![Double Fine For Parking In Some Areas At Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/27/parking.jpg.webp?itok=oNh1CqHR)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సిటీబ్యూరో: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్, అమీర్‌పేట, కోఠి... ఇలా నగరంలోని అనేక వాణిజ్య ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆయా మార్గాల్లోని వర్తకులకు ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా అక్రమ పార్కింగ్స్, ఇబ్బందికర పార్కింగ్ తప్పట్లేదు. ఫలితంగా రద్దీ వేళల్లో ఆయా మార్గాల్లో వాహనచోదకులు నరకాన్ని చవి చూడాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో సిటీ ట్రాఫిక్ పోలీసులు ఆయా ప్రాంతాలను ట్రాఫిక్ పరంగా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాలని నిర్ణయించారు. ఈ ఏరియాల్లో పార్కింగ్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనచోదకులకు రెట్టింపు జరిమానా విధించడంతో పాటు ఆయా దుకాణాలు, వ్యాపార సంస్థల నిర్వాహకులపై చర్యలకు మార్గాలు అన్వేషిస్తున్నామని ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ గురువారం వెల్లడించారు. వర్తక, వ్యాపార సముదాయాలు, దుకాణాల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతున్న ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా (కంజెషన్ జోన్) గుర్తించాలని నిర్ణయించారు.
అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా పక్కా సాంకేతికంగా వీటిని మార్క్ చేయనున్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న అక్రమ పార్కింగ్, ఇబ్బందికర పార్కింగ్‌పై అనునిత్యం ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఈ ప్రాంతాల్లో ఇలాంటి పార్కింగ్స్‌కు పాల్పడిన ఉల్లంఘనులకు ఇతర ప్రాంతాల్లో విధించే జరిమానాకు రెట్టింపు వేయాలని యోచిస్తున్నారు. ఫలితంగా వారిలో మార్పునకు ప్రయత్నాలు చేయనున్నారు. నో పార్కింగ్, ఇబ్బందికర పార్కింగ్‌లను ప్రస్తుతం వేరుగా చూడట్లేదు. ఈ కారణంగా జమానాల్లోనూ మార్పులు లేవు. అయితే సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు పూర్తయిన తర్వాత ఆ రెంటికీ వేర్వేరుగా జరిమానాలు విధించనున్నారు. నో పార్కింగ్ కంటే ఇబ్బందికర పార్కింగ్‌కు ఎక్కువ మొత్తం ఉండనుందని సమాచారం.
ఇప్పటి వరకు పార్కింగ్ ఉల్లంఘనపై కేవలం వాహనచోదకులకే జరిమానా పడుతోంది. అయితే వీరితో పాటు ఆయా వ్యాపార సంస్థలు, దుకాణాల నిర్వాహకులనూ బాధ్యులను చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. దీనికి సంబంధించి జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి విధివిధానాలు ఖరారు చేయనున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం నిర్వాహకులపై చర్యలకు ఆస్కారం లేదు. సిటీ పోలీసు యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినా నామమాత్రపు జరిమానాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిర్వాహకులపై చర్యలకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న ఇలాంటి పార్కింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ట్రాఫిక్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘స్పీడ్’ రూల్స్ ఇక పక్కా!
Comments
Please login to add a commentAdd a comment