యమకింకరులను మించిపోతున్న యమ ‘డ్రింకరులు’  | drunk and drive accident in city special story | Sakshi
Sakshi News home page

యమకింకరులను మించిపోతున్న యమ ‘డ్రింకరులు’ 

Published Wed, Aug 4 2021 12:23 PM | Last Updated on Wed, Aug 4 2021 2:17 PM

drunk and drive accident in city special story - Sakshi

యమ ‘డ్రింకరులు’ యమ కింకరుల్ని మించిపోతున్నారు.. వేళకాని వేళ మద్యం మత్తులో దూసుకుపోతున్నారు.. వాహనాలను నడిపే వీరు సేఫ్‌గానే ఉంటున్నప్పటికీ వెంట ఉన్న వాళ్లు, ఎదుటి వాళ్ల బతుకుల్లో చీకట్లు అలముకొంటున్నాయి.. మొన్న పంజగుట్ట పరిధిలో రమ్య కుటుంబం, హయత్‌నగర్‌ర్‌ సంజన కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది ‘డ్రింకరులే’. వీరే కాదు.. రికార్డుల్లోకి ఎక్కని, ఎక్కిన ‘నిశా’చరుల బాధితులు ఇంకా ఎందరో ఉంటున్నారు. మందుబాబుల్ని కట్టడి చేయడంలో మాత్రం ప్రభుత్వ విభాగాలు ఆశించిన ఫలితాలు సాధించడంలేదనే ఆరోపణలున్నాయి.   – సాక్షి, సిటీబ్యూరో

కష్టసాధ్యంగా నిరూపణ..  
మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేసిన కేసుల్లో ‘నిరూపణలు’ కష్టసాధ్యంగా మారుతున్నాయి. అనేక కేసుల్లో ప్రమాదం జరిగిన వెంటనే నిందితులు పారిపోవడం జరుగుతోంది. మళ్లీ వీరు చిక్కేప్పటికీ 24 నుంచి 48 గంటలు గడిచిపోతున్నాయి. దీంతో సదరు వ్యక్తి మద్యం తాగి ఉన్నాడని, అతడు ఆ స్థితిలో డ్రైవింగ్‌ చేశాడని నిరూపించడం గగనంగా మారుతోంది.  
♦ ఈ తరహా కేసుల నమోదు, దర్యాప్తులోనూ స్టాండర్డ్‌ ఆపరేషనల్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) లేకపోవడం సైతం మందుబాబులకు అనుకూలంగా మారుతోంది. ఈ కారణంగానే పోలీసులు ఒక్కో కేసును ఒక్కో రకంగా నమోదుతో పాటు దర్యాప్తు చేస్తున్నారు.  
♦ మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై కఠిన చర్యలు లేకపోవడం సైతం ‘నిశా’చరులు పెరగడానికి ఓ కారణంగా మారుతోంది. ప్రస్తుతం డ్రంకెన్‌ డ్రైవ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ను కేవలం ట్రాఫిక్‌ పోలీసులు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో చిక్కిన వారి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు.  ఆపై కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తున్నారు.  
♦ అనేక ఉదంతాల్లో మందుబాబులు న్యా యస్థానాలకు వెళ్లకుండా తమ వాహనాలను వదిలేస్తున్నారు. తక్కువ ఖరీదైన వాహనాల విషయంలోనే ఇలా జరుగుతోంది. ఈ కారణంగానే ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లలో ఆనక వాహనాలు పడి ఉంటున్నాయి.  
♦ ‘నిశా’చరులకు జైలు శిక్షలు, జరిమానాలు పెంచడం, వారి డ్రైవింగ్‌ లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేయడం, వారి తో పాటు కుటుంబీకులకూ పక్కా గా కౌన్సెలింగ్‌ చేయడం తదితర కఠిన చర్యలు తీసుకుంటేనే ఫలితాలు ఉంటాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. 
♦ పోలీసు విభాగంలో ఉన్న సిబ్బంది కొరత కారణంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్విరామంగా జరగట్లేదు. సాధారణంగా రాత్రి 9-11 గంటల మధ్యే ఇవి జరుగుతున్నాయి. ఈ విషయం పసిగడుతున్న మందుబాబులు ఆ సమయాలు మార్చి వెళ్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకున్న ప్రమాదాలు ఇదే స్పష్టం చేస్తున్నాయి.  


మచ్చుకు కొన్ని ఘటనలు..  
2021 ఆగస్టు 1 రాత్రి 11.30 గంటలు. కెనడాలో ఉన్నత విద్యనభ్యసిస్తూ నగరానికి వచ్చిన అశ్రిత, ఈమె స్నేహితురాలు తరుణి, క్లాస్‌మేట్స్‌ సాయి ప్రకాష్‌, అభిషేక్‌లు ఆదివారం రాత్రి ఓ పబ్‌ నుంచి బయలుదేరారు. మద్యం మత్తులో ఉన్న అభిషేక్‌ నడుపుతున్న కారు గచ్చిబౌలి పరిధిలో అదుపు తప్పి ప్రమాదం జరగడంతో అశ్రిత అసువులు బాసింది. 
♦ 2021 జూన్‌ 26.. తెల్లవారుజాము ఒంటి గంట.  శ్రవణ్‌కుమార్, నవీన్, ఉదయ్‌కిరణ్, మహేందర్‌రెడ్డి కారులో బయలుదేరారు. కారు నడుపుతున్న ఉదయ్‌ మద్యం మత్తులో మీర్జా గూడ స్టేజ్‌ సమీపంలో లారీని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రవణ్, నవీన్‌ అక్కడిక్కడే చనిపోయారు. 
♦ 2021 మే 23.. తెల్లవారుజాము 3 గంటలు.. కపిల్‌ నాయక్‌ గచి్చబౌలిలో ఉన్న తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అక్కడే మద్యం తాగి ఆ మత్తులో తన బెంజ్‌ కారు నడుపుకుంటూ వచ్చాడు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.10లో అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టాడు.  
♦ 2012 ఏప్రిల్‌ 5.. తెల్లవారుజాము 2.30 గంటలు  బి.వీరరాఘవ చౌదరి మద్యం మత్తులో తన స్నేహితుడు రాకేష్‌ వర్మను ద్విచక్ర వాహనంపై తీసుకుని వెళ్తున్నాడు. అయ్యప్ప సోసైటీ ప్రాంతంలో మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో రాకేష్‌ వర్మ దుర్మరణం చెందాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement