Brain Stoke
-
Delhi Pollution: గ్యాస్ ఛాంబర్ కన్నా ఘోరం.. బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు!
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత క్షీణ స్థాయికి చేరింది. ఢిల్లీ ఏక్యూఐ స్థాయి గురువారం 400 దాటింది. ఈ స్థాయి కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ గ్రాప్- 3ని నవంబర్ 15 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.గ్రాప్- 3 నిబంధనల ప్రకారం కాలుష్యం అదుపులోకి వచ్చే వరకు నిర్మాణ సంబంధిత పనులను నిలిపివేయనున్నారు. భవనాల కూల్చివేతలు, మైనింగ్‌కు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలు నిలిపివేయనున్నారు. ప్రాథమిక పాఠశాలలకు ఆన్లైన్ తరగతులు నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గత రెండు రోజులుగా ఢిల్లీలో కాలుష్య స్థాయి అత్యంత పేలవమైన స్థాయి నుంచి తీవ్ర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ వార్ రూమ్‌లో పర్యావరణ శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించింది. అనంతరం పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్.. కాలుష్య నివారణకు చేపడుతున్న మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.రాజధాని ఢిల్లీ గాలి పీల్చడం ఇప్పుడు ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారింది. పంజాబ్-హర్యానాలలో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల వచ్చే పొగ కారణంగా, రాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్‌గా మారింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తాజా డేటా ప్రకారం ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచిక అంటే ఏక్యూఐ 452కి చేరింది. సైన్స్ మ్యాగజైన్ లాన్సెట్ న్యూరాలజీ జర్నల్‌లో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం కారణంగా సబ్రాక్నోయిడ్ హెమరేజ్(బ్రెయిన్ స్ట్రోక్-ఎస్ఏహెచ్) కేసులు పెరుగుతున్నాయి. తీవ్రమైన వాయు కాలుష్యంఅంగ వైకల్యానికి, అనేక సందర్భాల్లో గుండె వైఫల్యానికి కారణంగా నిలుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: డయాబెటిస్ వాట్సాప్ చానల్ -
మిథున్ చక్రవర్తికి వచ్చిన ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే..?
ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి గత శనివారమే తీవ్ర అస్వస్థతకు గురయ్యిన సంగతి తెలిసింది. దీంతో ఆయనను కుటుంబసభ్యులు కోల్‌కతాలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆస్పత్రి విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. 73 ఏళ్ల మిధున్ తన పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు ప్రకటనలో పేర్కొంది. వైద్య పరీక్షల్లో మిథున్ బ్రెయిన్‌కి సంబంధించిన ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్‌కి గురయ్యినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, నెమ్మదిగా కోలుకుంటున్నారని పేర్కొంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్‌తో సత్కరించిన సంగతి తెలిసిందే. అది జరిగిన కొద్దిరోజులకే మిథున్ ఇలా అస్వస్థతకు గురవ్వడం బాధకరం. అయితే మిథున్ చక్రవర్తి ఎదుర్కొంటున్న ఈ ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్ అంటే ఏమిటీ? ఎందువల్ల ఇది వస్తుంది? ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే.. మెదడులో కొంత భాగానికి రక్త సరఫరా జరకపోయినా లేదా తగ్గినా ఈ ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్ సంభవిస్తుంది. దీంతో మెదడు కణజాలానికి ఆక్సిజన్ వంటి పోషకాలు అందకుండా పోతాయి. వెంటనే మెదడు కణాలు నిమిషాల్లో చనిపోవడం ప్రారంభమవుతుంది. ఈ తర్వాత రోగి పరిస్థితి విషమంగా అయిపోతుంది. అలాగే మెదడుకు సంబంధించిన మరొక ప్రమాదకరమైన స్ట్రోక్ ఒకటి ఉంది. దీని గురించి తరుచుగా వింటుంటాం. అదే బ్రెయియన్ హెమరేజిక్ స్ట్రోక్. ఇది మెదడులోని రక్తనాళం లీక్ అయినప్పుడు లేదా పగిలిపోయి మెదడులో రక్తస్రావం జరిగితే ఈ స్ట్రోక్ రావడం జరుగుతుంది. ఇక్కడ రక్తం మెదడు కణాలపై ఒత్తిడి పెంచి దెబ్బతీస్తుంది. చాలమందికి ఎదుర్కొనే స్ట్రోక్ ఇది. అయితే ఇస్కీమిక్ స్ట్రోక్ అనేది చాలా అరుదుగా వస్తుందని చెప్పొచ్చు. పైగా ఈ పరిస్థితి కాస్త క్రిటికల్ అనే చెప్పొచ్చు కూడా. లక్షణాలు.. BREAKING: PM @narendramodi dials #MithunChakraborty, inquiring about his health. https://t.co/MPrYMLT0J1 — Sai Ram B (@SaiRamSays) February 11, 2024 మాట్లాడటం, ఇతరులు ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. ముఖం చేతులు లేదా కాలులో తిమ్మిరిగా లేదా పక్షవాతానికి గురవ్వడం ఒకటి లేదా రెండు కళ్లల్లో కనిపించే సమస్యలు తలనొప్పి నడకలో ఇబ్బంది ఆకస్మికంగా మైకం కమ్మడం ఏదీఏమైనా స్ట్రోక్ అనేది మెడికల్ ఎమర్జెన్సీ అనే చెప్పాలి. దీనికి వెంటనే చికిత్స పొందడం చాలా ముఖ్యం. ఇలాంటి సమయాల్లో రోగికి అత్యవసరమైన వైద్య సహాయం త్వరగా పొందితే మెదడు పూర్తి స్థాయిలో దెబ్బతినకుండా ఇతర స్ట్రోక్‌లు రాకుండా నియత్రించగలుగుతామని వైద్యులు చెబుతున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు.. కారణం ఇదే!
గాంధీ ఆస్పత్రి: వ్యాయామం చేస్తూ కొందరు హఠాత్తుగా కుప్పుకూలి మృతిచెందుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఎటువంటి లక్షణాలు కనిపించనప్పటికీ తీవ్రమైన గుండెపోట్లతో వారు మరణిస్తున్నట్లు వైద్యులు ధ్రువీకరిస్తున్నారు. ఇంకొందరు బ్రెయిన్‌స్ట్రోక్‌తో కుప్పకూలుతున్నారని అంటున్నారు. కుటుంబంలో ఎవరైనా ఇలా మరణిస్తే మిగిలిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి వ్యాధులు, రుగ్మతలు జన్యుపరంగా రక్త సంబంధీకులకు వస్తున్నట్లు గతంలోనే నిర్ధారణైందని చెబుతున్నారు. గుండెపోటుతో కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్ ఎందుకు వస్తున్నాయి?, నివారణ, నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కోవిడ్ పాత్ర తదితర అంశాలపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు ‘సాక్షి’కి చెప్పి వివరాలు ఆయన మాటల్లోనే.. - గుండె, మెదడు జబ్బులు వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం ఎక్కువ. కాబట్టి రక్తసంబంధీకులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. - మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, స్థూలకాయం, మాదకద్రవ్యాల సేవనం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, శారీరకశ్రమ లేకపోవడం గుండె, మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. - కోవిడ్ బారినపడిన వారిలో రక్తం చిక్కబడే అవకాశం ఉంది, పోస్టు కోవిడ్ లక్షణాల్లో ఇది ప్రధానమైనది. రక్తం చిక్కబడి రక్తనాళాల్లో ప్రసరణ సరిగా జరగకపోవడంతో హార్ట్ఎటాక్, బ్రెయిన్‌స్ట్రోక్‌కు ఆస్కారం ఏర్పడుతుంది. - తల్లి గర్భంలో పిండం పెరిగి శిశువుగా రూపాంతరం చెందుతున్నప్పుడే కొన్నిరకాల రుగ్మతలకు గురవుతారు. డయాబెటిస్ వంటివి ఇటువంటివే. తల్లి ఆరోగ్యంగా లేనప్పుడు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నప్పుడు వాటి ప్రభావం శిశువులపై పడుతుంది. - చిన్నారులు, యువతలో శారీరక శ్రమ లేకపోవడం ఇటువంటి రుగ్మతలకు మరో కారణం. ఇలా చేస్తే పదిలం.. - వంశపారంపర్యంగా గుండె, మెదడు సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. - జీవనశైలి, ఆహార అలవాట్లు మార్చుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. మాదకద్రవ్యాలు, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమపాళ్లలో తీసుకోవాలి. పండ్లు, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. - గుండెపోటుకు గురైన వారిని వెంటనే కాపాడేందుకు వీలుగా అన్ని వర్గాల ప్రజలకు అత్యవసర ప్రాథమిక చికిత్స అయిన సీపీఆర్‌పై అవగాహన కలి్పంచి శిక్షణనివ్వాలి. - యోగా, ధ్యానం చేసేందుకు వీలుగా కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులకు తప్పనిసరిగా 45 నిమిషాల సమయం కేటాయించాలనే నిబంధన విధించాలి. -
మెదడులో కల్లోలం.. ఆ నాలుగు గంటలు ఎంతో కీలకం
లబ్బీపేట(విజయవాడ తూర్పు): శరీర అవయవాల పనితీరును నియంత్రించే మెదడు దెబ్బతినడం వల్ల కలిగే వ్యాధి బ్రెయిన్ స్ట్రోక్. మెదడులో రక్తం సరఫరా సరిగ్గా జరగక పోవటం, రక్తనాళాలు చిట్లటం వంటి కారణాలతో బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై పక్షవాతం బారిన పడతారు. ఈ వ్యాధి ఒకప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వారికే వచ్చేది. కానీ ప్రస్తుతం 30 నుంచి 45 ఏళ్ల లోపు యువత కూడా దీని బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జీవన విధానంలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవటం వంటి కారణాల వల్ల అనేక మంది పక్షవాతానికి గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 30 శాతం మంది యువతే.. ఒకప్పుడు వయస్సు 55, 60 ఏళ్ల వారిలో ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యేవారు. కానీ ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే వారిలో 25 నుంచి 30 శాతం మంది 45 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రతిరోజూ ఇద్దరు, ముగ్గురు బ్రెయిన్ స్ట్రోక్‌తో వస్తుంటారు. వారి స్ట్రోక్ తీవ్రతను బట్టి జనరల్ మెడిసిన్, ఏఎంసీ, న్యూరాలజీ విభాగాల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో వస్తున్న వారిలో రక్తంలో గడ్డలు ఏర్పడి మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగక పోవడం వలన వచ్చే స్ట్రోక్(ఇస్కిమిక్) 80 శాతం మంది, రక్తనాళాలు చిట్లి (హెమరైజ్డ్) 20 శాతం మంది ఉంటున్నారు. ప్రధాన కారణాలివే.. - పెద్ద వయస్సు వారిలో రక్తపోటు, మధుమేహం స్ట్రోక్‌కు కారణంగా చెబుతున్నారు. - 45 ఏళ్లలోపు వారిలో హోమోసిస్టీన్, సిక్కుసెల్ అనే రక్తంలో జెనిటిక్ లోపాలు, వంశపారంపర్యంగా, హెరాయిన్ వంటి డ్రగ్స్, మద్యపానం, ధూమపానం, ప్రమాదాల్లో తలకు గాయాలైన వారిలో ఎక్కువగా స్ట్రోక్ వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. - వీరితో పాటు కదలిక లేని జీవన విధానం కారణంగా కొలె్రస్టాల్ స్థాయిలు పెరిగి స్ట్రోక్‌కు గురవుతున్నట్లు వెల్లడిస్తున్నారు. - ఆడవారిలో హార్మోనల్ ఇబ్బందులు, రక్తనాళాల్లో లోపాల కారణంగా కూడా స్ట్రోక్ రావచ్చంటున్నారు. గుండెలోపాలు ఉన్న వారిలోనూ బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువని వివరిస్తున్నారు. ఆ నాలుగు గంటలే కీలకం.. ఇప్పుడు బ్రెయిన్‌స్ట్రోక్‌కు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. లక్షణాలను గుర్తించి, నాలుగు గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుంటే స్ట్రోక్‌తో వైకల్యం రాకుండా వైద్యులు కాపాడగలుగుతున్నారు. ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చిన వారికి త్రోంబలైసిస్ ఇంజెక్షన్‌ను ఇవ్వడం ద్వారా రక్తంలోని పూడికలు కరిగేలా చేస్తున్నారు. ముఖం, చేయి, కాలు ముఖ్యంగా శరీరం ఒకవైపున ఆకస్మిక తిమ్మిరి, బలహీనత ఏర్పడటం, ఆకస్మికంగా గందరగోళం ఏర్పడటం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, కంటి చూపు మందగించడం, తలతిరగడం, బ్యాలెన్స్ తప్పడం, ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి వంటికి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. -
వెంటిలేటర్‌పై సోమ్‌నాథ్ చటర్జీ
కోల్‌కతా: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ(89)ని వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గత నెల ఛటర్జీకి మెదడులో రక్తస్రావం కావడంతో వైద్యశాలలో చేర్పించారు. చాలా రోజుల చికిత్స తర్వాత ఆయన కోలుకుంటున్నట్లుగా కనిపించడంతో గత వారమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి పంపారు. మళ్లీ మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో ఆయనను మూడు రోజులకే తిరిగి ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. ‘ఆయనకు డయాలసిస్ చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడు గుండె సహకరించదు. దీంతో ఆయనకు ఆదివారం ఉదయం చిన్నగా గుండెపోటు వచ్చింది. ఇప్పుడు ఫరవాలేదు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం’ అని వైద్యులు చెప్పారు. 1968లో సీపీఎంలో చేరిన చటర్జీ పదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించినప్పటికీ ఆయన స్పీకర్ పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోకపోవడంతో పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు. -
అమర్నాథ్ యాత్రలో అపశ్రుతి
సాక్షి, జమ్మూకాశ్మీర్: అమర్నాథ్ యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రవీంద్రనాథ్ చౌదరి అనే వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. రవీంద్ర ఈ నెల 3న అనారోగ్యం పాలయ్యారు. అప్పటి నుంచి శ్రీనగర్‌లోని షేర్-ఈ-కాశ్మీర్ హాస్పిటల్లో అపస్మారక స్థితిలో ఉన్నారు. ఏపీ ప్రభుత్వం వెంటిలేటర్ తీయడానికి వీలు లేకపోవడంతో అతని కోసం ఎయిర్ అంబులెన్స్‌లో శ్రీకాకుళం తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. ఈ లోపే బ్రెయిన్ స్టోక్‌తో ఆదివారం మధ్యాహ్నం రవీంద్రనాథ్ మరణించారు. రేపు సాయంత్రం మృతదేహాన్ని వైజాగ్‌కు తరలించనున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఏపీ భవన్ ప్రత్యేక కమీషనర్ అర్జా శ్రీకాంత్ అన్నారు. -
మాజీ గవర్నర్‌కు తీవ్ర అస్వస్థత
న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ (91) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం 9 గంటలకు ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఢిల్లీలోని మాక్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉందని, ప్రత్యేక డాక్టర్ల బృందం చికిత్స చేస్తోందని కుమారుడు రోహిత్ శేఖర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన స్పృహలో లేరని తెలిపారు. -
మెరుగుపడిన బొత్స ఆరోగ్యం
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడింది. ఆయన స్వల్ప బ్రెయిన్ స్ట్రోక్‌తో మంగళవారం కేర్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న ఆయన్ను గురువారం సాధారణ గదికి మార్చనున్నట్టు కేర్ వర్గాలు బుధవారం తెలిపాయి. మెదడులో స్వల్ప పరిమాణంలో రక్తం గడ్డ కట్టగా.. అది ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చినట్టు వైద్యులు తెలిపారు. బొత్సకు ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి వైద్యం అందిస్తున్నారు. గురువారం రాత్రి లేదా శుక్రవారం బొత్సను డిశ్చార్జి చేసే అవకాశమున్నట్టు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రముఖుల పరామర్శ.. ఇదిలా ఉండగా బొత్సను గవర్నర్ నరసింహన్ బుధవారం ఫోన్లో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు శాసన సభాపతి నాదెండ్ల మనోహర్‌తోపాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి బొత్సను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బొత్సను పరామర్శించిన వారిలో కేంద్ర మంత్రులు పురందేశ్వరి, పనబాక లక్ష్మి, రాష్ట్ర మంత్రులు రఘువీరారెడ్డి, కొండ్రు మురళి, అహ్మదుల్లా, డొక్కా మాణిక్యవరప్రసాద్, సి.రామచంద్రయ్య, ఎంపీ వి.హనుమంతరావు, రాయపాటి సాంబశివరావు, ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణ రావుతోపాటు షబ్బీర్‌అలీ, ఆకుల రాజేందర్, కొండా సురేఖ, కూన శ్రీశైలంగౌడ్, సుధీర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, చిత్తరంజన్‌దాస్, బాలాత్రిపురసుందరి, ఉప్పల శారద తదితరులున్నారు.