్ నిఘా లోపభూయిష్టంగా మారింది. దీంతో సగటున 47% వైద్యులు, సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయి.
► ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న వారి శాతం కనిష్టంగా 23% నుంచి గరిష్టంగా 67% ఉంది.
►ప్రస్తుతం నమోదవుతున్న మరణాల్లో అత్యధికంగా జీవనశైలి వ్యాధికి సంబంధించినవి 62 శాతం ఉండగా సంక్రమిత వ్యాధులతో జరిగే మరణాలు 28 శాతం, రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర సేవలందక జరిగే మరణాలు 10 శాతం ఉన్నాయి.
ప్రధాన సూచనలు
హృద్రోగులకు ‘స్టెమి’తో అత్యవసర చికిత్స చేస్తున్నాం..
గుండెపోటు మరణాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘స్టెమీ’ (ఎస్‌టీ–ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్‌ఫార్క్‌షన్) పేరిట దాదాపు అన్ని బోధనాస్పత్రుల్లో అమలు చేస్తున్న కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. హృద్రోగులకు అత్యవసర చికిత్సలో భాగంగా టెలీ–ఈసీజీ పరికరం ద్వారా గుండె పనితీరు తెలుసుకుంటాం. ఇందులో ఉన్న సాంకేతికత వల్ల ఈసీజీ ఫలితం వైద్య శాఖ ప్రధాన కార్యాలయానికి సైతం క్షణాల్లో వెళ్తుంది. అవసరమైన రోగికి రూ.40వేల నుంచి రూ.70వేల విలువ కలిగిన ఇంజక్షన్‌ను ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తోంది. క్షణాల్లో రోగికి దాన్ని ఇస్తుండటంతో మరణాలు తగ్గుతున్నాయి. అయితే ఇతర అత్యవసర సేవలు అందించేందుకు మొబైల్ ఎమర్జెన్సీ సేవలను మెరుగ్గా అమలు చేయాలి.– డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల
అత్యవసర సేవలను ఇటీవలే పునరుద్ధరించాం
మా ఆస్పత్రికి అత్యవసర చికిత్స కోసం రోజుకు సగటున 10 మంది బాధితులు వస్తున్నారు. సాధ్యమైనంత వరకు వాళ్లందరికీ ఇక్కడే సత్వర వైద్యసేవలు అందిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా ఇప్పటివరకు ఉన్న మా ఆస్పత్రిలో ఇటీవలే అత్యవసర సేవల విభాగాన్ని పునరుద్ధరించాం.
– డాక్టర్ రాజేంద్రనాథ్, కింగ్‌కోఠి ఆస్పత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment