సాక్షి, హైదరాబాద్: సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి నుంచి ఆరు రోజుల చిన్నారి చేతనను కిడ్నాప్ చేసిన మహిళను సరూర్‌నగర్ సమీపంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన నైనా రాణిగా గుర్తించారు. ఆమెకు పిల్లలు పుట్టరనే ఉద్దేశంతో పెంచుకోవడానికే శిశువును ఎత్తుకుపోయినట్లు వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, నిందితురాలిగా తేలడంతో నైనా రాణిని అరెస్టు చేశామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈస్ట్‌జోస్ డీసీపీ ఎం.రమేశ్, సుల్తాన్‌బజార్ ఏసీపీ డాక్టర్ ఎం.చేతన, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చైతన్యకుమార్‌తో కలసి గురువారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు.
మొదటి భర్త మరణం.. రెండుసార్లు అబార్షన్
బీదర్ సమీపంలోని ఖాసింపురకు చెందిన నైనా రాణి తండ్రి దర్జీ. తల్లి గృహిణి. ఈమెకు అన్న, తమ్ముడు ఉన్నారు. నైనాను నాలుగేళ్ల క్రితం బీదర్‌కే చెందిన రమేశ్‌కు ఇచ్చి వివాహం చేశారు. కొన్ని రోజులకే అత డు చనిపోవడంతో మూడేళ్ల క్రితం జహీరాబాద్ వాసి సీమన్‌తో రెండో వివాహం చేశారు. ప్రస్తుతం సీమన్ ఎన్టీఆర్ నగర్ మార్కెట్‌లో పండ్ల వ్యాపారం చేస్తుండగా నైనా ఇంటి పట్టునే ఉంటోంది. రెండుసార్లు గర్భస్రావం కావడంతో తనకిక పిల్లలు పుట్టరని భావించింది.
ఏడు నెలల క్రితం తాను గర్భవతినని తల్లిని, భర్త సీమన్‌నూ నమ్మించింది. ఎన్టీఆర్ నగర్‌తో పాటు బీదర్, జహీరాబాద్‌లోని సోదరి ఇళ్లల్లో గడుపుతూ తాను గర్భవతినని ప్రచారం చేసుకుంది. తాను ప్రసవించానని చెప్పి శిశువుతో ఇంటికి వెళ్లే సమయం వచ్చిందని భావించిన నైనా.. నవజాత శిశువు కోసం శనివారం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రికి వచ్చింది. సోమవారం ఇద్దరు చిన్నారుల్ని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించి విఫలమైంది. చివరకు చేతనను వాక్సినేషన్ పేరుతో కిడ్నాప్ చేసింది.
ఆమె మాట నమ్మని కుటుంబీకులు..
ఆస్పత్రి నుంచి చిన్నారిని ఎత్తుకువెళ్లిన తర్వాత బీదర్‌లో ఉన్న కుటుంబీకులతో తనకు జహీరాబాద్‌లోని సోదరి ఇంటి వద్ద ప్రసవం అయిందని, ఆడపిల్ల పుట్టిందని చెప్పింది. భర్తకు ఫోన్ చేసి ఇదే విషయం చేరవేసింది. ఆస్పత్రి నుంచి నేరుగా ఎంజీబీఎస్‌కు వెళ్లిన నైనా.. అక్కడి దుకాణంలో పాలు కొని ప్రతి రెండు గంటలకూ శిశువుకు పట్టిస్తూ హైదరాబాద్ నుంచి బీదర్ వెళ్లింది. నయాకమాన్ ప్రాంతంలో బస్సు దిగి.. షాగంజ్‌లో మరో వ్యక్తితో పాటు ఉంటున్న తమ్ముడి రూమ్‌కు వెళ్లింది.
తాను ప్రసవించానంటూ అతడికి చేతనను చూపించింది. ఆమె మాటలు నమ్మని అతడు అన్నకు సమాచారం ఇచ్చాడు. అతడితో పాటు తల్లిదండ్రులూ షాగంజ్ చేరుకుని చిన్నారిని చూశారు. చిన్నారి బొడ్డును చూడటంతో పాటు నైనా స్థితిని పరిశీలించిన ఆమె తల్లి శిశువు విషయం అనుమానించి జహీరాబాద్‌లోని సోదరికి ఫోన్ చేసి ఆరా తీయగా అబద్ధంగా నిర్థారణ అయింది. సోమవారం రాత్రి తమ్ముడి రూమ్‌లోనే ఉండిపోయి పరిణామాలపై అంతా చర్చించారు.
అరెస్టు అవుతామని భయపడి..
మంగళవారం ఉదయానికి మీడియాలో కిడ్నాప్‌పై ప్రతి 5 నిమిషాలకు అప్‌డేట్స్ ప్రసారమయ్యాయి. దీంతో అరెస్టు అవుతామని భయపడిన నైనా, ఆమె కుటుంబీకులు ఏం చేయాలని ఆలోచించారు. నైనా అన్న స్నేహితుడైన ఉత్తర కన్నడ పత్రిక రిపోర్టర్‌ను సంప్రదించాడు. శిశువును ప్రభుత్వాస్పత్రిలో వదిలేద్దామని సలహా ఇచ్చిన అతగాడు నైనా అన్నతో కలసి బైక్‌పై శిశువును తీసుకువెళ్లి బీదర్ ఆస్పత్రిలో వదిలేశాడు.
ఈ విషయాన్ని న్యూటౌన్ ఠాణాలో పని చేసే ఎస్సైకు చెప్పాడు. అతడు బీదర్‌లో ఉన్న హైదరాబాద్ టీమ్‌కు సమాచారం ఇచ్చాడు. వీరు మంగళవారం సాయంత్రం శిశువును స్వాధీనం చేసుకుని బుధవారం హైదరాబాద్ తీసుకువచ్చారు. బీదర్ ఆస్పత్రిలోని సీసీ కెమెరాల్లో ఫీడ్‌ను పరిశీలించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులు శిశువును వదిలినట్లు, ఓ సెక్యూరిటీ గార్డుతో మాట్లాడినట్లు గుర్తించారు. సెక్యూరిటీ గార్డును విచారించగా అతడు విలేకరి పేరు చెప్పాడు.
ఇలా విలేకరిని, అతడి ద్వారా నైనా అన్న, తమ్ముడు, అతడి రూమ్మేట్‌ను పట్టుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో మాలెగావ్ ప్రాంతంలోని పెద్దమ్మ ఇంట్లో తలదాచుకున్న నైనాను గురువారం తెల్లవారుజామున పట్టుకుని హైదరాబాద్ తరలించారు. పోలీసులు ఖాసింపుర వెళ్లే సమయానికి తన బిడ్డను చూసుకోవడానికంటూ ఎన్టీఆర్ నగర్ నుంచి సీమన్ సైతం అక్కడకు చేరుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment