గేటెడ్ కమ్యూనిటీ ప్రధాన ద్వారం
గచ్చిబౌలి: సూర్య కథానాయకుడిగా నటించిన ‘గ్యాంగ్’ సినిమా గుర్తుందా? అక్రమార్కులను కొల్లగొట్టడానికి కథానాయకుడి నేతృత్వంలోని ముఠా సీబీఐ అధికారుల మాదిరిగా రెచ్చిపోతుంది. అచ్చు అలాంటి ఉదంతమే మధ్యాహ్నం గచ్చిబౌలి ఠాణా పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీ జయభేరి ఆరెంజ్ కౌంటీలో జరిగింది. లాకర్‌లో ఉన్న 1.34 కిలోల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదుతో పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు..
ఆ మాటే నేరగాళ్లకు కలిసొచ్చింది..
రియల్ ఎస్టేట్ సంస్థ భువన తేజ డెవలపర్స్ చైర్మన్ వెంకట సుబ్రహ్మణ్యం ఆరెంజ్ కౌంటీలోని సీ బ్లాక్‌లోని ఫ్లాట్ నంబర్ 110లో భార్య, పిల్లలతో నివసిస్తున్నారు. సీసీ కెమెరాలు, వాచ్‌మన్‌లతో ఈ గేటెడ్ కమ్యూనిటీ నిఘా నీడలో ఉంటుంది. విజిటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు ప్రధాన గేటు వద్ద ఉండే వాచ్‌మన్ యజమానిని సంప్రదించిన తర్వాతే పంపిస్తుంటారు. సుబ్రహ్మణ్యం నగర శివార్లలో కొన్ని వెంచర్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిత్యం కొనుగోలుదారులు, బ్యాంకర్లు తదితరులు వచ్చిపోతుంటారు. ఇలా ఎవరు వచ్చినా వాచ్‌మన్ సంప్రదిస్తుండటంతో.. తన కోసం ఎవరైనా వస్తే నేరుగా పంపించాల్సిందిగా గతంలో చెప్పారు. దీంతో సుబ్రహ్మణ్యం కోసమంటూ ఎవరు వచ్చినా వారిని ఫ్లాట్ నం.110కు పంపడం పరిపాటిగా మారింది.
పక్కా పథకం ప్రకారం..
సుబ్రహ్మణ్యం ఇంటిని కొల్లగొట్టాలని పథకం వేసుకున్న నేరగాళ్లకు ఇదే అంశం కలిసి వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కారులో వచ్చిన నలుగురు వాచ్‌మన్‌తో సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లాలని చెప్పారు. దీంతో అతడు వారిని లోపలకు పోనిచ్చాడు. 1.10 గంటలకు ఫ్లాట్ నం.110కు వెళ్లిన నేరగాళ్లు తలుపు కొట్టారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న డ్రైవర్ స్వామి నాయుడు వెళ్లి తలుపు తీశారు. తాము సీబీఐ ఏజెంట్లమని సుబ్రహ్మణ్యం భార్య భాగ్యలక్ష్మికి చెప్పిన నలుగురూ నకిలీ గుర్తింపుకార్డులు చూపిస్తూ బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. ఆ వెంటనే భాగ్యలక్ష్మితో పాటు డ్రైవర్ వద్ద ఉన్న మూడు సెల్‌ఫోన్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. భాగ్యలక్ష్మితో పాటు ఆమె ముగ్గురు సంతానం, డ్రైవర్‌ను హాలులోనే కదలకుండా కూర్చోబెట్టారు.
ఆదాయపు పన్ను బకాయిలంటూ...
సీబీఐ అధికారుల పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు భాగ్యలక్ష్మితో ఆమె భర్త ఆదాయపు పన్ను శాఖకు రూ.18 కోట్లు బాకీ పడ్డారని, ఈ నేపథ్యంలోనే సోదాల కోసం వచ్చామంటూ చెప్పారు. ఇద్దరు దుండగులు హాలులోనే కాపలా ఉండగా.. మిగిలిన ఇద్దరూ నేరుగా పడక గదిలోకి వెళ్లారు. అక్కడ ఉన్న హ్యాండ్ బ్యాగ్ నుంచి లాకర్ తాళాలు తీసుకున్నారు. వాటితో లాకర్ తెరిచి అందులో ఉన్న 1.34 తులాల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు తీసుకుని ఉడాయించారు. ఈ వ్యవహారం మొత్తం 25 నిమిషాల్లో పూర్తయింది. బాధితురాలు తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పగా... సీబీఐ ఏజెంట్లు అయితే బంగారు నగలు తీసుకొని ఎందుకు వెళతారంటూ ఆయన ప్రశ్నించారు. దీంతో జరిగిన వ్యవహారం గుర్తించి సాయంత్రం 5 గంటలకు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భీమవరంలో చిక్కిన నిందితులు..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఎంట్రీ వద్ద సుబ్రహ్మణ్యం పేరు చెప్పి వెళ్లడంతో పాటు తెలుగులో స్పష్టంగా మాట్లాడటంతో పరిచయస్తుల పనిగా అనుమానించారు. బాధితుల వివరాలు తెలిసిన వాళ్లే వెనుక ఉండి దుండగులతో కథనడిపి ఉంటారని అంచనా వేశారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన వివరాల ఆధారంగా దుండగులు కారులో వచ్చారని, నంబర్ ప్లేట్ లేదని తేల్చారు. దాని డ్రైవర్ రోడ్డు పైనే ఆగిపోగా నలుగురు మాత్రం కౌంటీలోని ప్రవేశించినట్లు నిర్ధారణైంది. పలు ప్రాంతాల్లోని సీసీ పుటేజ్ పరిశీలించిన పోలీసులు ఆ కారు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడ వైపు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో పాటు సాంకేతిక ఆధారాలతో ముందుకు వెళ్లిన సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు నిందితులను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పట్టుకున్నారని తెలిసింది.
(చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో కరోనా రావడంతో కోమాలోకెళ్లింది..! అప్పటికే..)
Comments
Please login to add a commentAdd a comment