టేకుమట్ల : చుట్టూ వరదనీరు.. వాగు మధ్యలో ఎల్లమ్మ గుడి.. ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. గుడిలో పదిమంది రైతులు.. దాటుదామని వాగులోకి దిగితే కొట్టుకుపోవాల్సిందే. ప్రాణాలు అరచేతబట్టుకొని ఐదున్నర గం టలుగా బిక్కుబిక్కుమంటున్నారు.. అంతలోనేపైన గాలి మోటారు చప్పుడు వారి చెవిన పడింది. అంతే.. ప్రాణాలు లేచి వచ్చాయి. హెలికాప్టర్‌లో వచ్చిన ఆర్మీ కమెండోలు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో రైతుల కథ సుఖాంతమైంది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనపల్లిలో శనివారం చోటు చేసుకుంది.
ఐదు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో..
ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నా యి. కుందనపల్లిలోని చలివాగు ఒడ్డు వెంట ఉన్న పొలాల్లో వ్యవసాయ మోటార్లు వరదలో కొట్టుకుపోకుండా తీసుకురావాలనుకున్నారు రైతులు. మోటార్లను తెచ్చేందుకు రెండు ట్రాక్టర్లలో పలువురు రైతులు శనివారం ఉదయం పది గంటలకు బయలుదేరారు. ఈ క్రమంలో పొలాల్లో ట్రాక్టర్లు దిగబాటుకు గురయ్యాయి. ట్రాక్టర్లను బయటికి తీసేందుకు పదిమంది రైతులు వెళ్లారు. అంతే.. ఒక్కసారిగా చలివాగు ప్రవాహం తీవ్ర రూపం దాల్చింది. దీంతో రైతులకు ఇరువైపులా వరదనీరు చేరడంతో ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. వాగులో రైతులు చిక్కుకుపోవడంతో స్థానికులు కూడా రక్షించే అవకాశాలు లేకపోయాయి. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి స్థానికులు విషయాన్ని తీసుకెళ్లారు.
రంగంలోకి రెండు ఆర్మీ హెలికాప్టర్లు
వాగులో రైతులు చిక్కుకున్న విషయాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, దయాకర్‌రావులకు వివరించారు. సీఎం జోక్యంతో హకీంపేట నుండి రెండు ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఆర్మీ కమాండోలు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నాయి. మధ్యాహ్నం 3:30లకు రైతులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కాగా, వాగు వద్ద సహాయక చర్యలను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ అబ్దుల్ అజీం, ఎస్పీ సంగ్రామసింగ్ పాటిల్ పర్యవేక్షించారు. చివరకు రైతులు సురక్షితంగా బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తమను రక్షించినందుకు ప్రజాప్రతినిధులకు, అధికారులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
అందరికీ రుణపడి ఉంటాం
వరదలో చిక్కుకున్న మాకు సాయం అందించి రక్షించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు మేమూ, మా కుటుంబాలు ఎంతో రుణపడి ఉంటాం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటికి తిరిగి వస్తామో, రామో అని భయపడ్డాం. ఈ పరిస్థితుల్లో మాకు ఎంతో సహకరించి 10 మంది కుటుంబాలకు దిక్కుగా నిలిచారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే, ఎస్పీ, ఇతర అధికారులకు కృతజ్ఞతలు.
– మాడుగుల ప్రకాశ్, రైతు, కుందనపల్లి
Comments
Please login to add a commentAdd a comment