రాష్ట్రంలోనే తొలి మైక్రో ఇరిగేషన్ పథకం
ఆదిలాబాద్ జిల్లా మత్తడివాగు ప్రాజెక్టులో ఓ కాలువ బదులు అండర్‌గ్రౌండ్‌లో కిలోమీటర్ల మేర పైపులైన్
కుడికాలువ ద్వారా సాగులోకి రానున్న 1200 ఎకరాలు
సాక్షి, ఆదిలాబాద్: తాంసి మండలం వడ్డాడి గ్రామంలోని మత్తడివాగు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుకు ఓ ప్రత్యేకత ఉంది. ఎడమ కాలువ నుంచి గ్రావిటీ ద్వారా చేలకు సాగునీరు అందిస్తుండగా, కుడివైపు పైపులైన్ ద్వారా నీటి సరఫరా చేస్తుండడమే ఆ ప్రత్యే కత. ప్రాజెక్టు నుంచి అండర్‌గ్రౌండ్‌లో పైపులైన్ వేసి చేలకు నీరందించే ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే తొలి సారిగా పనులు చేపట్టగా, ఇటీవల పూర్తయ్యాయి. ఇటీవల సీఎం జిల్లా పర్యటనకు వస్తున్నారని ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. కానీ ఆ పర్యటన రద్దు కావడంతో మళ్లీ ముహూర్తం చూస్తున్నారు.
రైతులు భూములు ఇవ్వకపోవడంతో..
మత్తడివాగు ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా 8,500 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఇక కుడి వైపు 1,200 ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ ఏళ్లుగా నిలిచిపోయింది. కాలువల నిర్మాణం కోసం రైతులు తమ భూములు ఇచ్చేందుకు నిరాకరించడమే. ఈ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యా మ్నాయ పద్ధతిపై దృష్టి సారించారు. అప్పట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు తదితరులు మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు పైపులైన్ ద్వారా సాగునీరు అందిస్తున్న పథకాన్ని పరిశీలించారు. ఆ తర్వాత మహారాష్ట్రలోనూ ఇలాంటి స్కీమ్‌ను చూశాక మత్తడివాగు ప్రాజెక్టుకు కుడి కాలువ స్థానంలో పైపులైన్ వేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆ తర్వాత దీనికి సంబంధించి జైన్ అనే కాంట్రాక్ట్ సంస్థకు రూ.7.34 కోట్లతో ఈ మైక్రో ఇరిగేషన్ పథక నిర్మాణానికి టెండర్ అప్పగించింది. ఈ కంపెనీకి కర్ణాటకలో ఇదివరకు ఇలాంటి స్కీమ్ నిర్మించిన అనుభవం ఉంది. ప్రాజెక్టు కుడివైపు అండర్‌గ్రౌండ్‌లో 9 కిలోమీటర్ల మేర ప్రధాన పైపులైన్ వేయగా, మరో 20 కిలోమీటర్లు అంతర్గత పైపులైన్ వేశారు. ప్రాజెక్టు సమీపంలోనే నిర్మించిన పంప్‌హౌస్ ద్వారా నీరు ఎత్తిపోసి పైపులైన్‌తో సరఫరా చేస్తారు.
నీటి పంపిణీ ఇలా.. ప్రధాన పైపులైన్‌కు 25 బ్లాక్‌లు ఏర్పాటు చేశాం. మధ్యలో 8 ఔట్ లెట్లు నిర్మించాం. ఈ ఔట్ లెట్లు చేల వరకు నీటిని తీసుకెళతాయి. ఇలా 1200 ఎకరాలకు సాగునీరు సరఫరా చేస్తాం. ఈ ఔట్‌లెట్లకు నంబర్ ఇస్తాం. అక్కడ ఒక మీటర్ కూడా ఏర్పాటు చేస్తాం. తద్వారా ఏ ఔట్ లెట్‌లో ఎంత నీటి వినియోగం జరు గుతుందనేది నమోదవుతుంది. దీంట్లో సెన్సార్ విధా నంలో స్కాడా సిస్టమ్ అమలు చేస్తున్నాం. తద్వారా ఏ బ్లాక్‌లో, ఏ ఔట్‌లెట్లో నీటి వినియోగం జరుగుతుందనేది స్పష్టంగా తెలుస్తుంది. డిమాండ్ ఉన్నచోట నీటి సరఫరాకు ఈ సిస్టమ్ అనువుగా ఉంటుంది. – శ్రీనివాసరావు, డీఈ, నీటిపారుదల శాఖ, మత్తడివాగు ప్రాజెక్టు
ఇదీ ప్రాజెక్టు స్వరూపం..
ఈ మధ్యతరహా ప్రాజెక్టును అప్పటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులకు శ్రీకారం చుట్టారు. వైఎస్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పల్లెబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాకు వచ్చినప్పుడు ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. ఆ తర్వాత 2008లో ఆయన చేతుల మీదుగానే ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. అప్పట్లో రూ.62.4 కోట్లు వెచ్చించారు. 0.571 టీఎంసీల సామర్థ్యంతో ఐదు గేట్లతో ప్రాజెక్టు నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment