ఆన్‌లైన్‌.. కొత్త సారు.. ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ | Digital Education: Online Teaching Trend Better Than Direct Teaching | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌.. కొత్త సారు.. ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ

Published Sat, Jan 1 2022 1:58 AM | Last Updated on Sat, Jan 1 2022 8:37 AM

Digital Education: Online Teaching Trend Better Than Direct Teaching - Sakshi

ఆన్‌లైన్‌ క్లాస్‌లో పులి నిజంగా ఉన్నట్టు అనుభూతి చెందుతున్న విద్యార్థిని

ఆన్‌లైన్‌ క్లాస్‌ జరుగుతోంది.. టీచర్‌ సౌర కుటుంబం గురించి పాఠం చెప్తున్నారు.. గ్రహాలు, ఇతర అంశాల గురించి టీచర్‌ వివరిస్తున్న కొద్దీ.. స్క్రీన్‌పై ఒక్కొక్కటిగా స్పష్టంగా అర్థమయ్యేలా కనిపిస్తున్నాయి. కిడ్నీ పాఠం చెప్తున్నప్పుడు కిడ్నీ లోపలి భాగాలు, కణాల తీరు.. విత్తనం మొక్కగా మారే పాఠం వివరిస్తున్నప్పుడు విత్తనంలో జరిగే మార్పుల నుంచి మొక్క ఎదిగేదాకా.. స్పష్టంగా ఫోన్‌ తెరపై కనిపిస్తున్నాయి.

సాక్షి, హైదరాబాద్‌:  కొత్త సంవత్సరంలో మన ముందుకు కొత్త టీచర్లు వస్తున్నారు. ఆన్‌లైన్‌ పాఠాలైనా సరే.. తరగతి గదిలో కన్నా మెరుగ్గా నేర్పించనున్నారు. విద్యార్థుల నైపుణ్యాలను, అవగాహనను మరింత పెంచేలా అద్భుతంగా బోధించనున్నారు. వారే ‘డిజిటల్‌ టీచర్లు..’ వారికి తోడ్పడే సరికొత్త విధానాలే అగుమెంటెడ్, వర్చువల్‌ రియాలిటీలు. పాఠశాలల్లో కాస్త మౌలిక సదుపాయాలు, విద్యార్థుల దగ్గర ఇంటర్నెట్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌/ట్యాబ్లెట్‌ ఉంటే చాలు.

తక్కువ ఖర్చుతోనే అత్యుత్తమ విద్య అందించేందుకు వీలయ్యే అద్భుతమైన యాప్‌లు, వెబ్‌సైట్లు, సాంకేతిక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్లు, ఆంక్షలతో విద్యా బోధనపై ప్రభావం పడింది. దానితో ఆన్‌లైన్‌ విద్యా విధానంపై విస్తృతంగా పరిశోధనలు జరిగి.. మెరుగైన బోధనా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే పలు పాఠశాలల్లో ఈ విధానాలపై చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చాయి కూడా. 

రెండు సాంకేతికతలతో.. 
ఆన్‌లైన్‌ బోధన అంటే ఇప్పటిదాకా చాలా మందికి తెలిసినది ఏమిటంటే.. తరగతి గదిలో టీచర్‌ పాఠం చెబుతుంటే, విద్యార్థులు సెల్‌ఫోన్‌లోనో, కంప్యూటర్‌లోనో చూస్తూ వినడమే. విద్యార్థికి పాఠం అర్థమవుతోందా? అసలు వింటున్నారా? లేదా? ఏదైనా సందేహం తీర్చుకోవాలనుకుంటున్నారా? అనేది తెలియడం కష్టమే. అంతేకాదు విద్యార్థులకు ఎంతమేర అర్థమైందన్నది బేరీజు వేసేందుకు పరీక్షలు లేకపోవడం మరో సమస్య. కానీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన యాప్స్, వెబ్‌సైట్లు, ఇతర ఆన్‌లైన్‌ విధానాలతో ఈ పరిస్థితి సమూలంగా మారబోతోంది. ఈ క్రమంలో ప్రధానంగా అగుమెంటేషన్, వర్చువల్‌ రియాలిటీ అనే రెండు పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. 
►   అగుమెంటేషన్‌ విధానంలో టీచర్‌ పాఠం చెప్తుండగానే.. విద్యార్థులు ఆయా అంశాలను అనుభవ పూర్వకంగా పరిశీలించగలిగే అవకాశం ఉం టుంది. ఉదాహరణకు మొక్క ఎదుగుదల పా ఠం చెబుతుంటే.. విత్తనం నుంచి మొక్కగా, చెట్టుగా ఎలా మారుతుందనే దృశ్యాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. టీచర్‌ నేరుగా మొక్కల మధ్య ఉండి పాఠం చెప్పినట్టుగా అనుభూతి కలుగుతుంది. 
►  వర్చువల్‌ రియాలిటీ విధానంలో కీలక అంశాలను అత్యంత సులువగా అర్థమయ్యేలా బోధించవచ్చు. ఉదాహరణకు టీచర్‌ సౌర కుటుంబం గురించి పాఠం చెప్తున్నప్పుడు.. టీచర్‌ ఒక్కో అంశాన్ని వివరిస్తున్న కొద్దీ దానికి సంబంధించిన చిత్రాలు కనిపిస్తుంటాయి. ప్రాక్టికల్‌గా ఆ అంశం తెలుసుకునే అనుభూతి వస్తుంది. సైన్స్‌ సబ్జెక్టుల్లో దీని ప్రాధాన్యత ఎక్కువ. కిడ్నీ గురించి చదివేటప్పుడు కిడ్నీని లోపలి నుంచి పరిశీలిస్తున్న అనుభూతి ఉంటుంది.  

