సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ భారత్ రాష్ట్ర సమితి నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. నేతలు చివరకు వ్యక్తిత్వ హననానికి సైతం పాల్పడుతూ వీధికెక్కుతున్నారు. రోజుకో చోట.. రోజుకో నేత అనే రీతిలో నియోజకవర్గ స్థాయి మొదలుకుని క్షేత్రస్థాయి వరకు పరస్పర విమర్శలు, దూషణలు తెరమీదకు వస్తున్నాయి. సిట్టింగ్‌లు తమను కలుపు కొని వెళ్లకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతలు క్రమంగా స్వరం పెంచుతు న్నారు. పార్టీ అధినేతపై విశ్వాసం, విధేయత ప్రకటిస్తూనే సొంత పార్టీ ఎమ్మెల్యేలు లక్ష్యంగా బహిరంగ ఆరోపణలు, విమర్శలకు దిగుతున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌ల చైర్మన్లు, పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న నేతలు, వివిధ సందర్భాల్లో టికెట్లు ఆశిస్తూ పార్టీలో చేరినవారు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కోసం లాబీయింగ్ చేస్తు న్నారు. టికెట్ల పోటీలో పర స్పరం సిగపట్లకు దిగుతు న్నారు. కార్యకర్తలు, అను యాయుల సమక్షంలో సొంత పార్టీకి చెందిన రాజ కీయ ప్రత్యర్థిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పార్టీ నేతలు లక్ష్మణరేఖ దాటుతున్నా.. అధినేత కేసీఆర్ చాలా సందర్భాల్లో ప్రతిస్పందించక పోవడంతో వివాదాలు మరింత ముదురుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్థానిక నాయకత్వంతో పొసగని నేతలు బహిరంగ విమర్శలకు దిగుతున్నా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. అయినప్పటికీ అధినేత మౌనం వెనుక ఆంతర్యం పార్టీ కేడర్‌కు అంతుపట్టడం లేదు. అయితే మాజీ ఉప ముఖ్యమంత్రులు తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిల పరస్పర ఆరోపణలకు సంబంధించిన వివాదంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి హెచ్చరికలు జారీ చేయడంతో ఈ తరహా పరిణామాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.
రోజుకో చోట.. రోజుకో నేత
సుమారు 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పార్టీ బహుళ నాయకత్వం సమస్యను ఎదుర్కొంటోంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ టికెట్‌ను ఆశిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు పలువురు నేతలు లాబీయింగ్‌కు దిగుతున్నారు. టికెట్ దక్కదనే అంచనాకు వచ్చిన కూచాడి శ్రీహరిరావు (నిర్మల్)తో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీని వీడారు. ఇటీవలి కాలంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై సస్పెన్షన్ వేటు వేయగా, వారు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించడంతో పాటు ఆ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నా చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉంటే పార్టీ టికెట్ ఆశిస్తున్న మెదక్, రాజేంద్రనగర్, కొత్తగూడెం, ఉప్పల్, హుజూరాబాద్, తాండూరు, మహబూబాబాద్ తదితర నియోజకవర్గాల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, జనగామ, ఖానాపూర్, వరంగల్ పశ్చిమ, నాగార్జునసాగర్, కల్వకుర్తి, జహీరాబాద్, వేములవాడ తదితర నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు ఎక్కడికక్కడ విస్తృతంగా పర్యటిస్తున్నారు.
సమావేశాలు, సభలు నిర్వహిస్తూ సొంత పార్టీకి చెందిన ప్రత్యర్థులపై విమర్శల దాడి చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ విధంగా కట్టుతప్పుతున్న నేతలపై చర్యలు లేకుంటే.. పరిస్థితి ఇతర పార్టీలకు అనుకూలంగా మారుతుందనే ఆందోళన పార్టీ కేడర్‌లో నెలకొంది. అయితే టికెట్ ఆశిస్తున్న నేతలంతా పార్టీ అధినేతకు విధేయులుగానే ఉంటున్నారని, ఎన్నికల నాటికి అంతా సద్దుమణుగుతుందని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. నేతల పనితీరుపై కేసీఆర్‌కు పూర్తి స్పష్టత ఉన్నందున అందరికీ ఏదో ఒకరకంగా గుర్తింపు లభిస్తుందని పార్టీ నేతలు అంటున్నారు.
కారు.. వీధిపోరు! 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహుళ నాయకత్వ సమస్య
Published Wed, Jul 12 2023 5:09 AM | Last Updated on Fri, Jul 28 2023 4:47 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment