అలుగుపారుతున్న ముశ్రీఫా నూతన చెక్ డ్యాం
వాగులకు జలకళ
కోస్గి: మండలంలో మూడు రోజులుగా వర్షాలు జోరుగా కురుస్తుండటంతో పాటు ముశ్రీఫా, బిజ్జారం వాగుల్లో నూతనంగా నిర్మించిన చెక్ డ్యాంల్లో వర్షం నీరు నిలిచి వాగులకు జలకళ సంతరించుకుంది. ముశ్రీఫా వాగులో చెక్ డ్యాం నిండి పైనుంచి నీటి ప్రవాహం మొదలైంది. బిజ్జారం వాగులో సైతం చెక్ డ్యాం వరకు నీరు చేరింది. సోమవారం రాత్రి మండలంలో 4.1 సెం.మీ వర్షం నమోదు కాగా ముశ్రీఫా, బిజ్జారం చెక్ డ్యాంల నిర్మాణంతో ముంగిమళ్ల, కొత్తపల్లి వాగులు నీటి ప్రవాహంతో ఆకట్టుకున్నాయి. రెండు రోజుల ముందు నుంచే మండలంలోని ముంగిమళ్ల రామస్వామి కత్వ అలుగు పారడంతో పాటు ముశ్రీఫా చెక్ డ్యాం సైతం అలుగుపారడంతో ఈ దృశ్యాల్ని చూసేందుకు మండల ప్రజలు తరలివెళ్తున్నారు.
సాక్షి, సిరికొండ(బోథ్):వాననీటిని ఒడిసి పట్టాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోంది. చినుకులా రాలిన నీటి బిందువులు ఏకమై వరదలా పారుతూ వాగుల ద్వారా చెక్‌డ్యామ్‌లలోకి చేరుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిరికొండ మండలంలో నిర్మించిన చెక్‌డ్యాం నిండి ఇలా మత్తడి పోస్తోంది.
మత్తడి దుముకుతున్న ‘భద్రకాళి’
సాక్షి, వరంగల్: నగరంలోని చారిత్రక భద్రకాళి చెరువు పరవళ్లు తొక్కుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిండుకుండలా మారింది. మంగళవారంనుంచి చెరువు మత్తడి పోస్తోంది. నగరవాసులు ఈ దృశ్యాన్ని చూసి పరవశించిపోయారు. కొంతమంది ఫొటోలు దిగారు. మరికొందరు ఈత కొట్టారు.
మోగి తుమ్మెద వాగుకు జలకళ
నంగునూరు(సిద్దిపేట): రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నంగునూరు మండలం గుండా పారే మోగి తుమ్మెద వాగు జలకళ సంతరించుకుంది. సోమవారం కురిసిన వర్షానికి వాగు పరివాహక ప్రాంతంలో నుంచి భారీగా వరద నీరు చేరింది. మంగళవారం ఉదయం ఖాత గ్రామంలో నిర్మించిన చెక్‌డ్యాం నిండి మత్తడి పారింది.
ఘణపూర్ వద్ద నిండిన చెక్‌డ్యాం
సింగూరుకు జలకళ
సాక్షి, సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. నాలుగు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్ట్‌లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈసారి వర్షాలు బాగా కురిసి ప్రాజెక్ట్ పూర్తిగా నిండితే యాసంగికి ఎలాంటి డోకా ఉండదని రైతులు మురిసిపోతున్నారు. కెనాల్ ద్వారా సాగుకు నీళ్లు అందుతాయనే ఆనందంలో ఉన్నారు. తుకం పోసి వరి నాట్లకు సిద్ధమయ్యారు. వర్షాలు సరిగా కురిసినా.. కురవకపోయినా ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండితే చాలని పేర్కొంటున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.982 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి 2,593 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో కొనసాగుతుండగా, 386 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో అవుతోంది. సోమవారం కురిసిన వర్షానికి 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఏఈ మదర్ తెలిపారు. రెండు మూడు రోజులు ఇలాగే వర్షం కురిస్తే జలాశయం పూర్తి సామర్థ్యం చేరుకోవచ్చని ఇరిగేషన్ ఈఈ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment