సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ పరిధిలోని వరద బాధితులకు ఇంటికి రూ.10వేల వంతున అందిస్తున్న వరదసాయాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా సాయం అందక.. శుక్రవారం సెలవు కావడంతో శనివారం అందుతుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నవారికి నిరాశే మిగలనుంది. ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల కనుగుణంగా శుక్రవారం జీహెచ్‌ఎంసీ జోనల్, డిప్యూటీ కమిషనర్ల సమావేశం జరిగింది. సర్కిళ్ల వారీగా ఇప్పటి వరకు పంపిణీ చేసిన నిధులు పోను మిగిలిన నిధుల్ని జోనల్ కార్యాలయాల్లో సంబంధిత అధికారులకు శనివారం మధ్యాహ్నం అందజేయాల్సిందిగా సూచించారు. వీటిని స్వచ్ఛ హైదరాబాద్ ఖాతాలో జమచేయాలని కూడా పేర్కొన్నారు. అనంతరం, లెక్కల స్టేట్‌మెంట్లు కూడా తయారు చేయాల్సిందిగా సూచించినట్లు తెలిసింది.
ఇక ఎలక్షన్ పనులు..
నగదు పంపిణీని ముగించడంతో పాటు ఇక వెంటనే ఎన్నికల పనుల్లో నిమగ్నం కావాల్సిందిగా కూడా ఆదేశించారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, డీఆర్‌సీ సెంటర్ల ఏర్పాటు, ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలకు పనుల అప్పగింత తదితర పనులు చేయాల్సిందిగా ఆదేశించడంతో జోనల్, డిప్యూటీ కమిషనర్లు ఇక ఆ పనుల్లో నిమగ్నం కానున్నారు.
పంపిణీ రూ. 342 కోట్లు..
గ్రేటర్ పరిధిలో వరదబాధిత కుటుంబాలు దాదాపు 4 లక్షలు ఉంటాయని భావించి అందుకనుగుణంగా రూ.400 కోట్లు సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి జీహెచ్‌ంఎసీకి పంపిణీ చేశారు. వీటిల్లో దాదాపు రూ.342 కోట్లు పంపిణీ అయ్యాయి. క్షేత్రస్థాయిలోని పరిస్థితులు చూస్తే దాదాపు 6 లక్షల కుటుంబాలున్నట్లు అంచనా. అయితే అధికార వర్గాల సమచారం ప్రకారం.. రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పంపిణీ మార్గదర్శకాలపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
బాధలు ఎందరివో.. బావుకున్నది కొందరు..
వరదబాధితులకు సహాయం అనగానే రాజకీయ జోక్యం తీవ్ర గందరగోళం సృష్టించింది. తమ అనుయాయులు, తమకు తెలిసిన కుటుంబాలకే పూర్తిసాయం అందేలా స్థానిక రాజకీయనేతలు వ్యవహరించారని నగరవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వరదల సమయంలో కనీసం చూడటానికి కూడా రాని వారు.. నగదు పంపిణీ అనగానే ఒక్క కుటుంబానికి నగదు పంపిణీ చేస్తూ.. పదిమంది ఫొటోకు ఫోజులిచ్చారని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజలకు బ్యాంకు ఖాతాల ద్వారా కానీ, మరేదైనా మార్గంలో కానీ కాకుండా నేరుగా నగదు కావడంతో పలు ప్రాంతాల్లో నిధులు సక్రమంగా పంపిణీ జరగలేదని, పది వేలివ్వకుండా రూ. 2వేల నుంచి మొదలుపెట్టి రూ.8వేల వరకు పంపిణీ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనలకు దిగడం తెలిసిందే. నిజమైన బాధితులకు చాలా చోట్ల అందకపోగా,కొన్ని చోట్ల అనర్హులకు కూడా అందాయంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దె ఇళ్లలో ఉన్నవారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొన్ని చోట్ల ఇళ్ల యజమానులకే పంపిణీ చేయడంతో వరదల్లో సమస్తం కోల్పోయి, కట్టుబట్టలతో మాత్రమే మిగిలిన వారికి కూడా కిరాయిదారులకు సాయమందకుండా పోయిందనే వేదనలు వ్యక్తమయ్యాయి.
డామిట్.. కథ అడ్డం తిరిగింది..
ఈ పంపిణీని ఆసరా చేసుకొని త్వరలో జరగనున్న బల్దియా ఎన్నికల్లో ఓట్ల లబ్ధి పొందాలనుకుంటే.. పరిస్థితి అందుకు భిన్నంగా మారడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజులు గడిచాక తిరిగి నిజమైన అర్హులకు మరోమారు వరద సహాయం అందజేస్తారా.. లేదా అనే అంశంలో స్పష్టతనిచ్చేవారు కరువయ్యారు. ఎన్నికల తరుణంలో జరిగిన ఈ పంపిణీ వరద సహాయంలా కనిపించలేదనే ఆరోపణలు కూడా వెలువడ్డాయి.
వరద సాయంలో చేతివాటం
జూబ్లీహిల్స్: వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రూ.10 వేల ఆర్థిక సాయం అక్రమార్కుల పంట పండిస్తున్నది. పెద్ద మొత్తంలో నిధులు దారి మళ్లుతున్నాయి. అధికార పార్టీ కార్యకర్తలు అందిందే అదనుగా దండుకుంటున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజవకర్గ వ్యాప్తంగా అర్హులు గగ్గోలు పెడుతున్నారు. పంపిణీలో భారీగా అక్రమాలు జరగుతున్నాయని, నిబంధనలు తుంగలోకి తొక్కి ఒక పద్ధతి ప్రకారం టీఆర్‌ఎస్ పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు కావాల్సిన వారికే డబ్బులు అందేలా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధాన ఆరోపణలు..
- తమకు కావాల్సిన వారి లిస్ట్‌ను తయారు చేసి అధికారులకు అందిస్తున్నారు. పంపిణీ పూర్తికాగానే గద్దల్లా వాలిపోయి సగం డబ్బును కమిషన్ రూపంలో వెనక్కి తీçసుకుంటున్నారు.
- యూసుఫ్‌గూడకు చెందిన ఓ అధికార పార్టీ నేత తమ కుటుంబంలోని ముగ్గురి పేర్లు రాయించుకొని రూ.30 వేల రూపాయలు తీసుకున్నాడు.
- మూడో అంతస్తులో ఉంటున్న వారికి కూడా వరద బాధితుల కింద రాయించి డబ్బులు తీసుకుంటున్నారు.
- ఎత్తు ప్రాంతంలో ఉన్న యూసుఫ్‌గూడ వెంకటగిరిలో వరద సమస్యే లేదు. కానీ బాధితుల పేరుచెప్పి దండుకుంటున్నారు.
- చాలా ప్రాంతాల్లో రూ.10 వేలు ఇచ్చి అధికారులు వెళ్లిపోగానే రంగప్రవేశం చేస్తున్న అధికార పార్టీ నేతలు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు కమీషన్ కింద తీసుకుంటున్నారు.
- అక్రమాలపై పూర్తి సమాచారం ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు.
- ప్రతి డివిజన్‌లో అధికార పార్టీ నేతలు గ్రూపులుగా ఏర్పడి ఏరియాలను పంచుకుంటున్నారు.
- యూసుఫ్‌గూడలో నగదు పంపిణీలో గోల్‌మాల్ చేస్తున్న కొందరు కార్యకర్తలపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో స్థానికులు ఫిర్యాదు చేశారు.
- రహమత్‌నగర్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు ఇంట్లోని గోడ కూలి పోయిందని ఇదే విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేసినా తనకు నష్ట పరిహారం అందలేదని దళిత నాయకుడు సాయి మాదిగ వాపోయారు.
- కొన్ని చోట్ల భార్యాభర్తలు విడిగా రెండు గదుల్లో ఉన్నట్లు చూపించి ఇద్దరూ పరిహారం పొందుతున్నారు.
- జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంతా ఎమ్మెల్యే ఇష్ట ప్రకారమే సాయం పంపిణీ జరుగుతోందని తమ పాత్ర ఏమీ లేదని కార్పొరేటర్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment