
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడటంతో రాష్ట్రంలో పొలిటికల్ ఫీవర్ మొదలైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 55 అసెంబ్లీ స్థానాలతో పాటు దుబ్బాకకు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఇక నియోజకవర్గంపై దృష్టి సారించనున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో గెలుపు టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానుంది.
ఉప ఎన్నికే అయినా.. వెంటనే వరుసగా ఇతర ఎన్నికలు రానుండటంతో ఇక్కడ ఆయా పార్టీలు సాధించే ప్రజాభిమానం భవిష్యత్ ఎన్నికలపై ప్రభావం చూపనుంది. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీలు పోటీపడతాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తుండగా, రాష్ట్రంలోని ఇతర పార్టీలు ఈ మూడింటికి మద్దతు తెలిపేందుకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చెలగాటం... ప్రాణ సంకటం
దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌కు చెలగాటం.. కాంగ్రెస్, బీజేపీలకు ప్రాణ సంకటం కానుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్ తరఫున రామలింగారెడ్డి నాలుగుసార్లు (ఒక ఉప ఎన్నికతో సహా) గెలుపొంది, ఒకసారి ఓడిపోయారు. గత 16 ఏళ్లలో 2009 మినహా దాదాపు అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ శ్రేణులే విజయం సాధించాయి. రామలింగారెడ్డి మృతి పట్ల సానుభూతితో పాటు ప్రభుత్వం అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలు, సీఎం సొంత జిల్లా కావడం, నియోజకవర్గంపై మంత్రి హరీశ్‌రావు నిరంతర పర్యవేక్షణ వెరసి ఇక్కడ టీఆర్‌ఎస్ గెలుపు కష్టసాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రామలింగారెడ్డి సతీమణి సుజాత లేదంటే కుమారుడు సతీశ్‌రెడ్డిల్లో ఒకరిని నిలబెడతారనే ప్రచారం మొదటి నుంచీ జరుగుతోంది. మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నా రామలింగారెడ్డి కుటుంబం వైపే కేసీఆర్ కూడా మొగ్గు చూపుతారని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే హరీశ్‌రావు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ గెలుస్తుందా.. లేదా.. అన్న దాని కన్నా ఎన్ని ఓట్లు మెజార్టీ వస్తుందన్న దానిపైనే చర్చ జరుగుతోంది.
ప్రత్యామ్నాయం... కింకర్తవ్యం
దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్, బీజేపీలు కూడా సిద్ధమవుతున్నాయి. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా టీజేఎస్‌కు కేటాయించినప్పటికీ అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ఉండి రెండో స్థానంలో నిలిచారు. ఈ దఫా పోటీకి జాబితాలో కోమటిరెడ్డి వెంకట నర్సింహారెడ్డి, నర్సారెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, కరణం శ్రీనివాస్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరిని ఎంపిక చేయాలని పార్టీ నేతలు ఢిల్లీకి సమాచారం కూడా పంపారు. ఇక్కడ ఎన్ని ఓట్లు వస్తాయి.. తమ అభ్యర్థి ఎన్నో స్థానంలో నిలుస్తారన్నది.. కాంగ్రెస్ భవిష్యత్‌పై ప్రభావం చూపనుంది.
ఇప్పటికే టీఆర్‌ఎస్, బీజేపీలు ప్రచారంలో అనధికారికంగా దూసుకుపోతున్న తరుణంలో కాంగ్రెస్ కూడా కార్యరంగంలోకి దిగేందుకు సన్నద్ధమవుతోంది. ఇక, ఈ ఉప ఎన్నిక బీజేపీకి కూడా అగ్నిపరీక్షే. ఒకరిద్దరు టికెట్ అడుగుతున్నా గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓటమి పాలయిన రఘునందన్ రావునే బరిలో దింపాలని కమలనాథులు యోచిస్తున్నారు.
ఈ మేరకు సంకేతాలు రావడంతో ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. గతంలో రెండుసార్లు ఓడిపోవడంతో ఈసారి సానుభూతి కలిసి వస్తుందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంమీద రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్, బీజేపీలలో ఎవరు ప్రత్యామ్నాయమన్నది ఈ ఉప ఎన్నిక స్పష్టం చేస్తుందని రాజకీయ వర్గాలంటున్నాయి. ఈ మూడు పార్టీలతో పాటు టీజేఎస్, కమ్యూనిస్టులకు కొన్ని ఓట్లున్నా పోటీ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. తటస్థంగా ఉండటం.. లేదంటే ఏదైనా పార్టీకి మద్దతు ప్రకటించడం వరకు ఆ పార్టీలు పరిమితమయ్యే అవకాశాలున్నాయి.
నవంబర్ 3న దుబ్బాక ఉపఎన్నిక
దుబ్బాక శాసనసభ స్థానానికి ఉపఎన్నిక నవంబర్ 3న జరగనుంది. ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటిం చింది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 16 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 17న నామినేషన్ల పరిశీలన, 19 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువును విధించారు.
నవంబర్ 10న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో తక్షణమే సిద్దిపేట జిల్లా పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. 2020 జనవరి 1 అర్హత తేదీగా (ఓటర్ల నమోదుకు) ఇప్పటికే ప్రకటించిన ఓటర్ల జాబితాను దుబ్బాక ఉప ఎన్నికల కోసం వినియోగించనున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి ఉన్న నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించాలని ఈసీఐ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment