కామారెడ్డి జిల్లాలో అధికారుల సర్వే
సొంతూళ్లలోనే పింఛన్ అందించేందుకు కసరత్తు
సాక్షి, కామారెడ్డి: పింఛన్‌దారుల కష్టాలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. చేయూత ద్వారా అందుతున్న పింఛన్లు సొంతూళ్లలోనే తీసుకుంటున్నారా? వేరే ఊళ్లకు వెళ్లాల్సి వస్తుందా? అన్నదానిపై క్షేత్ర స్థాయిలో పరిశీలన జరుగుతోంది.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన లబ్దిదారులకు ఎల్లారెడ్డిలో, ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లికి చెందిన లబ్దిదారులకు కామారెడ్డిలో పింఛన్లు ఇస్తున్న విషయంపై ఈ నెల 18న ‘పింఛన్ కోసం 50 కిలోమీటర్లు’శీర్షికన ‘సాక్షి’మెయిన్‌లో ప్రచురితమైన కథనంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించారు.
పింఛన్‌దారుల కష్టాలపై వెంటనే అధికారులను నివేదిక అడిగారు. ఇదే సమయంలో జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలతో పాటు ఆయా మండలాల్లో ఒక చోట పింఛన్ మంజూరై, మరో చోట పింఛన్ తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్న పింఛన్‌దారుల వివరాలను సేకరించాలని ఆదేశించారు. దీంతో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.చందర్ ఆయా మున్సిపల్ కమిషనర్లు, ఆయా మండలాల ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 21న సాయంత్రం 4 గంటలలోపు వివరాలను మెయిల్ చేయడంతో పాటు సాఫ్ట్ కాపీ అందించాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై శుక్రవారం సాయంత్రానికి స్పష్టత రానుంది.
తీరనున్న పండుటాకుల కష్టాలు...
పింఛన్ కోసం పండుటాకులు పడుతున్న కష్టాలకు త్వరలోనే పరిష్కారం దొరకనుంది. ‘సాక్షి’కథనంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. ఏడాదిన్నర కాలంగా సమస్య ఉంటే ఎందుకు పరిష్కరించలేదని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
జాబితా రూ పొందించిన తరువాత చేయూత పింఛన్‌దారులకు వారి వారి గ్రామాల్లోనే పింఛన్ అందే ఏర్పాట్లు చేయనున్నారు. దీంతో వారి కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment