
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం)కు విద్యుత్ నియంత్రణ మండలి షాక్ ఇచ్చింది. గత మూడేళ్లకు సంబంధించి దాఖలు చేసిన వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్‌ఆర్) నివేదికలు విచారణార్హమైనవి కావంటూ వెనక్కు పంపింది. డిస్కంలు సమర్పించిన ఏఆర్‌ఆర్‌ల విచారణార్హతపై సోమవారం విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు ఎం.డి.మనోహర్‌రాజు, బండారు కృష్ణయ్యలు విచారణ నిర్వహించారు.
ఈ విచారణకు ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డితోపాటు డిస్కంల తరఫు న్యాయవాదులు హాజరయ్యారు. ఈ నివేదికల్లో టారిఫ్ (విద్యుత్ చార్జీల పెంపు) ప్రతిపాదనలను సమర్పించనందున ఏఆర్‌ఆర్‌లను విచారణ జరపాల్సిన అవసరం లేదని మం డలి సభ్యులు తేల్చారు. ఒకవేళ మూడేళ్ల టారిఫ్ ప్రతిపాదనలు సమర్పిస్తే విచారణ జర పాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. భాగస్వామ్యపక్షాల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలు తీసుకున్నాకే నిర్ణ యిస్తామని వెల్లడించారు.
2022–23 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ ప్రతిపాదనలపై కసరత్తు జరుగుతోందని, 10 రోజుల గడువు ఇవ్వాలని డిస్కంలు ఈఆర్సీని కోరగా వారంకన్నా ఎక్కువ సమయం ఇవ్వలేమని ఈఆర్సీ తేల్చిచెప్పింది. ఈ నెల 27లోగా ప్రతిపాదనలను కండోల్ పిటిషన్ రూపంలో సమర్పించా లని ఆదేశించింది. టారిఫ్ ప్రతిపాదనలు డిస్కంలు ఇవ్వకపోయినా తామే సుమో టోగా తీసుకొని విచారణ జరిపే అధికారాల గురించి కూడా ఈఆర్సీ అన్వేషిస్తోంది.
ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ అలా జరగలేదని, డిస్కంలు ప్రతిపాదించకుండా టారిఫ్ ఉత్తర్వులు ఈఆర్సీ ఇవ్వజాలదని, యూపీలో డిస్క ంలకు జరిమానా మాత్రం విధించారని ఈఆర్సీ చైర్మన్ దృష్టికి నిపుణులు తీసుకువచ్చారు. దీంతో ఏం చేయాలన్న దానిపై ఈ నెల 27 వరకు ఈఆర్సీ వేచిచూసే ధోరణిలో వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
సీఎం ఆమోదిస్తేనే...: వాస్తవానికి చాలాకాలం తర్వాత ఈఆర్సీకి విద్యుత్ పంపిణీ సంస్థలు ఏఆర్‌ఆర్‌లను దాఖలు చేశాయి. ఈ ఏడాది నవంబర్ 30న 2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాల ఏఆర్‌ఆర్‌లను దాఖలు చేసినా టారిఫ్ ప్రతిపాదనలు చేయలేదు. దీంతో ఈ నెల 10లోగా ప్రతిపాదించాలని ఈఆర్సీ డిస్కంలకు నోటీసులిచ్చింది.
టారిఫ్ ప్రతిపాదనలకు సంబంధించి మంత్రుల స్థాయిలో మూడుసార్లు సమావేశం జరగ్గా ముసాయిదా ప్రతిపాదనలకే మోక్షం లభించింది. ఈ ముసాయిదాను కేసీఆర్ ఆమోదించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈఆర్సీ ఈ నెల 27 వరకు గడువిచ్చింది. ఆలోగా సీఎం ఆమోదిస్తేనే ప్రతిపాదనలు సమర్పించగలమని అధికారులు చెబుతున్నారు.