అందుబాటులో ఎన్నో యాప్స్, వెబ్‌సైట్స్‌.. 
►     విద్యార్థులకు సులువైన రీతిలో విద్యా బోధన కోసం ఎన్నో యాప్స్, వెబ్‌సైట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. పాఠశాలల్లో టీచర్లు ఆ యాప్స్‌/వెబ్‌సైట్స్‌లో తాము బోధించే పాఠాలను ముందే రూపొందించుకోవచ్చు. బోధిస్తున్న సమయంలో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా కాన్సెప్టులను, గ్రాఫిక్స్‌ను, చిత్రాలను.. త్రీడీ, అగుమెంటెడ్, వర్చువల్‌ రియాలిటీ పద్ధతుల్లో సిద్ధం చేసుకోవచ్చు. 
►     ఎడ్‌ పజిల్‌ యాప్‌ ద్వారా టీచర్‌ పాఠం చెప్తున్నప్పుడు విద్యార్థులను మధ్యలో ప్రశ్నలు అడిగే సాంకేతికత ఉంటుంది. అందులో ఎంత మంది అలర్ట్‌గా ఉన్నారనేది టీచర్‌ పసిగట్టవచ్చు. వారి సామర్థ్యాలను అంచనా వేయవచ్చు. 
►    ఆన్‌లైన్‌ వీడియో పాఠాలు వినే సమయంలో ఎడ్‌మోడో యాప్‌ ద్వారా.. విద్యార్థి ఏమేర విన్నాడనేది అంచనా వేయవచ్చు. ఇందుకోసం మధ్యలో కొన్ని ప్రశ్నలు వేస్తారు. సమాధానం చెబితేనే వీడియో ముందుకు కదులుతుంది. 
►    ప్లిప్‌గ్రిడ్‌ అనే మరో సాంకేతికత ద్వారా టీచర్‌ ఒక ప్రశ్న వేస్తే ఎవరెవరు ఏమేం సమాధానాలు చెప్పారనేది విడివిడిగా నమోదవుతుంది. టీచర్‌ వాటిని విశ్లేషించుకునే అవకాశం ఉంటుంది. 
►    నియర్‌పాడ్‌ యాప్‌/వెబ్‌సైట్‌ అద్భుతమైన విద్యా బోధనకు తోడ్పడుతుంది. బ్లాక్‌బోర్డ్‌ అవసరమే లేకుండా.. దాదాపు బోధన అంతా పూర్తిచేసేందుకు వీలు కల్పిస్తుంది. టీచర్‌ బోధించడంతోపాటు ఏదైనా రాసినా, ప్రశ్న వేసినా విద్యార్థులు తరగతి గదిలోనే ఉండి నేర్చుకున్న అనుభూతిని కలిగించగలుగుతుంది. అదే విధంగా విద్యార్థుల అవగాహన, నైపుణ్యాలను, వారు ఎంత అప్రమత్తంగా ఉంటున్నారన్నది ఎప్పటికప్పుడు గమనించే వీలుంటుంది. 
►    వీటితోపాటు పాఠాలపై విద్యార్థుల ఒపీనియన్‌ పోల్స్, వీకెండ్‌ ఎగ్జామ్స్, నెలవారీ అసెస్‌మెంట్‌ వంటివీ యాప్‌ల ద్వారా సాధ్యమవుతాయి. 
►    ఇక విద్యార్థుల మానసికోల్లాసాన్ని పెంచే మ్యూజికల్, ఏరోబిక్స్‌ మిక్స్, నృత్యం, ఆర్ట్స్‌ అండ్‌ క్రాప్ట్ట్, చిత్ర లేఖనం, పజిల్స్‌ అండ్‌ రిడిల్స్, మ్యాప్‌ పాయింటింగ్, ఫ్యాక్ట్స్‌ ఆఫ్‌ ది వరల్డ్, ఫోనిక్స్, కథలు చెప్పడం వంటివాటికీ ఎన్నో యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. 

పాఠాలు ఆసక్తిగా ఉన్నాయి 
కరోనా సమయంలో హైదరాబాద్‌లో పెద్దమ్మ వాళ్ల ఇంటికి వచ్చాను. వారి అబ్బాయి, నేను ఇద్దరం ఒకే తరగతికావడంతో.. అతడి ఆన్‌లైన్‌ క్లాసుల పాఠాలన్నీ నేను కూడా విన్నాను. మా దగ్గర చెప్పే పాఠాల కంటే ఇక్కడ సులువుగా అర్థమయ్యాయి. సైన్స్‌ క్లాసులు చాలా బాగున్నాయి. నిజంగా నేను మొక్కల దగ్గరే ఉండి తెలుసుకున్నాననే ఫీలింగ్‌ వచ్చింది. 
– సాయి ప్రణీత్, పదో తరగతి విద్యార్థి, వరంగల్‌ 

విద్యార్థుల్లో నైపుణ్యం పెరిగింది..
హైదరాబాద్‌లోని బ్రూక్‌ ఫీల్డ్‌ పబ్లిక్‌ స్కూల్‌లో కరోనా సమయంలో అత్యాధునిక సాంకేతికత, కొత్త యాప్స్‌తో ఆన్‌లైన్‌ బోధన నిర్వహించారు. విద్యార్థుల్లో 83శాతం మంది గతం కన్నా మెరుగైన రీతిలో విద్యా ప్రమాణాలు కనబర్చినట్టు తేల్చారు. ‘‘తొలుత 64 శాతం మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులను శ్రద్ధగా వినకపోవడం గమనించాం. దీనిని యాప్‌ ద్వారా పసిగట్టి వారిని ప్రోత్సహించాం. 53 శాతం మందిలో మార్పు వచ్చింది. చాలా మంది లెర్నింగ్‌ లాస్‌ లేకుండా ప్రతిభ చూపుతున్నారు’’ అని బ్రూక్‌ఫీల్డ్‌ స్కూల్‌ డైరెక్టర్‌ రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.  

ఉచితంగా అందించగల సాంకేతికతతో 
విదేశాల్లో విద్యకు సంబంధించిన ఆన్‌లైన్‌ సాంకేతికతను అందరికీ అందుబాటులో ఉండేలా (ఓపెన్‌ ప్లాట్‌ఫాంపై) అందుబాటులోకి తెచ్చా రు. ఆ యాప్స్‌ అన్నీ మనం వాడుకోవచ్చు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 550 పాఠశాలల్లో టీచర్లకు దీనిపై శిక్షణ ఇచ్చాం. వీటిద్వారా బోధించినప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయని పాఠశాలల యాజమాన్యాలు చెప్తు న్నాయి. ఇందులో శిక్షణ, మౌలిక సదుపాయాల కోసం తప్ప పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. విద్యార్థులను పరిశోధన స్థాయికి తీసుకెళ్లే సరికొత్త బోధనగా దీన్ని చూడాలి.  
 – పన్నేరు భానుప్రసాద్, సీఈవో, సూపర్‌ టీచర్‌ ఎడ్యు రిఫామ్స్‌ 

బోధనలో సరికొత్త విప్లవం.. 
మా విద్యాసంస్థల్లో  4 వేల మంది చదువుతున్నారు. వారందరికీ కొత్త టెక్నాలజీతో ఆన్‌లైన్‌ బోధన నిర్వహించాం. చాలా మంది విద్యార్థులు ప్రత్యక్ష బోధనకన్నా ఈ క్లాసులు బాగున్నాయని అంటున్నారు. పిల్లల్లో నైపుణ్యాలు గతంలో కన్నా ఎక్కువగా కన్పిస్తున్నాయి. ముఖ్యంగా సైన్స్, గణితం వంటి సబ్జెక్టుల్లో త్రీడీ టెక్నాలజీ సరికొత్త విప్లవం సృష్టిస్తోంది. కరోనా కాలమనే కాదు.. భవిష్యత్‌లో  దీనిని కొనసాగించాలని భావిస్తున్నాం. 
– ఆర్‌.పార్వతీరెడ్డి, హార్వెస్ట్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్, ఖమ్మం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement