ఆ వైద్యుల్లో మానవత్వం చనిపోయింది
న్యూఢిల్లీ: కొన్ని సంఘటనలు మానవత్వం చనిపోతుందన్న విషయాన్ని, తిరిగిదానికి జీవం పోయాలన్న విషయాన్ని గుర్తుచేస్తుంటాయి. బీహార్కు చెందిన మధునిక గుప్తా అనే మహిళ తన భర్త బబ్లూ తల ముందు భాగం పెరిగిపోతుండటంతో గయ ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు ఎయిమ్స్ తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. దీంతో ఆయనను ఎయిమ్స్కు తీసుకెళ్లగా అక్కడి వారు ఎలాంటి సమాధానం చెప్పారో.. ఆ సమాధానం చెప్పాక ఢిల్లీలో ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రి తలుపుతట్టినవారికి ఎలాంటి ఆదరణ లభించిందో తెలుసుకుంటే కళ్లు చెమ్మగిల్లాల్సిందే.
మధునిక గుప్తా తన భర్త బబ్లూ తొలుత ఎయిమ్స్కు వెళ్లగా ఆయనకు ఎమ్ఆర్ఐ స్కాన్ చేయాల్సిన అవసరం ఉందని, అయితే, ప్రస్తుతం ఎమ్ఆర్ఐ ఏడు నెలల వరకు ఖాళీలేదని, మరో ఆస్పత్రికి వెళ్లాలని సలహా ఇచ్చారు. కానీ, రూ.12 వేలు ఖర్చు భరించలేని ఆ దంపతులు ఇప్పటికే తమ ఆస్తులు మొత్తం అమ్మి ఖాళీ చేతులతో మిగిలామని చెప్పారు. ఎంత బ్రతిమాలుకున్నా వినలేదు. దీంతో అసలు ఆస్పత్రుల స్పందన ఎలా ఉంటుందా అని వారి సహాయంతో పరీక్షించి చూడగా ఢిల్లీలో ఏ ఒక్క వైద్యుడిలో కూడా మానవత్వ ఛాయలు కనిపించలేదు.
ఖాళీ లేదు, మేం ఏం చేయలేం, మా డిపార్ట్మెంట్ కాదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి, ఒక్కసారి చెప్తే అర్థం కాదా వంటి కసుర్లు విస్తుర్లే వినిపించాయి. ఈ మొత్తాన్ని ఆ టీవీ చానెల్ రహస్యంగా రికార్డు కూడా చేసింది. ఈ విషయంపై ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రిని సంప్రదించగా వైద్యులు చేసిందే ముమ్మాటికీ తప్పే అని సమాధానం ఇచ్చారు. చివరికి ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో మధులిక గుప్తా తన భర్తకు ఎమ్ఆర్ఐ చేయించుకుంది.