సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు ప్రదర్శిస్తోంది. మనీల్యాండరింగ్ అభియోగాలతోపై ఈడీ, పేపర్ లీక్ కేసులోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న సిట్‌కు.. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని ఇదివరకే లేఖ రాసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. జైల్‌లో ఉన్న నిందితులను విచారించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు, అందుకు సంబంధించిన అనుమతులు మంజూరు చేయాలంటూ కోర్టుకు సైతం విజ్ఞప్తి చేసింది దర్యాప్తు సంస్థ.
ఈ మేరకు మార్చి 23వ తేదీన సిట్ దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ ఏసీపీకు ఈడీ ఓ లేఖ రాసింది. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ తమకు ఇవ్వాలని కోరిన ఈడీ.. మీడియా కథనాలు, పబ్లిక్ డొమైన్‌లో ఉన్న సమాచారం తదిరత వివరాల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. అంతేకాదు.. పీఎంఎల్ ఏ సెక్షన్ 50 కింద నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ స్టేట్‌మెంట్స్‌ను రికార్డ్ చేయనుంది ఈడీ.
ప్రస్తుతం చంచల్‌గూడ జైల్‌లో ఉన్న నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌లను నలుగురు అధికారులతో కూడిన బృందం విచారించనుందని ఈడీ కోర్టుకు తెలిపింది. పీఎంఎల్ యాక్ట్ సెక్షన్ 48, 49 కింద ఈడీకి విచారించే అర్హత ఉందని తెలిపింది. విచారణ సందర్భంగా జైల్‌లో లాప్ టాప్, ప్రింటర్ ,ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించాలని కోరుతూ కోర్టులో ఈడీ ఓ పిటిషన్ దాఖలు చేసింది. జైల్ లో విచారణ సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని చంచల్‌గూడా సూపరిడెంట్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును ఈడీ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment