మెరుగుపడిన బొత్స ఆరోగ్యం
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడింది. ఆయన స్వల్ప బ్రెయిన్ స్ట్రోక్‌తో మంగళవారం కేర్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్న ఆయన్ను గురువారం సాధారణ గదికి మార్చనున్నట్టు కేర్ వర్గాలు బుధవారం తెలిపాయి. మెదడులో స్వల్ప పరిమాణంలో రక్తం గడ్డ కట్టగా.. అది ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చినట్టు వైద్యులు తెలిపారు. బొత్సకు ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి వైద్యం అందిస్తున్నారు. గురువారం రాత్రి లేదా శుక్రవారం బొత్సను డిశ్చార్జి చేసే అవకాశమున్నట్టు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
ప్రముఖుల పరామర్శ..
ఇదిలా ఉండగా బొత్సను గవర్నర్ నరసింహన్ బుధవారం ఫోన్‌లో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు శాసన సభాపతి నాదెండ్ల మనోహర్‌తోపాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి బొత్సను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
బొత్సను పరామర్శించిన వారిలో కేంద్ర మంత్రులు పురందేశ్వరి, పనబాక లక్ష్మి, రాష్ట్ర మంత్రులు రఘువీరారెడ్డి, కొండ్రు మురళి, అహ్మదుల్లా, డొక్కా మాణిక్యవరప్రసాద్, సి.రామచంద్రయ్య, ఎంపీ వి.హనుమంతరావు, రాయపాటి సాంబశివరావు, ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణ రావుతోపాటు షబ్బీర్‌అలీ, ఆకుల రాజేందర్, కొండా సురేఖ, కూన శ్రీశైలంగౌడ్, సుధీర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, చిత్తరంజన్‌దాస్, బాలాత్రిపురసుందరి, ఉప్పల శారద తదితరులున్నారు.