ఉగ్రవాదులపై అటవీ చట్టం!  | Forest law against terrorists | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదులపై అటవీ చట్టం! 

Published Sat, May 20 2023 4:32 AM | Last Updated on Sat, May 20 2023 4:32 AM

Forest law against terrorists - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మధ్యప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) అధికారులు ఈ నెల 9న హైదరాబాద్‌తో పాటు భోపాల్‌లో అరెస్టు చేసిన ఉగ్రవాదులపై అటవీ శాఖ చట్టం కిందా అభియో గాలు చేయనున్నారు. భోపాల్‌కు చెందిన ఓ పర్యావరణవేత్త ఇచ్చిన సూచన మేరకు ఏటీఎస్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంబంధిత కేసుల్లో పోలీసులు సాధారణంగా.. చట్ట విరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం–1967లోని వివిధ సెక్షన్ల కింద ఆరోపణలు చేస్తారు.

ఆ ఉగ్రవాదుల వ్యవహారశైలి, చేసిన విధ్వంసాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ), ఆయుధ చట్టం, పేలుడు పదార్థాల చట్టంతో పాటు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ల కిందా ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్‌–¿ోపాల్‌ మాడ్యుల్స్‌పై మాత్రం అటవీ చట్టంలోని సెక్షన్లనూ జోడించాలని మధ్యప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ ఏటీఎస్‌ నిర్ణయించింది.

ఈ ఉగ్రవాదులు భోపాల్‌ శివార్లలోని రైసెన్‌ అడవుల్లో తుపాకీ కాల్చడాన్ని ప్రాక్టీసు చేశారు. హైదరాబాద్‌ నుంచి వెళ్లిన సలీం తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. అటవీ చట్టాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లోకి ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించడం నేరం. అలా వెళ్లడమే కాకుండా నిషిద్ధ ప్రాంతంలో తుపాకులు వాడినందుకు వీరిపై అటవీ చట్టాల ప్రకారం ఆరోపణలు చేయడమే కాదు, అభియోగాలు సైతం మోపి విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ ఏటీఎస్‌కు శుక్రవారం ఓ లేఖ అందింది. భోపాల్‌కు చెందిన ఓ పర్యావరణవేత్త దీన్ని రాశారు. ఈ లేఖను పరిగణనలోకి తీసుకున్న ఏటీఎస్‌ ఆ చట్టంలోని సెక్షన్లను చేర్చాలని నిర్ణయించింది. 

10 మంది పోలీసు కస్టడీ పొడిగింపు 
హైదరాబాద్, భోపాల్‌లలో అరెస్టు చేసిన 16 మంది ఉగ్రవాదుల పోలీసు కస్టడీ గడువు శుక్రవారంతో ముగియడంతో ఏటీఎస్‌ అధికారులు వీరిని భోపాల్‌లోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీ గడువు మరో పది రోజులు పొడిగించాలని కోరారు. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి రఘువీర్‌ యాదవ్‌ 10 మంది కస్టడీని ఈ నెల 24 వరకు పొడిగించారు.

ఆరుగురికి జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. కస్టడీ పొడిగించిన వారిలో సలీం, రెహా్మన్, యాసిర్‌ ఖాన్‌ తదితరులు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. వీరిని మరోసారి హైదరాబాద్‌కు తీసుకువస్తారా? సిద్దిపేటలో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement