పగలూ రాత్రీ తేడా లేదు.. బైకా, కారా అన్న బాధ లేదు.. తాగామా, ఆ నిషాలో ఊరిమీద పడ్డామా అన్నట్టుగా మందుబాబులు రెచ్చిపోతున్నారు. యమకింకరుల్లా మారి అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. ఇక్కడా అక్కడా అని కాదు.. చాలా చోట్ల ఇదే పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇలా ఒక్కరోజే నాలుగు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఒకచోట ఇద్దరు వలస జీవులు అసువులు బాయగా.. మరోచోట భార్యా భర్తలు మృతిచెందారు. మిగతా రెండు చోట్ల ఆరుగురు గాయాల పాలయ్యారు.
బంజారాహిల్స్‌లో (బ్లడ్ ఆల్కహాల్ 78)..
→ ఆదివారం అర్ధరాత్రి 1.35 గంటలకు..
→ రోడ్ నంబర్ 2లో రెయిన్‌బో ఆస్పత్రి ఎదురుగా..
→ మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఢీకొట్టడంతో.. దేవేంద్రకుమార్ (29), అయోధ్యరాయ్ (23) చనిపోయారు.
→ ప్రమాదానికి కారకులైన రోహిత్ గౌడ్‌కు 78, సోమన్‌కు 58 బీఏసీ (బ్లడ్ ఆల్కాహాల్ కౌంట్) వచ్చింది.
గండిపేట్‌లో (బ్లడ్ ఆల్కహాల్ 146)
→ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు..
→ గండిపేట చౌరస్తా నుంచి కోకాపేట వెళ్లే రహదారి
→ అతివేగంతో వస్తున్న క్వాలిస్ ఢీకొట్టడంతో కోకాపేటకు చెందిన దుర్గం రాజు (30), మౌనిక (25) దంపతులు చనిపోయారు.
→ కుమార్తె పుట్టిందన్న ఆనందంతో మద్యం తాగి వాహనం నడిపిన సంజీవ్‌కు ఏకంగా 146 బీఏసీ వచ్చింది.
→ ప్రమాద సమయంలో రాజు, మౌనిక దంపతులు బైక్‌పై రాంగ్‌రూట్లో వస్తున్నారు.
నార్సింగిలో (బ్లడ్ ఆల్కహాల్ 138)
→ ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంటకు..
→ గచ్చిబౌలి–నార్సింగి మధ్య రహదారి
→ మద్యం మత్తులో బైక్ నడుపుతూ ముందు వెళ్తున్న కారును ఢీకొట్టి గాయాల పాలైన కొల్లూరు యువకులు
→ బైక్‌పై ఉన్న శివకు 136, మూర్తికి 138 బీఏసీ వచ్చింది.
మాదాపూర్‌లో (బ్లడ్ ఆల్కహాల్ 116)
→ ఆదివారం రాత్రి 11.30 గంటలకు..
→ ఇనార్బిట్ మాల్ ఎదురు రహదారిపై..
→ వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో నలుగురు హోటల్ ఉద్యోగులకు తీవ్ర గాయాలు
→ ప్రమాదానికి కారణమైన నిఖిల్‌రెడ్డికి 116, అఖిల్‌కు 35 బీఏసీ వచ్చింది. ఈ ఇద్దరూ వైద్యులు కావడం గమనార్హం.
ఫుల్లుగా తాగి.. కిల్లర్స్‌లా..
యమ‘డ్రింకరులు’యమకింకరులను మించిపోతున్నారు. పగలూరాత్రీ తేడా లేకుండా మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రాణాలు తోడేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నగరంలోని బంజారాహిల్స్, నార్సింగిల్లో జరిగిన రెండు ఉదంతాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. నిషాకు తోడు మితిమీరిన వేగంతో తేలికపాటి వాహనాలు నడిపి నలుగురి ప్రాణాలను హరించారు. బంజారాహిల్స్ పరిధిలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వలస జీవులు అసువులు బాయగా, నార్సింగి ఉదంతంలో భార్యాభర్తలు బలయ్యారు. రెండు ఘటనలకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. – బంజారాహిల్స్,
మణికొండ
తెల్లారిన బతుకులు..
ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లా గోపాల్‌పురానికి చెందిన దేవేంద్రకుమార్ దాస్ (29), ఉత్తరప్రదేశ్‌కు చెందిన అయో ధ్య రాయ్ (23) బతుకు తెరు వు కోసం నగరానికి వలసవచ్చారు. బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని రెయిన్‌బో ఆస్పత్రిలో ఒకరు అసిస్టెంట్ కుక్ గా, మరొకరు ఆఫీస్ బాయ్ గా పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి విధుల్లో ఉన్న వీళ్లు తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో టీ తాగేందుకు బయటికి వచ్చారు. ఆస్పత్రి ఎదురుగా ఉన్న డివైడర్ దాటుతుండగా 1.35 గంటల ప్రాంతంలో నాగార్జున సర్కిల్ వైపు నుంచి మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన పోర్షే కారు వీరిని బలంగా ఢీకొంది. ప్రమాదం ధాటికి ఇద్దరూ గాల్లో కి ఎగిరి, డివైడర్ దాటి, మళ్లీ రెయిన్‌బో ఆస్పత్రి వైపు ఉన్న రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనాన్ని నడిపిన ఉప్పల్ రాఘవేంద్ర కాలనీకి చెందిన బజార్ రోహిత్ గౌడ్ (29) ఈఎల్‌వీ ప్రాజెక్ట్స్‌లో డైరెక్టర్. ఇతడి స్నేహితుడు వేదుల సాయి సోమన్ (27) రియల్ ఎస్టేట్ వ్యాపా రం చేస్తూ కర్మన్‌ఘాట్‌లో ఉంటున్నాడు. వీరిద్దరికి బంజారాహిల్స్ పోలీసులు బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షలు నిర్వహించగా రోహిత్ గౌడ్‌కు 78, సాయి సోమన్‌కు 58 చొప్పున బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) నమోదైంది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మృతుల్లో ఒకరైన దేవేంద్రకుమార్‌కు గత ఏడాదే వివాహమైంది. మరో అయిదు రోజుల్లో వివాహ వార్షికోత్సవం కోసం స్వస్థలానికి వెళ్లాలని భావించాడు. ఈ మేరకు సెలవు కూడా తీసుకున్నాడు. ఈలోపే మృత్యువు అతడిని కబళించింది.
మూడు చోట్ల మద్యం తాగారు..
ప్రమాదానికి కారణమైన రోహిత్ గౌడ్, సాయి సోమన్ ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు మూడు చోట్ల మద్యం తాగారు. తమ స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకల కోసం ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి పోర్షే కారులో దుర్గం చెరువు సమీపంలోని ఆలివ్ బిస్ట్రో పబ్‌కు వెళ్లారు. అక్కడ రాత్రి 8 గంటల వరకు స్నేహితులంతా మద్యం తాగారు. రాత్రి 8 గంటలకు అక్కడ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నం. 45 లోని ఫ్యాట్ పీజీయన్ పబ్‌కు వెళ్లి రాత్రి 11 వరకు మద్యం సేవించారు.
పోలీసులకు దొరికిపోతామని..
ఆ సమయంలో ఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేస్తే డ్రంక్ డ్రైవింగ్‌లో పోలీసులకు చిక్కుతామ ని భావించారు. దీంతో బం జారాహిల్స్ రోడ్ నం. 6లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ కు వచ్చి అక్కడ అర్ధరాత్రి 12.45 గంటల వరకు మద్యం తాగి సిగరెట్ల కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో కారులో తిరిగారు. మరోసారి మద్యం తాగడానికి రోడ్ నం. 2లోని పార్క్ హయత్ హోటల్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మద్యం మత్తులో ఉన్న రోహిత్ తన కారును గంటకు 100 కిమీ వేగంతో నడుపుతూ ప్రమాదానికి కారణమయ్యాడు.
వారిది రాంగ్‌రూట్... అతనిది మద్యం మత్తు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగిలో సోమవా రం మధ్యాహ్నం 1.30 గంట లకు మరో దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రయాణ దూరం తగ్గుతుందనే ఉద్దేశంతో రాం గ్‌రూట్‌లో ప్రయాణించిన భార్యాభర్తల్ని మద్యం మత్తు లో కారు తోలుతూ అతివేగం గా వచ్చి ఓ వ్యక్తి ఢీకొట్టాడు. దీంతో దంపతులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. నార్సింగి పరిధిలోని కోకాపేట గ్రామానికి చెందిన దుర్గం రాజు (30), మౌనిక (25) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మౌనిక గ్రామ డ్వాక్రా గ్రూపు రీసోర్స్ పర్సన్‌గా పని చేస్తోంది. సోమవారం ఉదయం వీరిద్దరూ గండిపేటలోని బ్యాంక్‌కు వెళ్లి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తిరుగు ప్రయాణమయ్యారు.
►గండిపేట చౌరస్తా నుంచి కోకాపేట వెళ్లేందుకు సీబీఐటీ కళాశాల వరకు వెళ్లి యూ టర్న్ చేసుకురావాల్సి ఉంటుంది. అది దూరం అవుతుందని భావించిన రాజు రాంగ్‌రూట్‌లో వెళ్లాడు. అదే సమయంలో శంకర్‌పల్లి మండలం మోకిలకు చెందిన సీహెచ్ సంజీవ్ మద్యం మత్తులో క్వాలిస్ వాహనంలో నార్సింగి వైపునకు వేగంగా వస్తున్నాడు.
►ఓషియన్ పార్కు సమీపంలోకి రాగానే అదుపు తప్పి ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న రాజు, మౌనికలను ఢీకొట్టాడు. ఆ ధాటికి ఎగిరి రోడ్డుపై పడిన దంపతుల తలలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రాంతం రక్తపు మడుగుగా మారిపోయింది. స్థానికులు ఇద్దరినీ సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో వీరి ముగ్గురు పిల్లలు దిక్కులేని వారయ్యారు.
కుమార్తె పుట్టిందనే ఆనందంలో..
క్వాలిస్ డ్రైవర్‌గా పని చేస్తున్న సంజీవ్ భార్య పుట్టిల్లు కోకాపేట. ఆదివారం రాత్రి కూతురు పుట్టడంతో ఆ సంతోషంలో అర్ధరాత్రి దాటే వరకు అతిగా మద్యం తాగాడు. సోమవారం ఉదయానికీ ఆ నిషా దిగలేదు. ఆ మత్తులోనే కుమార్తెతోపాటు భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు వస్తున్నాడు. ఇతడిని అదుపులోకి తీసుకున్న నార్సింగి పోలీసులు బ్రీత్ ఎనలైజర్‌తో తనిఖీ చేయగా బీఏసీ కౌంటు 146 వచ్చింది. పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
మరో ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు
మణికొండ: మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై వేగంగా పోతూ.. ముందు వెళ్తున్న కారును ఢీకొట్టి కింద పడటంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కొల్లూరుకు చెందిన శివ, మూర్తి మద్యం తాగారు. ద్విచక్ర వాహనంపై ఆదివారం అర్ధరాత్రి గచ్చిబౌలి నుంచి నార్సింగి వైపు వస్తున్నారు. ఔటర్‌రింగ్ రోడ్డు టోల్‌గేట్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న కారును ఢీకొట్టి కింద పడిపోయారు. సమాచారం అందు కున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రై వేటు ఆస్పత్రికి 108 అంబులెన్స్‌లో తరలించారు.
పాదచారులపై దూసుకెళ్లి..
హఫీజ్‌పేట్: కొండాపూర్ మసీద్‌బండకు చెందిన ముగ్గురు వైద్యులు నిఖిల్‌కుమార్ రెడ్డి (26), అఖిల్ రామకృష్ణరాజు (24), మెండు తరుణ్ (24) ఆదివారం రాత్రి 11.30 గంటలకు గచ్చిబౌలిలోని ఓ బార్‌కు వెళ్లారు. నిఖిల్, అఖిల్ ఇద్దరు మద్యం తాగగా.. తరుణ్ వారితో కాలక్షేపానికి కూర్చున్నాడు. మద్యం సేవించిన అనంతరం ముగ్గురు కలిసి కియా కారు (ఏపీ39డీఆర్7007)లో మాదాపూర్‌లోని ఇనార్భిట్ మాల్ మీదుగా వేగంగా వెళ్తున్నారు. మాదాపూర్‌లోని చెట్నీస్ రెస్టారెంట్‌లో పని ముగించుకుని వెళ్తున్న నలుగురు సిబ్బందిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు అయ్యాయి. కారుతో ఢీకొట్టిన యువకులే గాయపడినవారిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సమాచారం మేరకు మాదాపూర్ పోలీసులు మద్యం సేవించిన ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment