ఎన్‌ఐఏ చేతికి భోపాల్‌ ఉగ్ర కేసు  | Bhopal terror case handover to NIA | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐఏ చేతికి భోపాల్‌ ఉగ్ర కేసు 

Published Sat, May 27 2023 3:02 AM | Last Updated on Sat, May 27 2023 11:12 AM

Bhopal terror case handover to NIA - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  హైదరాబాద్‌–భోపాల్‌లలో మధ్యప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) అధికారులు అరెస్టు చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పరిధిలోకి వెళ్లింది. ఈ నెల 9న ఏకకాలంలో దా డులు చేసిన ఏటీఎస్‌ అధికారులు హైదరాబాద్‌లో ఐదుగురు, భోపాల్‌లో 11 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

గురువారం భోపాల్‌లో ఏటీఎస్‌ అధికారులతో భేటీ అయిన ఎన్‌ఐఏ అధికారులు.. శుక్రవారం నుంచి అధికారికంగా దర్యాప్తు ప్రారంభించారు. దీనికోసం ప్రత్యే కంగా కేసు నమోదు చేశారు. ఈ ఉగ్రవాదులకు ఉన్న విదేశీ లింకులు, ఆర్థిక మూలాలపైనే తొలుత దృష్టి సారించారు. దీనితోపాటు వారికి అందిన శిక్షణ, ఎక్కడెక్కడ శిబిరాలు నిర్వహించారన్నది ఆరా తీస్తున్నారు. 

హెచ్‌యూటీ పేరుతోనే కొనసాగింపు.. 
హైదరాబాద్, భోపాల్‌లలో అరెస్టైన ఉగ్రవాదులు తొలుత అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ హిజ్బ్‌ ఉత్‌ తెహ్రీర్‌ (హెచ్‌యూటీ)కి అనుబంధంగా పనిచేశారు. రాకెట్‌ చాట్, త్రీమా యాప్స్‌లో ఏర్పాటు చేసుకున్న గ్రూపుల్లో హెచ్‌యూటీకి చెందినవారు పంపిన వీడియోలు, ఆడియోలు, పత్రాలను చూసి ప్రేరణ పొందారు.

కానీ ఎంతకాలం ఎదురుచూసినా హెచ్‌యూటీ నుంచి విధ్వంసాలకు సంబంధించిన ఆదేశాలు అందలేదు. దీంతో సొంతంగా సలీం, యాసిర్‌ల నేతృత్వంలో హైదరాబాద్, భోపాల్‌ మాడ్యుల్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. నిషేదం నుంచి తప్పించుకోవడానికి ఈ మాడ్యూల్స్‌కు ఎలాంటి పేర్లూ పెట్టుకోలేదు.

ప్రాథమిక ఆధారాలను బట్టి హెచ్‌యూటీ ఉగ్రవాదులుగానే పరిగణించాలని, ఆ సంస్థపై నిషేధం విధించాలని కేంద్ర హోంశాఖకు నివేదిక పంపేందుకు ఎన్‌ఐఏ సన్నాహాలు చేస్తోంది. కేసు దర్యాప్తు పూర్తిచేసి, అభియోగపత్రాలు దాఖలు చేశాక ఈ ప్రక్రియ చేపట్టనుంది. 

ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో లాడెన్‌ వీడియోలు 
ఏటీఎస్‌ అధికారులు ఉగ్రవాదుల నుంచి స్వా«దీనం చేసుకున్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో విశ్లేషణ చేయించగా.. పలు కీలక అంశాలను గుర్తించారు. యువత ఉగ్రవాద బాటపట్టా లని రెచ్చగొట్టేలా ఒసామా బిన్‌లాడెన్‌ చేసిన ప్రసంగాల వీడియోలు, తఫ్సీర్‌–ఎ–జిహాద్‌ పేరిట రెచ్చ గొట్టే వ్యాఖ్యల ఆడియోలు వాటిలో ఉన్నట్టు ఏటీఎస్‌ అధికారులు చెప్తున్నారు.

ఈ ఉగ్రవాదుల్లో ఇంజనీరింగ్‌ చదివిన రిజ్వీ, డానిష్, కరీం, అబ్దుర్‌ రెహ్మాన్‌ (హైదరాబాద్‌లో అరెస్టయ్యాడు) ఎల్రక్టానిక్‌ పరికరాలను వినియోగించడంపై మిగతా వారికి శిక్షణ ఇచ్చారు. భోపాల్‌ మాడ్యుల్‌కు చెందినవారు అక్కడి ఇంద్రపురిలో ఉన్న కమల పార్కులో వివిధ అంశాలపై శిక్షణ తీసుకున్నరని దర్యాప్తు అధికారులు గుర్తించారు.  యాసిర్‌ వీరికి తన ఫిట్‌నెస్‌ సెంటర్‌లో బాక్సింగ్, కత్తిని ఉపయోగించడం వంటి వాటిలో చిట్కాలు నేర్పినట్టు తేల్చారు. 

హైదరాబాద్‌లో శిబిరం ఎక్కడ? 
ఉగ్రవాదులను విచారించిన సమయంలో.. హైదరాబాద్‌తోపాటు భోపాల్‌కు చెందిన ఉగ్రవాదులు 2021 జూలైలో ఇక్కడి గోల్కొండలోని మహ్మద్‌ సలీం ఇంట్లో సమావేశమయ్యారని ఏటీఎస్‌ గుర్తించింది. తర్వాత రెండు రోజుల పాటు పెద్ద శిక్షణ శిబిరం నిర్వహించారని.. ఎయిర్‌ గన్‌ కాల్చడం, బరువు తగ్గడంతోపాటు ఆత్మరక్షణ, పోలీసుల ఇంటరాగేషన్‌ను ఎదుర్కోవడం వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చారని తేల్చింది.

అయితే ఈ శిక్షణ శిబిరం ఎక్కడ నిర్వహించారనేది ఉగ్రవాదులు బయటపెట్టలేదని.. ఆ ప్రాంతాన్ని గుర్తించడానికి ఎన్‌ఐఏ అధికారులు సాంకేతికంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారని తెలిసింది. ఇక గత ఏడాది నవంబర్‌లో భోపాల్‌ సమీపంలో జరిగిన శిబిరంలో వీరంతా నాటు తుపాకీ కాల్చడం, చిన్న చిన్న బాంబులు తయారు చేయడాన్ని ప్రాక్టీస్‌ చేసినట్టు అధికారులు చెప్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement