సాక్షి, హైదరాబాద్: టీఎస్‌సీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఇందులో కీలక ఘట్టమైన క్రాస్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ఈ కేసులో అరెస్టు అయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను సరిపోల్చి చూడటం ద్వారా అడ్డదారిలో లబి్ధపొందిన అభ్యర్థులు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనేది తేల్చనుంది. మరోపక్క మంగళవారం హైకోర్టుకు సమర్పించేందుకు సమగ్ర స్టేటస్ రిపోర్టు సిద్ధం చేస్తోంది.
ఇందులో ఇప్పటివరకు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలు, తీసుకున్న చర్యలను వివరించనుంది. కమిషన్ నిర్వహించే ఆరు రకాలైన పరీక్షలకు సంబంధించిన 15 క్వశ్చన్ పేపర్లు లీకైనట్లు ఇప్పటికే సిట్ నిర్ధారించింది. వీటిలో గ్రూప్–1 ప్రిలిమ్స్ సహా నాలుగు పరీక్షలను కమిషన్ రద్దు చేయగా మూడింటిని వాయిదా వేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న కమిషన్ కార్యదర్శి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన పి.ప్రవీణ్‌కుమార్, టీఎస్‌పీఎస్సీ మాజీ నెట్‌వర్క్ అడ్మిన్ ఎ.రాజశేఖర్‌రెడ్డి సహా మొత్తం 17 మంది నిందితులను సిట్ అరెస్టు చేసింది.
వీరిలో డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పేపర్ ఖరీదు చేసిన ఖమ్మం జంట మినహా మిగిలిన 15 మందినీ సిట్ అధికారులు న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ప్రవీణ్, రాజశేఖర్ సహా నలుగురి విషయంలో అదనపు కస్టడీ ప్రక్రియా జరిగింది. కాగా ఈ కేసు దర్యాప్తులో వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు బృందాలుగా మారి నిందితులను విచారించారు. దాదాపు 37 ప్రశ్నలతో కూడిన క్వశ్చనీర్ ఆధారంగా ముందుకు వెళ్లారు. తొలుత నిందితులను విడివిడిగా, ఆపై ఒకరిద్దరిని కలిపి ఇలా వేర్వేరు పంథాల్లో విచారించిన అధికారులు ప్రతి ఒక్కరి నుంచి ప్రతి సందర్భంలోనూ వాంగ్మూలాలు నమోదు చేశారు. వీటన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేయడం కోసం ఓ ప్రత్యేక క్రాస్ వెరిఫికేషన్ బృందం సిట్‌లో ఏర్పాటైంది.
వాంగ్మూలాల్లో తేడాలు తేల్చేందుకే..
వాంగ్మూలాల మధ్య ఎక్కడైనా తేడాలు ఉన్నాయా? ఒకే వ్యక్తి చెప్పిన, వేర్వేరు నిందితులు ఒకే అంశంపై ఇచి్చన సమాచారంలో అనుమానాస్పద అంశాలు ఉన్నాయా? అనేది ఈ ప్రక్రియ ద్వారా గుర్తించనున్నారు. అలాగే నిందితుల కాల్ డిటెయిల్స్, వాట్సాప్ చాటింగ్స్‌లతో పాటు బ్యాంకు లావాదేవీలు, యూపీఐ విధానంలో జరిగిన నగదు బదిలీలు, ఆయా సమయాల్లో వీరి లొకేషన్స్ ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ క్రాస్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
ఈ ప్రక్రియ ద్వారా దర్యాప్తులో మిస్సైన లింకులతో పాటు అడ్డదారిలో లబి్ధపొందిన అభ్యర్థులను గుర్తించాలని సిట్ నిర్ణయించింది. ఖమ్మం జంటను కస్టడీలోకి తీసుకుని విచారించడం మినహా మిగతా దర్యాప్తు దాదాపు పూర్తయింది. తదుపరి న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలను బట్టి సిట్ అధికారులు ముందుకు వెళ్లనున్నారు.
చదవండి: అవరోహణ విధానంలో గురుకుల పోస్టుల భర్తీ
Comments
Please login to add a commentAdd a comment