సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల కోసం ఇప్పటి వరకు కేటాయించిన భూములకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కేటాయించిన భూముల్లో వినియోగంలో లేని వాటి వివరాలతోపాటు ఏర్పాటైన పరిశ్రమల స్థితిగతులపైనా నివేదిక సమర్పించాలన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలసి సోమవారం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
కొత్త పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసేందుకు వీలుగా హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్)కు వెలుపల.. కొత్తగా నిర్మితమయ్యే రీజినల్ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్)కు లోపల ఉండేలా భూములు గుర్తించాలన్నారు. విమానాశ్రయాలు, జాతీయ, రాష్ట్ర రహదారులకు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలోపు 500 నుంచి 1,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ భూములు ఉండాలని రేవంత్ సూచించారు.
సాగుకు యోగ్యం కాని భూముల్లో...
సాగుకు యోగ్యం కాని భూములనే పరిశ్రమల ఏర్పాటుకు సేకరించడం ద్వారా రైతులకు నష్టం జరగదని రేవంత్ పేర్కొన్నారు. తద్వారా కాలుష్య సమస్య తగ్గడంతోపాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో నివాస ప్రాంతాలకు దూరంగా ఉండే ప్రభుత్వ, బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
తద్వారా తక్కువ ధరలో భూములుఅందుబాటులోకి రావడంతోపాటు భూసేకరణకు రైతులు కూడా సహకరిస్తారన్నారు. కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని, హైదరాబాద్‌లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామిక వాడల తరలింపునకు ప్రత్యామ్నాయం సూచించాలని చెప్పారు. బల్క్‌డ్రగ్ ఉత్పత్తుల కంపెనీల ఏర్పాటుకు సంబంధించి మధ్యప్రాచ్య, యూరోపియన్ దేశాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు.
థర్మల్ విద్యుత్ బదులు సోలార్ పవర్
పారిశ్రామిక అవసరాల కోసం థర్మల్ విద్యుత్‌కు బదులుగా సౌర విద్యుత్‌ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని, బాలానగర్ ఐడీపీఎల్ భూముల పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment