ఆదివారం లాల్‌దర్వాజాలోని సింహవాహినీ అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు తలసాని, మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: డప్పు వాయిద్యాలు.. యువకుల కేరింతలు.. పోతరాజుల నృత్యాలు.. అమ్మవారి ఫలహార బండ్ల ఊరేగింపు.. ఆడపడుచుల బోనాలు.. అమ్మవారికి తొట్టెల సమర్పణ తదితర కార్యక్రమాల మధ్య పాతబస్తీలో ఆదివారం బోనాల జాతర కన్నుల పండువగా జరిగింది. భక్తులు తెల్లవారుజామునే లాల్‌దర్వాజ సింహవాహినీ దేవాలయం అమ్మవారికి బోనం సమర్పించడానికి క్యూ కట్టారు. అలాగే పాతబస్తీలోని ఇతర మహంకాళి దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.
పటిష్ట భద్రత మధ్య...
బోనాల జాతర ఉత్సవాలకు దక్షిణ మండలం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దక్షిణ మండలం పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ బోనాల జాతర వేడుకల్లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతబస్తీలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమ్మవారికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ పట్టువస్త్రాలను సమర్పించారు.
నేడు సామూహిక ఘటాల ఊరేగింపు...
ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశామని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ రాకేశ్ తివారీ తెలిపారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు
బోనాలు పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీకని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పాతబస్తీ బోనాలు ఉత్సవంలో భాగంగా లాల్‌దర్వాజలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని ఆమె సందర్శించారు. అమ్మవారికి బోనం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment