రెండు నెలల పాపను తల్లిదండ్రులకు అందజేస్తున్న కమిషనర్ అంజనీ కుమార్
సాక్షి, చాంద్రాయణగుట్ట: కిడ్నాప్ అయిన రెండు నెలల శిశువును ఫలక్‌నుమా పోలీసులు ఆరు గంటల్లోనే ఛేదించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఓ యువకుడితో పాటు ఇద్దరు మహిళలను గురువారం అరెస్టుచేశారు. పురానీహవేలీలోని పాత పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, దక్షిణ మండలం డీసీపీ గజరావ్ భూపాల్‌తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. షేక్ బషీర్(35), సుల్తానా (31) దంపతులు ఫారూక్‌నగర్ ఫుట్‌పాత్‌పై ఉంటూ యాచకవృత్తిని కొనసాగిస్తున్నారు. వీరికి షేక్ అబ్దుల్లా (2), కుమార్తె మరియం (రెండు నెలల వయసు) సంతానం. ఈ నెల 11న అర్ధరాత్రి ఆటోలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు రెండు నెలల పసికందును కిడ్నాప్ చేశారు.
దీంతో తల్లిదండ్రులు ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫలక్‌నుమా ఇన్‌స్పెక్టర్ ఆర్.దేవేందర్ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ ఆటో అనుమానాస్పదంగా తిరగడం గమనించారు. సలామీ ఆసుపత్రి దగ్గరలోని ఓ ఇంటి ముందు ఆటో పార్కు చేసి ఉండడంతో వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా పాప కనిపించింది.ఈ ఘటనకు కారణమైన ఆటోడ్రైవర్ సయ్యద్ సాహిల్(19), అతని భార్య జబీన్ ఫాతీమా(19), సోదరి ఫాతిమా (23)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కిడ్నాప్‌ను చేధించిన పోలీసులను ఈ సందర్భంగా కమిషననర్ అభినందించారు. కమిషనర్ అంజనీకుమార్ పాపను తన చేతుల మీదుగా తల్లిదండ్రులకు అప్పగించారు.
సంతానం లేనందుకే..
నిందితుడు సయ్యద్ సాహిల్‌కు సంతానం లేని కారణంగానే కిడ్నాప్‌కు పాల్పడ్డాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment