eviction
-
బంగ్లా ఖాళీ చేయడంపై రాహుల్ లేఖలో ఏమన్నారంటే..
రాహుల్ గాంధీకి అనర్హత వేటు పడిన తర్వాత ఆయన నివాసముంటున్న అధికారిక బంగ్లా ఖాళీ చేయాలని సోమవారం లోక్‌సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ భవనం న్యూఢిల్లీలోని తుగ్లక్ లేన్ 12లో ఉంది. రాహుల్ వాస్తవానికి జెడ్ ప్లస్ ప్రొటెక్షన్‌తో 2005 నుంచి అదే బంగ్లాలో ఉంటున్నారు. నోటీసులు అందుకున్న తర్వాత రాహుల్ లోక్‌సభ సెక్రటేరియేట్ కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో.. ఆ బంగ్లాతో ముడిపడి ఉన్న కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. గత నాలుగు పర్యాయాలుగా లోక్‌సభకు ఎన్నికైన సభ్యుడిగా ప్రజలిచ్చిన తీర్పుతో ఇక్కడ ఉంటున్న నాకు ఈ భవనంతో చిరస్మరణీయ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. నన్ను ఎన్నుకున్నందుకు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, అలాగే నా హక్కులకు భంగం వాటిల్లకుండా లేఖలో పేర్కొన్న వాటికి కట్టుబడి ఉంటాను అని రాహుల్ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే డిస్ క్వాలిఫై అయ్యాను కాబట్టి, నిబంధనల మేరకు నడుచుకుంటానని, లోక్ సభ సభ్యత్వం ద్వారా సంక్రమించిన బంగాళాను ఖాళీ చేస్తానని తెలిపారు. అయితే బంగళా ఖాళీ చేయాలన్న లోక్ సభ సెక్రటేరియట్ ఆదేశంపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. దీనిపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ ను దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని, తుగ్లక్ లేన్ లో ఉన్న బంగ్లా ఖాళీ చేస్తే రాహుల్ తన తల్లితో కలిసి ఉండొచ్చని, లేదా తనకు కేటాయించిన బంగళా అయినా వాడుకోవచ్చని ఖర్గే తెలిపారు. అయినా రాహుల్‌ని భయపెట్టి, బెదిరించడం, అవమానించడం సరికాదని, ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఖర్గే అన్నారు. (చదవండి: ప్రధాని ఇమేజ్‌ని డ్యామేజ్ చేయటం అంత ఈజీ కాదు!: స్మృతి ఇరానీ) -
సుప్రీంకోర్టు కీలక ఆదేశం, 50వేల మందికి ఊరట.. ఎవరు వీరు? ఎక్కడి వాళ్లు?
సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే వాళ్లంతా ఈ పాటికి రోడ్డున పడేవాళ్లే. చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోయేవాళ్లే. ఎముకలు కొరికే చలిలో చంటిపిల్లలు, వృద్ధులు, గర్భిణులతో నానా అంతా అగచాట్లు పడేవారే. ‘ఇది రైల్వే స్థలం. మీరు వారం రోజుల్లోగా ఖాళీ చేయాలనేది’ హైకోర్టు ఆదేశం అని స్థానిక అధికారులు చెప్పగానే వాళ్లంతా నెత్తినోరూ బాదుకున్నారు. ‘‘మానవత్వం ఉన్న వాళ్లు ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా? నిలువ నీడ లేకుండా చేస్తారా?’’ అని మొత్తుకున్నారు. ప్రార్థనలు చేశారు. బైఠాయించారు. ప్రభుత్వం దృష్టికి తమ గోడును తీసికెళ్లేందుకు కొవ్వొత్తుల ప్రదర్శన వంటి నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. ఎవరు వీరు? ఎక్కడి వాళ్లు? ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న ప్రదేశంలో అనేక మంది కాపురం ఉంటున్నారు. వాటిని గఫూర్ బస్తీ, ఢోలక్ బస్తీ, ఇందిరానగర్ అని పిలుస్తారు. అక్కడ ఇళ్లే కాదు. ప్రభుత్వ పాఠశాలలున్నాయి. నాలుగు గుళ్లు, పది మసీదులు, ఒక బ్యాంకు, కొన్ని షాపులు ఉన్నాయి. వాళ్లంతా నిరుపేదలు. అందులో ఎక్కువ మంది ముస్లింలు. దాదాపు నాలుగువేల కుటుంబాలు. మొత్తం 50వేల మంది దాకా ఉంటారు. ఇవన్నీ ఒక్క రోజులో వచ్చినవి కాదని చూసిన వాళ్లకు ఎవరికైనా అర్థం అవుతుంది. కొన్ని దశాబ్దాలుగా ఉంటున్న వాళ్లు హఠాత్తుగా ఆక్రమణదారులు ఎలా అవుతారు. ముందూ వెనక చూడకుండా, ఒక ప్రత్యామ్నాయం అనేది చూపకుండా ప్రభుత్వం వాళ్లని ఖాళీ చేయమని ఎలా చెబుతుంది? రైల్వే శాఖ ఏం చెబుతోంది? కొంత మంది అక్కడ భూమిని లీజుకు తీసుకున్నారు. కొంత మంది భూమిని ప్రభుత్వవేలంలో కొనుక్కున్నారు. జిల్లా కోర్టుల్లో దీనికి సంబంధించిన అర్జీలు కూడా ఉన్నాయి. చాలా మంది దగ్గర చట్టబద్ధమైన పత్రాలున్నాయని కూడా చెబుతున్నారు. ఈశాన్య రైల్వేశాఖ ఈ భూమి విషయంలో పొంతనలేని వాదనలు చేస్తోంది. ఒకసారి 78 ఎకరాలు ఆక్రమించారని చెబితే, మరోసారి 29 ఎకరాలు ఆక్రమణ పాలయిందని చెబుతోంది. 2014లో ఈ అంశంపై ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలయినప్పుడు అక్కడ నిర్వాసితులను ఆక్రమణదారులు అని పేర్కొనకపోవటం గమనార్హం. గతంలో ఈ వివాదాన్ని పరిష్కరించటానికి ఒక ఎస్టేట్ అధికారిని నియమించారు. ఆయన ఈ స్థలం రైల్వేదని తేల్చేశారు. 2017లో కూడా హైకోర్టు ఒకసారి అక్కడున్నవారిని ఖాళీ చేయించాలని ఆదేశిస్తే, అప్పుడు బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఏం చెప్పింది? ఈ భూమిపైన హల్ద్వానీ నివాసితులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులేదని భావించిన ఉత్తరాఖండ్ హైకోర్టు తక్షణం వారిని తొలగించాలని ఆదేశించింది. అవవసరమైతే సాయుధ బలగాల సహకారం తీసుకునయినా అక్కడున్న వాళ్లని తరిమివేయటానికి, రైల్వే అధికారులకు, జిల్లా యంత్రాంగానికి అనుమతులిచ్చింది. దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేసిన సామాజిక కార్యకర్త, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు ఎస్.ఎ.నజీర్, పి.ఎస్.నరసింహతో కూడిన బెంచీ దీనికి సానుకూలంగా స్పందించింది. ‘‘ఇది మానవీయ సమస్య. దీనికి ఆచరణ యోగ్యమైన పరిష్కారం కనుగొనాలి’’ అని సూచించింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, రైల్వేశాఖకు నోటీసులు జారీ చేసింది. ఒక పద్ధతి ప్రకారమే మేం ముందుకు వెళుతున్నామని రాష్ట్రప్రభుత్వం పేర్కొన్నా, దశాబ్దాలుగా ఉంటున్న వారిని సాయుధ పోలీసు బలగాలు ఉపయోగించి ఎలా ఖాళీ చేయిస్తారని న్యాయమూర్తులు నిలదీశారు. ఆశ్రయం పొందే హక్కు (రైట్ టు షెల్టర్): ఆశ్రయం పొందే హక్కుఅనేది భారతదేశంలో వివాదాస్పదమైన హక్కుగా చెప్పుకోవాలి. పునరావాస కల్పన అనే దాన్ని ప్రభుత్వాలు కూడా అంతగా పట్టించుకోవు. ఆశ్రయం పొందే హక్కు అనేది రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద ప్రతి ఒక్కరికీ లభించే హక్కు. సుప్రీంకోర్టు 1996లో ఒక కేసులో ( చమేలి సింగ్ vs స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్) ఈ మేరకు తీర్పునిచ్చిన విషయం గమనార్హం. పునరావాసం, ఆశ్రయం పొందే హక్కులను సంబంధించి 1990లో ఇచ్చిన మరో తీర్పును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. జంతువులు ఆశ్రయం కల్పించటం అనేది వాటి శరీరానికి రక్షణ కల్పిస్తే చాలు, అదే మనుషులయితే వారికి తగిన వసతి కల్పించాలి. వారు శారీరకంగా, మానసికంగా, తెలివితేటలపరంగా ఎదగటానికి అవసరమైన చర్యలు చేపట్టవలసి ఉంటుందని పేర్కొంది. హల్ద్వానీ కేసులో ప్రభుత్వం వారిని అక్కడ నుంచి తొలగించటానికి ముందు వారికి ప్రత్యామ్యాయనివాసాలు చూపించవలసి ఉంది. దశాబ్దాలుగా వారు అక్కడ నివసిస్తున్నారన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా దూకుడుగా వ్యవహరించటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. మరో వైపు హల్ద్వానీ కేసు సుప్రీంకోర్టుకు ఒక గొప్ప అవకాశాన్ని అందించింది. స్థానిక రాజకీయ ప్రాధాన్యతల మేరకు ప్రభుత్వాలు నిర్ణయాలు చేయకుండా మార్గదర్శకాలు అందించటానికి అది వీలుకల్పించింది. ప్రస్తుతానికి గండం గడిచినట్టే. హల్ద్వానీవాసులకు ఎలాంటి ముప్పు లేదు. వచ్చేనెలలో సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది. అప్పుడు నివాసితులు ఆశించిన పూర్తి న్యాయం లభిస్తుందని కోరుకుందాం. -
Supreme Court: వాళ్లంతా మనుషులు.. రాత్రికి రాత్రే ఖాళీ చేయించటమేంటి?
న్యూఢిల్లీ: ఉత్తరఖాండ్‌లోని హల్ద్వానీలో రైల్వే భూమిలో నిర్మించిన 4వేల ఇళ్లు, స్కూళ్లు, ప్రార్థనా స్థలాల కూల్చివేతకు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది సుప్రీం కోర్టు. వేలాది మందిని రాత్రికి రాత్రే నిరాశ్రయులను చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ కూల్చివేతలతో ప్రభావితమయ్యే ప్రజలను దృష్టిలో పెట్టుకుని పరిష్కారం ఆలోచించాలని అభిప్రాయపడింది. కూల్చివేతకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘వారు ఉంటున్న ప్రాంతంలో రైల్వేకు చెందిన భూమి, ప్రభుత్వానికి చెందిన భూమిపై ఎంత అనేది స్పష్టత రావాల్సి ఉంది. 50వేల మందిని రాత్రికి రాత్రే ఖాళీ చేయించలేరు. ఇక్కడ మానవతా కోణం దాగి ఉంది. వారంతా మనుషులు. ఏదో ఒకటి జరగాలి. వారికి ఏదో విధంగా న్యాయం అందాలి.’అని పేర్కొంది ధర్మాసనం. ఉత్తరాఖండ్ ప్రభుత్వం, రైల్వే శాఖలకు నోటీసులు జారీ చేసింది. నిరాశ్రయులవుతున్న వారికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. హల్ద్వానీలోని 29 ఎకరాల భూమిలో ఆక్రమణలను కూల్చివేయాలని డిసెంబర్ 20న ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పు వెలువరించింది. జనవరి 9లోగా రైల్వే స్థలంలో ఉన్న బంభుల్‌పురా, గఫూర్ బస్తీ, ధోలక్ బస్తీ, ఇందిరా నగర్ ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చింది. మరోవైపు.. తొలగింపులను ఆపాలని నివాసితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. క్యాండిల్ మార్చ్‌లు, ధర్నాలు చేశారు. ఇదీ చదవండి: అంజలి సింగ్ కేసులో ట్విస్ట్.. ఐదుగురు కాదు మరో ఇద్దరు ఉన్నారటా! -
