అది 1984, అక్టోబరు 31.. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఎవరూ ఊహించని విధంగా ఒక ఘటన చోటుచేసుకుంది. నాటి ప్రధాని ఇందిరాగాంధీని రక్తమోడుతున్న స్థితిలో బుల్లెట్ గాయాలతో ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. ఆ పరిస్థితిని మాటల్లో వర్ణించడం కష్టం. ఆసుపత్రిలో గందరగోళ వాతావరణం నెలకొంది. నాటి ప్రధాని ఇందిరా గాంధీకి శస్త్ర చికిత్స చేసి, ఆమె శరీరం నుంచి బుల్లెట్లు వెలికితీసిన డాక్టర్ పి వేణుగోపాల్ నాటి ఆ భయంకరమైన రోజును ఇప్పటికీ మరిచిపోలేదు. ఆరోజు ఇందిరాగాంధీ ప్రాణాలు కాపాడేందుకు ఎయిమ్స్ వైద్యులు, సర్జన్లు,నర్సింగ్ సిబ్బంది నాలుగు గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేశారని నాటి తన జ్ఞాపకాల దొంతరలోని వివరాలను వెల్లడించారు.
ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ వేణుగోపాల్ పుస్తకంలో..
వేణుగోపాల్ ఆ రోజల్లో ఎయిమ్స్ కార్డియాక్ సర్జరీ విభాగానికి అధిపతిగా ఉన్నారు. 1994 ఆగస్టులో భారతదేశంలో మొట్టమొదటి గుండె మార్పిడిని నిర్వహించిన ఘనత ఆయనకే దక్కింది. ఇటీవల ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ వేణుగోపాల్ రాసిన పుస్తకం విడుదలైంది. రక్తంతో తడిసిన ఆమె చీరలోంచి నేలపైకి జారి పడిన బుల్లెట్లు, రక్తమార్పిడి, తదుపరి ప్రధాని ప్రమాణ స్వీకారంపై ఆసుపత్రి కారిడార్‌లో జరిగిన రాజకీయ చర్చ... ఇవన్నీ 39 ఏళ్ల తర్వాత కూడా నాకు స్పష్టంగా గుర్తున్నాయని ఆయన ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
ఇందిరాగాంధీ శరీరం చుట్టూ రక్తపు మడుగు
మంచం మీద కదలలేని స్థితిలో ఉన్న ఇందారాగాంధీని చూసి తాను చలించిపోయానని ఆయన ఆ పుస్తకంలో రాశారు. ఆ సమయంలో ఆమె కడుపులో నుంచి రక్తం కారుతోంది. ఆమె శరీరం రక్తంతో పూర్తిగా తడిసిపోయింది. మొహం పాలిపోయింది. శరీరంలోని రక్తం అంతా వేగంగా బయటకు ఉబికివచ్చింది. అక్కడ రక్తపు మడుగు ఏర్పడింది. ఇందిరాగాంధీని ఆమె నివాసంలోని లాన్‌లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు హత్య చేశారు. దుండగులు ఆమెపై 33 బుల్లెట్లు కాల్చారు. వాటిలో 30 ఆమెను తాకాయి. 23 బుల్లెట్లు ఆమె శరీరంలోకి దూసుకెళ్లాయి. ఏడు బుల్లెట్లు మరింత లోపలికి దూసుకెళ్లాయని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ‘అయ్యా.. నేను బతికే ఉన్నాను.. డెత్ సర్టిఫికెట్ ఇప్పించండి’
ఆసుపత్రిలో ఎవరికీ ఏమీ అర్థం కాని వాతావరణం..
వేణుగోపాల్ (81) ఆ పుస్తకంలో నాటి వివరాలను తెలియజేస్తూ ఇందిరా గాంధీకి ఓ-నెగటివ్ రక్తం అవసరమయ్యింది. ఆ రక్తం వెంటనే లభించలేదు. ఆసుపత్రిలో ఎవరికీ ఏమీ అర్థం కాని వాతావరణం నెలకొంది. ఎయిమ్స్ సిబ్బంది అక్కడకి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అదే రోజు డైరెక్టర్‌గా తన బాధ్యతలకు వీడ్కోలు చెబుతున్న టాండన్.. బాధ్యతలు స్వీకరించబోతున్న డాక్టర్ స్నేహ భార్గవ.. ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఏం చెయ్యాలా? అనే సందేహంతో నా వైపు చూశారు. కార్డియాక్ సర్జరీ విభాగం అధిపతిగా నేను వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రక్తస్రావం ఆపడానికి నేను ఆమెను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లాలని ఆదేశించాను. ముందుగా ఇందిరాగాంధీ శరీరం నుంచి కారుతున్న రక్తస్రావాన్ని బైపాస్ మిషన్ సహాయంతో ఆపాలన్నది నా ప్లాన్. ఇందుకోసం నాలుగు గంటల పాటు వైద్యసిబ్బంది అంతా పోరాడారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ ఇందిరా గాంధీ ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ వార్త బయటివారికి ఎంతో నిస్సహాయ స్థితిలో తెలియజేశాను. దేశంలోని తూర్పు ప్రాంతంలో పర్యటిస్తున్న రాజీవ్ గాంధీ ఎయిమ్స్‌కు వస్తున్నారని, ఆయన రాక కోసం వేచి చూడాలని సిబ్బంది అభిప్రాయపడ్డారు.
‘అదే జరిగివుంటే బతికేవారు’
దేశంలో 50,000 గుండె శస్త్రచికిత్సలు చేసిన వేణుగోపాల్ ఆ పుస్తకంలో మరో కీలక విషయం రాశారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మొదటి బుల్లెట్ తగిలిన వెంటనే కిందపడిపోయారని, ఆమెతో పాటు ఉన్నవారు ఆమెను నేలపై ఒంటరిగా వదిలి, వెనక్కి పరిగెత్తారని తనకు తెలిసిందని, వారు అలా చేయకుండా.. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించివుంటే ఆమె బతికేవారని వేణుగోపాల్ పేర్కొన్నారు. అయితే ఆమెతో పాటు ఉన్నవారు అక్కడి నుంచి పారిపోవడం హంతకుడిలో ధైర్యాన్ని నింపిందని, ఫలితంగానే అతను తన మెషిన్ గన్ నుండి పలు రౌండ్ల బుల్లెట్లను కాల్చగలిగాడని వేణుగోపాల్ ఆపుస్తకంలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: బయటకు కనిపించే బైడెన్ లోపల వేరు.. కేకలేస్తాడు
Comments
Please login to add a commentAdd a comment