
గాంధీ ఆస్పత్రి: వ్యాయామం చేస్తూ కొందరు హఠాత్తుగా కుప్పుకూలి మృతిచెందుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఎటువంటి లక్షణాలు కనిపించనప్పటికీ తీవ్రమైన గుండెపోట్లతో వారు మరణిస్తున్నట్లు వైద్యులు ధ్రువీకరిస్తున్నారు. ఇంకొందరు బ్రెయిన్‌స్ట్రోక్‌తో కుప్పకూలుతున్నారని అంటున్నారు. కుటుంబంలో ఎవరైనా ఇలా మరణిస్తే మిగిలిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇటువంటి వ్యాధులు, రుగ్మతలు జన్యుపరంగా రక్త సంబంధీకులకు వస్తున్నట్లు గతంలోనే నిర్ధారణైందని చెబుతున్నారు. గుండెపోటుతో కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్ ఎందుకు వస్తున్నాయి?, నివారణ, నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కోవిడ్ పాత్ర తదితర అంశాలపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు ‘సాక్షి’కి చెప్పి వివరాలు ఆయన మాటల్లోనే..
- గుండె, మెదడు జబ్బులు వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం ఎక్కువ. కాబట్టి రక్తసంబంధీకులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, స్థూలకాయం, మాదకద్రవ్యాల సేవనం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, శారీరకశ్రమ లేకపోవడం గుండె, మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
- కోవిడ్ బారినపడిన వారిలో రక్తం చిక్కబడే అవకాశం ఉంది, పోస్టు కోవిడ్ లక్షణాల్లో ఇది ప్రధానమైనది. రక్తం చిక్కబడి రక్తనాళాల్లో ప్రసరణ సరిగా జరగకపోవడంతో హార్ట్‌ఎటాక్, బ్రెయిన్‌స్ట్రోక్‌కు ఆస్కారం ఏర్పడుతుంది.
- తల్లి గర్భంలో పిండం పెరిగి శిశువుగా రూపాంతరం చెందుతున్నప్పుడే కొన్నిరకాల రుగ్మతలకు గురవుతారు. డయాబెటిస్ వంటివి ఇటువంటివే. తల్లి ఆరోగ్యంగా లేనప్పుడు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నప్పుడు వాటి ప్రభావం శిశువులపై పడుతుంది.
- చిన్నారులు, యువతలో శారీరక శ్రమ లేకపోవడం ఇటువంటి రుగ్మతలకు మరో కారణం.
ఇలా చేస్తే పదిలం..
- వంశపారంపర్యంగా గుండె, మెదడు సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
- జీవనశైలి, ఆహార అలవాట్లు మార్చుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. మాదకద్రవ్యాలు, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమపాళ్లలో తీసుకోవాలి. పండ్లు, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
- గుండెపోటుకు గురైన వారిని వెంటనే కాపాడేందుకు వీలుగా అన్ని వర్గాల ప్రజలకు అత్యవసర ప్రాథమిక చికిత్స అయిన సీపీఆర్‌పై అవగాహన కలి్పంచి శిక్షణనివ్వాలి.
- యోగా, ధ్యానం చేసేందుకు వీలుగా కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులకు తప్పనిసరిగా 45 నిమిషాల సమయం కేటాయించాలనే నిబంధన విధించాలి.
Comments
Please login to add a commentAdd a comment