షాకింగ్ ఘటన: కాళ్లు తెగిపడి పట్టాలపై దీనంగా రోదిస్తూ..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో హేయనీయమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. వీధి వ్యాపారితో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో.. ఆ కంగారులో ఆ యువకుడు రైలు పట్టాల మీదకు పరిగెత్తాడు. అయితే వేగంగా దూసుకొచ్చే రైలు అతన్ని చిధిమేయడంతో రెండు కాళ్లు పొగొట్టుకుని పట్టాలపై పడి ఆ బాధతో విలపించాడు. ఈ ఘటన వీడియో ద్వారా సోషల్ మీడియాకు చేరింది. యూపీ కాన్పూర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాహిబ్ నగర్‌కు చెందిన అర్సలాన్ అనే 18 ఏళ్ల యువకుడు.. కళ్యాణ్పూర్ ప్రాంతంలోని జీడీ రోడ్ దగ్గర కూరగాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పోలీసులు.. చిరువ్యాపారులను అక్కడి నుంచి వెళ్లగొట్టే యత్నం చేశారు. ఇంతలో ఇద్దరు కానిస్టేబుళ్లు అర్సలాన్ కూరగాయల దుకాణం వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారు. Shocker from Kanpur ! Policemen threw away a street vendor Irfan's articles on railway tracks in Kalyanpur. He was hit by Memu train while picking them back. He has lost both his legs. Police were clearing sides of GT Road of vendors selling vegetables, and other goods. pic.twitter.com/gbzY71rLg2 — Haidar Naqvi🇮🇳 (@haidarpur) December 2, 2022 ఆపై అర్‌సలాన్‌పై హెడ్ కానిస్టేబుల్ రాకేష్ చెయ్యి చేసుకుని.. అతని కూరగాయల తూకం రాయిని దూరంగా విసిరేశాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్తున్నారు. అది రైలు పట్టాలపై పడడంతో దానిని తెచ్చుకునేందుకు పరిగెత్తాడు ఆ యువకుడు. అంతలో వేగంగా దూసుకొచ్చిన రైలు.. అతని కాళ్లను ఛిద్రం చేసేసింది. అక్కడికక్కడే కాళ్లను పొగొట్టుకున్న ఆ యువకుడు బాధతో పట్టాల మధ్యలో పడి విలపిస్తూ సాయం కోసం చేతులు చాచాడు. అక్కడే ఉన్న కొందరు అతన్ని రోదన పట్టించుకోకుండా వీడియో తీస్తూ ఉండిపోయారు. ఇంతలో జనం తిరగబడతారనే భయంతో ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు అర్సలాన్ను పట్టాల మీద నుంచి పక్కకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో.. రాకేశ్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. అక్కడ కొందరు తీసిన వీడియోల ఆధారంగా ఏం జరిగిందో తెలుసుకునే యత్నం చేస్తున్నట్లు ఓ అధికారి మీడియాకు వెల్లడించారు. ఇదీ చదవండి: పాముకి స్నానం.. ఇలాంటి వీడియోను చూశారా? -
అసోంలో ఆక్రమణదారులపై పేలిన పోలీసు తూటా
గువాహటి: అసోంలోని దరాంగ్ జిల్లా సిఫాజర్‌లో ఆక్రమణదారుల తరలింపు ప్రక్రియ హింసాత్మకంగా మారింది. పోలీసులకు, నిరసనకారులకు మధ్య గురువారం జరిగిన ఘర్షణలు రణరంగాన్ని తలపించాయి. ఖాకీల తూటాలకు ఇద్దరు నిరసనకారులు ప్రాణాలు కోల్పోగా, చాలా మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వ్యవసాయానికి సంబంధించిన ఒక ప్రాజెక్టు కోసం కావల్సిన భూసేకరణలో భాగంగా ధోల్పూర్లోని సిఫాజర్‌లో 800 కుటుంబాలను తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ స్థలమే అయినప్పటికీ కొన్ని దశాబ్దాల నుంచి ఆ కుటుంబాలు అక్కడే నివాసం ఉంటున్నాయి. చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం వారిని అక్కడ్నుంచి ఖాళీ చేసే ప్రక్రియ సోమవారం నుంచి ప్రభుత్వం మొదలు పెట్టింది. అయితే దీనిని వ్యతిరేకించిన ఆ కుటుంబాలు తమకు పునరావాసం కల్పించాలంటూ నిరసనలకు దిగారు. వారిని చెదరగొట్టడానికి లాఠీలు, తుపాకీలతో పోలీసులు క్రౌర్యాన్ని ప్రదర్శించారు. విచక్షణా రహితంగా నిరసనకారుల్ని చితకబాదడమే కాకుండా వారిపై నేరుగానే కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలన్నింటినీ వీడియో తీయడానికి జిల్లా యంత్రాంగం నియమించిన కెమెరామ్యాన్ విజయ్‌శంకర్ బనియా నిరసనకారులపై అత్యంత దారుణంగా ప్రవర్తించారు. బుల్లెట్ గాయంతో ప్రాణాలు కోల్పోయి నేలపై పడి ఉన్న ఒక వ్యక్తిని విజయ్‌శంకర్ కాళ్లతో తన్నిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ప్రభుత్వం ఆ కెమెరామ్యాన్ అరెస్ట్ చేసింది. ఈ ఘటనలపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తంకావడంతో అస్సాం ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. మరోవైపు నిరసనకారులు పోలీసులపైకి పదునైన ఆయుధాలు, రాళ్లతో దాడి చేశారని, వారు చేసిన దాడిలో ఎనిమిది మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని దరాంగ్ ఎస్పీ, ముఖ్యమంత్రి హిమాంత్ బిశ్వా సోదరుడు సుశాంత్ బిశ్వా శర్మ చెప్పారు. గువాహటి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మొనిరుద్దీన్ పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని సద్దామ్ హుస్సేన్, షేక్ ఫోరిడ్‌గా గుర్తించారు. అస్సాం ప్రభుత్వమే కాల్పుల్ని స్పాన్సర్ చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ సర్కార్ అధికారంలోకొచ్చాక ప్రజలపై వేధింపులు పెరిగినట్లు అస్సాం పీసీసీ అధ్యక్షుడు భూపేన్ బోరా అన్నారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం -
పెళ్లి విందు పెట్టలేదని..
సాక్షి, నల్గొండ: పెళ్లి భోజనం పెట్టనందుకు కుల పెద్దలు ఓ కుటుంబానికి రూ. లక్ష జరిమానా విధించి, కులం నుంచి బహిష్కరించారు. జరిమానా చెల్లిస్తేనే కులదైవం గంగదేవమ్మ పండుగలో తమతో కలిసి పాల్గొనే అర్హత ఉంటుందంటూ ఆదేశించడంతో బాధితులు పోలీసులను, మీడియాను ఆశ్రయించారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ఏపీ లింగోటంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యాదవ కులస్థులు ఉగ్గేపల్లి లక్ష్మయ్య, రాములమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాస్ వివాహాన్ని గ్రామంలోనే ఏప్రిల్ 27న జరిపించారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో బంధువులను పెళ్లికి ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకున్న కుల పేద్దలు కులస్థులను, గ్రామస్థులకు విందు భోజనం ఏర్పాటు చేయనందుకు ఆగ్రహించారు. గ్రామంలో జరగనున్న కులదైవం గంగదేవమ్మ పండుగకు ఆనవాయితీ ప్రకారం లక్ష్మయ్య కుటుంబం ఇచ్చిన నగదును(పట్టి) నిర్వాహకులు తిరిగి ఇచ్చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. కుమారుడి పెళ్లికి విందు ఏర్పాటు చేయనందుకు కుల బహిష్కరణ విధిస్తున్నట్లు చెప్పారు. తమను అవమానించిన కుల పెద్దలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, డీజీపీ, నల్లగొండ కలెక్టర్, ఎస్పీలకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. ఇలాంటి ఆధునిక యుగంలో కూడా కుటుంబాలను వేలేస్తూ, విధించిన జరిమానా కట్టాలని వేధిస్తున్న వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. దీంతో స్థానిక నార్కట్ పల్లి పోలీసులు, తహశీల్దార్ దీనిపై గ్రామంలోకి వెళ్లి విచారణ చేపట్టారు. -
గ్యాంగ్‌వార్‌పై పోలీసుల కఠిన చర్యలు..
-
గ్యాంగ్‌వార్: వారిపై నగర బహిష్కరణ వేటు
సాక్షి, అమరావతి: బెజవాడ్ గ్యాంగ్‌వార్‌లో పాల్గొన్న కొందరిపై నగర బహిష్కరణ వేటు పడనుంది. అలాగే గ్యాంగ్‌వార్‌కు కారకులైన మాజీ రౌడీïÙటర్ సందీప్, మణికంఠ అలియాస్ కేటీఎం పండు గ్రూపులకు చెందిన సభ్యులందరిపైనా పీడీ యాక్ట్ పెట్టనున్నారు. ఘర్షణ జరిగిన రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన 10 మంది నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. కన్నబిడ్డను నేరాలవైపు ప్రోత్సహించిన కారణంగా పండు తల్లి కోడూరి పద్మావతిపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి రౌడీïÙట్ ఓపెన్ చేశారు. గ్యాంగ్‌వార్‌పై పోలీసుల కఠిన చర్యలు.. విజయవాడలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్‌ను తీవ్రంగా పరిగణించిన పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఇరు గ్రూపులకు చెందిన సభ్యులపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో కొందరు రౌడీ మూకలు యువకులతో కలిసి అలజడి రేపడాన్ని క్షమించరాని నేరంగా భావించి గ్యాంగ్‌వార్‌లో పాల్గొన్న కొందరు యువకులపై నగర బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించారు. అలాగే నిందితులందరిపైనా పీడీ యాక్ట్‌ను ఉపయోగించబోతున్నారు. ►విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో 417 మంది రౌడీషీటర్లు ఉన్నారు. ►శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరగాళ్లు 497 మంది ఉన్నారు. ►ఇప్పటికే 7 మందిపై నగర బహిష్కరణ వేటు వేయడం జరిగింది. ►తాజాగా సందీప్, పండుల మధ్య జరిగిన గ్యాంగ్‌వార్ నేపథ్యంలో మరికొందరిపై నగర బహిష్కరణ వేటు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. చదవండి: యువతి కోసం గుంటూరులో గ్యాంగ్ వార్ పండు తల్లిపై రౌడీషీట్.. మాజీ రౌడీషీటర్ సందీప్‌పై మణికంఠ అలియాస్ పండును దాడికి ప్రోత్సహించిన కారణంగా అతని తల్లి కోడూరి పద్మావతిని సందీప్ హత్యా నేరం కేసులో నాల్గో ముద్దాయిగా చేరుస్తూ పటమట పోలీసులు కేసు నమోదు చేసి.. రౌడీషీట్ ఓపెన్ చేశారు. గతంలో పద్మావతిపై పెనమలూరు పరిధిలో రెండు కేసులు ఉన్నాయి. ఇప్పుడు పటమట 307 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు అయింది. మొత్తం మూడు కేసులు నమోదు కావడంతో ఈమెపై రౌడీషీట్ ఓపెన్ చేయనున్నారు. దీంతో పెనమలూరు పోలీసుస్టేషన్ పరిధిలోనే కాకుండా నగరంలోనే మొట్టమొదటి మహిళ రౌడీషీటర్‌గా ఈమె పోలీసు రికార్డుల్లోకెక్కనుంది. అలాగే పీడీ యాక్ట్ కూడా పద్మావతిపై పోలీసులు పెట్టనున్నారు. దీంతోపాటు పద్మావతి గత చరిత్ర, ఆమె వెనుక ఎవరైనా ఉన్నారా? అన్న వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఆమెకు నేరప్రవృత్తి ఉన్నట్లు రుజువైతే నగర బహిష్కరణ వేటు వేయాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: బెజవాడ గ్యాంగ్‌వార్ కేసు.. సీన్ రీకన్స్ట్రక్షన్ కొనసాగుతున్న జల్లెడ.. ఇక ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న 10 మంది నిందితులతోపాటు సెటిల్మెంట్ల వ్యవహారంలో తలదూర్చిన మరికొందరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసుల యత్నిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అజ్ఞాతంలో ఉన్నవారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. సందీప్ గ్యాంగ్ సభ్యుల అరెస్ట్ అమరావతి: మాజీ రౌడీషీటర్ తోట సందీప్ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పదకొండు రోజుల కిందట విజయవాడలోని పటమట తోటవారివీధిని మైదానంలో రెండు గ్రూపులు మారణాయుధాలతో దాడి చేసుకున్న సంగతి విదితమే. ఈ గ్యాంగ్‌వార్‌లో తీవ్రంగా గాయపడ్డ తోట సందీప్ మృతి చెందగా.. మరో గ్రూపునకు లీడర్‌గా ఉన్న కోడూరి మణికంఠ అలియాస్ పండు గాయాలతో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. పండు వర్గంపై దాడికి పాల్పడ్డ తోట సందీప్ వర్గానికి చెందిన 11 మందిని పటమట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ మేరకు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ హర్షవర్థన్‌రాజు ఆ వివరాలను వెల్లడించారు. ►గ్యాంగ్‌వార్‌లో సందీప్ తరఫు పాల్గొన్న 11 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని డీసీపీ చెప్పారు. ►వారి నుంచి రెండు పట్టా కత్తులు, ఒక నేపాల్ కత్తి, రెండు రాడ్లు, కర్ర, బేడ్లు, ఆరు బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ►నిందితుల్లో సందీప్ సోదరుడు తోట జగదీష్ అలియాస్ బాలు, మంగళగిరికి చెందిన మేకతోటి కిరణ్‌కుమార్, ఆకురాతి వెంకట శివరఘునాథ్, పంది విజయప్రసాద్‌లు ఉన్నారు. వీరిలో కిరణ్, రఘునాథ్‌లపై మంగళగిరి పోలీసుస్టేషన్లో రౌడీషీట్లు ఉన్నాయి. ►వీరితోపాటు యర్రంశెట్టి రాము, చింతా సాంబశివరావు, చందా రామ్ నితిన్, జక్కా రత్నసాయిలు, పెనమలూరుకు చెందిన కందెల శివరామకృష్ణ, యనమలకుదురుకు చెందిన బోడా శివ, తాడిగడపకు చెందిన కన్నా సునీల్‌లు ఉన్నారన్నారు. చిన్ననాటి స్నేహితులు.. వీరిలో చాలా మంది సందీప్‌కు చిన్ననాటి స్నేహితులు కావడం, ఒకే స్కూల్లో చదువుకోవడం వల్ల ఆ పరిచయంతో పిలవగానే వీరంతా సందీప్ వెంట వచ్చారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధం ఉన్నవారందరిపైనా వేట కొనసాగుతోందన్నారు. సెంట్రల్ ఏసీపీ నాగరాజురెడ్డి, పటమట, పెనమలూరు సీఐలు సురేష్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘మమల్ని దేశం నుంచి వెళ్లగొడుతున్నారు’
ఇస్లామాబాద్ : సిక్కులను పాకిస్తాన్ నుంచి బలవంతగా గెంటివేస్తున్నారని పాక్‌కు చెందిన గూలాబ్ సింగ్ అనే వ్యక్తి పేర్కొన్నారు. సిక్కుల నుంచి పాక్ మొదటి పోలీసు అధికారిగా నియమితులైన గులాబ్ సింగ్ లాహోర్‌కు సమీపంలోని దేరా చహల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పోలీసు అధికారులు తనను దేశం విడిచివెళ్లాలని దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. గులాబ్ సింగ్ బుధవారం మాట్లాడుతూ ‘మా కుటుంబం 1947 నుంచి పాక్‌లోనే ఉంటుంది. పాక్‌లో ఎన్ని అల్లర్లు జరిగినా మేం దేశం విడిచిపోలేదు. ఇప్పుడు ప్రభుత్వం సిక్కులను బలవంతంగా దేశం నుంచి తరివేయాలని చుస్తోంది. ఇంటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెత్తికి చుట్టుకున్న పాగాను బలవంతంగా లాగారు. గత కొంత కాలంగా నన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నారు’ అని గులాబ్ సింగ్ పేర్కొన్నారు. ఇంటిని ఖాళీ చేయాడానికి తమకు కొంత సమయం అడిగిన పోలీసులు ఇవ్వలేదని గులాబ్ సింగ్ తెలిపారు. కాందిశీకులకు చెందిన ఓ ట్రస్ట్ బోర్డు తమను అక్కడి నుంచి ఖాళీ చెయించిందని, ఆ సంస్థ చైర్మన్ సయ్యద్ ఆసీఫ్ ఆక్తర్పై స్థానిక పోలీస్ స్టేషన్లో గులాబ్ సింగ్ ఫిర్యాదు చేశాడు. గురుద్వార్‌కు సంబంధించిన స్థలాన్ని 2011లో గులాబ్ సింగ్ అక్రమంగా కొనుగోలు చేశారని, దానిని స్వాధీనం చేసుకునే బాధ్యతను పాక్ సుప్రీంకోర్టు ట్రస్ట్ చైర్మన్‌కు అప్పగించినట్లు బోర్డు సభ్యులు తెలిపారు. My house is sealed with all belongings including my slippers inside. Even this 'patka' on my head is an old rag which I just wrapped. I was harassed, beaten and my faith was disrespected: Gulab Singh, Pakistani Policeman who was forcibly evicted from his house in Lahore pic.twitter.com/va1tOGk3UM — ANI (@ANI) July 11, 2018 -
మీడియా పుకార్లపై స్పందించిన మల్లికా
సాక్షి, ముంబై : మీడియాలో వస్తున్న పుకార్లపై ఎట్టకేలకు నటి మల్లికా షెరావత్ స్పందించారు. పారిస్.. ఇల్లు.. ఖాళీ చేయించటం వార్త నిజం కాదని ఆమె చెప్పారు. భారీగా బకాయిలు పడటంతో ఆమెను బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించినట్లు మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె తన ట్విట్టర్లో స్పందించారు. పారిస్‌లో ఇల్లు అంటూ వస్తున్న వార్త నిజం కాదు. నాకు అసలు ఇల్లు లేదు. అద్దెకూ ఉండటం లేదు. ఒకవేళ ఎవరైనా నాకు దానం చేయాలనుకుంటే వారి అడ్రస్ నాకు పంపండి అంటూ వ్యంగ్యంగా ఆమె ట్వీటారు. కాగా, పారిస్‌లోని విలాసవంతమైన ఈ అపార్ట్మెంట్లో బాయ్ ఫ్రెండ్ సిరిల్ ఆక్సన్‌ఫాన్స్‌తో ఆమె నివసించారు. గతంలో ఓసారి ఇదే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కొందరు ఆగంతకులు దాడి చేయగా.. మీడియాలో ప్రముఖంగా వార్తలు కూడా వచ్చాయి. సుమారు 64 లక్షల దాకా బకాయిలు చెల్లించకపోవటంతో ఆమెను బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించినట్లు బీబీసీ లాంటి ప్రముఖ మీడియా సంస్థల్లో కూడా కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె అది నిజం కాదంటూ ఖండించటం కొసమెరుపు. Some in the media think I hv an apartment in Paris !! It’s absolutely Not True , if someone has donated one to me, pls send me the address :) https://t.co/ScDyL3Abt8 — Mallika Sherawat (@mallikasherawat) December 14, 2017 -
ఆక్రమణల తొలగింపు 'హింసాత్మకం'
గువహటి: అసోం కజిరంగా పార్కులో ఆక్రమణల తొలగింపు హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. గత కొన్నేళ్లుగా జాతీయ పార్కులో నివాసం ఉంటున్న వారు తమకు పరిహారం చెల్లించేంతవరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ చేపట్టిన ఆందోళన సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. కజిరంగా పార్కులో ఆక్రమణలను తొలగించాలన్న గవహటి కోర్టు ఆదేశాల అమలులో భాగంగా అధికారలు నగౌన్ జిల్లాలోని బండేర్డుబి ప్రాంతంలో ఆక్రమణలను తొలగించడానికి ప్రయత్నించారు. అయితే తగినంత పరిహారం చెల్లించేంతవరకు ఖాళీ చేసేది లేదంటూ స్థానికులు ఆందోళనలు చేపట్టారు. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసరడంతో తీవ్ర ఘర్షణ తలెత్తింది. బాష్పవాయువును ప్రయోగించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు.