సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్లు సూపర్ సక్సెస్ కావటంతో, ఫెయిల్యూర్‌గా ముద్రపడ్డ డబుల్ డెక్కర్ రైళ్లపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఆక్యుపెన్సీ రేషియో లేక ఒక్కొక్కటిగా మూలపడుతూ వస్తున్న డబుల్ డెక్కర్ రైళ్లను మళ్లీ పట్టాలెక్కించి విజయవంతం చేయాలని భావిస్తోంది.
బెర్తులు ప్రవేశపెట్టి..
డబుల్ డెక్కర్ రైళ్లు కేవలం పగటి వేళ మాత్రమే తిరిగేలా రైల్వే ప్రవేశపెట్టింది. దీంతో వాటిల్లో కేవలం చైర్ కార్ మాత్రమే ఉండేది. సాధారణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగంతోనే వాటిని నడిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడిచే సూపర్ ఫాస్ట్ రైళ్లకు దాదాపు 11 గంటల ప్రయాణ సమయం పడుతోంది. రాత్రి వేళ కావటంతో సూపర్ ఫాస్ట్ రైళ్లలో ప్రయాణికులు పడుకుని ప్రయాణిస్తుండటంతో వారికి పగటి సమయం వృథా కావటం లేదు.
కానీ, డబుల్ డెక్కర్ రైళ్లలో పగటి వేళ అన్ని గంటలు ప్రయాణించాల్సి రావటంతో ప్రయాణికులకు ఒక రోజు సమయం వృథా అయ్యేది. డబుల్ డెక్కర్ రైళ్లు ప్రారంభమైన కొత్తలోనే సికింద్రాబాద్–తిరుపతి, సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టారు. ఈ రెండు ప్రాంతాలకు వెళ్లే వారు పగటి సమయం మొత్తం రైళ్లలోనే గడపటంతో ఒక రోజు మొత్తం వృథా అయినట్టుగా భావించేవారు. ఫలితంగా వాటిల్లో ఆక్యుపెన్సీ రేషియో వారం రోజుల్లోనే 14 శాతానికి చేరింది.
దీంతో ఆ రెండు సర్వీసులను రైల్వే రద్దు చేసింది. ఇటీవలే వందేభారత్ రైళ్లు పట్టాలెక్కి, అదే పగటి వేళ పరుగుపెడుతున్నా కిక్కిరిసిపోతున్నాయి. వాటి ఆక్యుపెన్సీ రేషియో 110 శాతం నుంచి 120 శాతంగా ఉంటోంది. వీటి వేగం ఎక్కువ కావటంతో, తక్కువ సమయంలోనే గమ్యం చేరుతున్నాయి. కానీ, వందేభారత్ తరహా లో అన్ని మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్ల వేగా న్ని పెంచటం సాధ్యం కాదు. దీంతో వాటిల్లో బెర్తులు ప్రవేశపెట్టి రాత్రి వేళ తిప్పే యోచనలో రైల్వే ఉంది.
ప్రయాణికులతోపాటు సరుకులు కూడా..
ఇక పైడెక్‌లో ప్రయాణికులు, దిగువ డెక్‌లో సరుకులను ఏకకాలంలో తరలించే ప్యాసింజర్ కమ్ గూడ్స్ నమూనాలో కూడా డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే భావిస్తోందని సమాచారం. దీనికి సంబంధించి డిజైన్‌లను రైల్వే అనుబంధం సంస్థ ఆర్‌డీఎస్‌ఓ పరిశీలిస్తోందని ఓ అధికారి పేర్కొన్నారు. వెరసి డబుల్ డెక్కర్ రైళ్లకు మళ్లీ డిమాండ్ కల్పించాలని రైల్వే భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment