సాక్షి, నల్గొండ: పెళ్లి భోజనం పెట్టనందుకు కుల పెద్దలు ఓ కుటుంబానికి రూ. లక్ష జరిమానా విధించి, కులం నుంచి బహిష్కరించారు. జరిమానా చెల్లిస్తేనే కులదైవం గంగదేవమ్మ పండుగలో తమతో కలిసి పాల్గొనే అర్హత ఉంటుందంటూ ఆదేశించడంతో బాధితులు పోలీసులను, మీడియాను ఆశ్రయించారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని ఏపీ లింగోటంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యాదవ కులస్థులు ఉగ్గేపల్లి లక్ష్మయ్య, రాములమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాస్ వివాహాన్ని గ్రామంలోనే ఏప్రిల్ 27న జరిపించారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో బంధువులను పెళ్లికి ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకున్న కుల పేద్దలు కులస్థులను, గ్రామస్థులకు విందు భోజనం ఏర్పాటు చేయనందుకు ఆగ్రహించారు.
గ్రామంలో జరగనున్న కులదైవం గంగదేవమ్మ పండుగకు ఆనవాయితీ ప్రకారం లక్ష్మయ్య కుటుంబం ఇచ్చిన నగదును(పట్టి) నిర్వాహకులు తిరిగి ఇచ్చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. కుమారుడి పెళ్లికి విందు ఏర్పాటు చేయనందుకు కుల బహిష్కరణ విధిస్తున్నట్లు చెప్పారు. తమను అవమానించిన కుల పెద్దలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, డీజీపీ, నల్లగొండ కలెక్టర్, ఎస్పీలకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. ఇలాంటి ఆధునిక యుగంలో కూడా కుటుంబాలను వేలేస్తూ, విధించిన జరిమానా కట్టాలని వేధిస్తున్న వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. దీంతో స్థానిక నార్కట్ పల్లి పోలీసులు, తహశీల్దార్ దీనిపై గ్రామంలోకి వెళ్లి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment