సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. తమ సెనేట్‌లో ఈ నెల 29న జరిగే ‘యాంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం 2021’సదస్సులో ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించాల్సిందిగా ఫ్రాన్స్ ప్రభుత్వం కేటీఆర్‌ను ఆహ్వానించింది. తమ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ సారథ్యంలో జరిగే ఈ సదస్సుతో రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలోపేతం అవుతాయని కేటీఆర్‌కు పంపిన లేఖలో ఫ్రాన్స్ ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్ తదనంతరం భారత్, ఫ్రాన్స్ సంబంధాల్లో అభివృద్ధి, భవిష్యత్తు నిర్మాణం అనే అంశంపై ప్రసంగించాలని కోరింది.
ఈ సదస్సులో గతంలో కంటే ఎక్కువ కంపెనీల భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని, ఇలాంటి కీలకమైన వేదిక తెలంగాణలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి కేటీఆర్‌కు పంపిన లేఖలో ఫ్రెంచ్ ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా ఈ సదస్సులో ఆరోగ్య రక్షణ, వాతావరణ మార్పులు, వ్యవసాయ వాణిజ్యం వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతుందని వివరించింది. దీంతో పాటు ఫ్రాన్స్, భారత కంపెనీల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయని మంత్రికి పంపిన ఆహ్వాన లేఖలో పేర్కొన్నారు. కాగా, ఫ్రాన్స్ ప్రభుత్వ ఆహ్వానంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించే వీలు కలుగుతుందని, ఫ్రాన్స్ దేశ ఆహ్వానం తెలంగాణ ప్రభుత్వ విధానాలను దక్కిన గుర్తింపు అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment