
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శనివారం ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. మరోవైపు ఈ నెల 23న వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.