
కుప్పంలో ఎన్నికల వేడి రాజుకుంది.. నోటిఫికేషన్ విడుదల కావడంతో నేతల్లో కాక మొదలైంది.. స్థానిక సంస్థల విజయంతో వైఎస్సార్‌సీపీలో ఆత్మవిశ్వాసం ఇనుమడించింది.. మున్సిపల్ పోరులోనూ జోరు కొనసాగించేందుకు సమాయత్తమవుతోంది.. వరుస ఓటములతో డీలా పడిన టీడీపీలో నైరాశ్యం ఆవరించింది.. అధినేత చంద్రబాబు పర్యటన సైతం కార్యకర్తల్లో ఉత్సాహం నింపలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కుప్పంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాలెట్ పద్ధతిలో పకడ్బందీగా పోలింగ్ నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కేటగిరీల వారీగా వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేసింది. 3 నుంచి 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు సన్నాహాలు చేస్తోంది. 8వ తేదీన బరిలో మిగిలే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనుంది. అనంతరం 15న పోలింగ్.. 17వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఈక్రమంలోనే జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
చిత్తూరు అర్బన్: జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీల్లో కదలిక మొదలైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు చావుతప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితి ఎదురైంది. ఎన్నో ఏళ్లుగా చిత్తూరు ఎంపీ స్థానం గెలుపులో కీలకంగా ఉన్న కుప్పం ప్రజలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రెడ్డెప్పకు జైకొట్టారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు క్లీన్‌స్వీప్ చేసి టీడీపీ అధినేతకు ఝలక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకుని సత్తా చాటాలని వైఎస్సార్‌సీపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.
పెండింగ్ స్థానాల్లోనూ ఎన్నికలు
కుప్పం పురపాలక సంఘంతో పాటు జిల్లాలో పెండింగ్‌లోని నగరి మున్సిపాలిటీ 16వ వార్డుకు, ఇతర నియోజకవర్గాల్లోని 2 జెడ్పీటీసీ, 39 ఎంపీటీసీ , 6 సర్పంచ్, 44 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో వార్డు మెంబర్, సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగే చోట పంచాయతీకి మాత్రమే కోడ్ వర్తిస్తుంది. జెడ్పీటీసీ ఎన్నిక నిర్వహించే ప్రాంతలో మొత్తం రెవెన్యూ డివిజన్‌లో కోడ్ అమల్లోకి వస్తుంది. ఎంపీటీసీ ఎన్నికైతే మండలానికి, పురపాలక వార్డుకు మొత్తం మున్సిపాలిటీకి ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఎస్‌ఈసీ పేర్కొంది.
ఎన్నికల షెడ్యుల్ ఇలా..
►3వ తేదీన వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ, ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
►5వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల దాఖలుకు గడువు
►6వ తేదీ ఉదయం 11 నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు అవకాశం
►8వ తేదీ సాయంత్రం పోటీలో మిగిలిన అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ
►15వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్ర 5గంటల వరకు పోలింగ్
►16వ తేదీ అవసరమైన బూత్‌లలో రీపోలింగ్
►17వ తేదీ ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment