Gachibauli
-
గోల్మాల్ ‘గ్యాంగ్’ ..సీబీఐ అధికారులమంటూ ఫ్లాట్‌లోకి
గచ్చిబౌలి: సూర్య కథానాయకుడిగా నటించిన ‘గ్యాంగ్’ సినిమా గుర్తుందా? అక్రమార్కులను కొల్లగొట్టడానికి కథానాయకుడి నేతృత్వంలోని ముఠా సీబీఐ అధికారుల మాదిరిగా రెచ్చిపోతుంది. అచ్చు అలాంటి ఉదంతమే మధ్యాహ్నం గచ్చిబౌలి ఠాణా పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీ జయభేరి ఆరెంజ్ కౌంటీలో జరిగింది. లాకర్లో ఉన్న 1.34 కిలోల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదుతో పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఆ మాటే నేరగాళ్లకు కలిసొచ్చింది.. రియల్ ఎస్టేట్ సంస్థ భువన తేజ డెవలపర్స్ చైర్మన్ వెంకట సుబ్రహ్మణ్యం ఆరెంజ్ కౌంటీలోని సీ బ్లాక్‌లోని ఫ్లాట్ నంబర్ 110లో భార్య, పిల్లలతో నివసిస్తున్నారు. సీసీ కెమెరాలు, వాచ్‌మన్‌లతో ఈ గేటెడ్ కమ్యూనిటీ నిఘా నీడలో ఉంటుంది. విజిటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు ప్రధాన గేటు వద్ద ఉండే వాచ్‌మన్ యజమానిని సంప్రదించిన తర్వాతే పంపిస్తుంటారు. సుబ్రహ్మణ్యం నగర శివార్లలో కొన్ని వెంచర్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిత్యం కొనుగోలుదారులు, బ్యాంకర్లు తదితరులు వచ్చిపోతుంటారు. ఇలా ఎవరు వచ్చినా వాచ్‌మన్ సంప్రదిస్తుండటంతో.. తన కోసం ఎవరైనా వస్తే నేరుగా పంపించాల్సిందిగా గతంలో చెప్పారు. దీంతో సుబ్రహ్మణ్యం కోసమంటూ ఎవరు వచ్చినా వారిని ఫ్లాట్ నం.110కు పంపడం పరిపాటిగా మారింది. పక్కా పథకం ప్రకారం.. సుబ్రహ్మణ్యం ఇంటిని కొల్లగొట్టాలని పథకం వేసుకున్న నేరగాళ్లకు ఇదే అంశం కలిసి వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కారులో వచ్చిన నలుగురు వాచ్‌మన్‌తో సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లాలని చెప్పారు. దీంతో అతడు వారిని లోపలకు పోనిచ్చాడు. 1.10 గంటలకు ఫ్లాట్ నం.110కు వెళ్లిన నేరగాళ్లు తలుపు కొట్టారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న డ్రైవర్ స్వామి నాయుడు వెళ్లి తలుపు తీశారు. తాము సీబీఐ ఏజెంట్లమని సుబ్రహ్మణ్యం భార్య భాగ్యలక్ష్మికి చెప్పిన నలుగురూ నకిలీ గుర్తింపుకార్డులు చూపిస్తూ బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. ఆ వెంటనే భాగ్యలక్ష్మితో పాటు డ్రైవర్ వద్ద ఉన్న మూడు సెల్ఫోన్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. భాగ్యలక్ష్మితో పాటు ఆమె ముగ్గురు సంతానం, డ్రైవర్‌ను హాలులోనే కదలకుండా కూర్చోబెట్టారు. ఆదాయపు పన్ను బకాయిలంటూ... సీబీఐ అధికారుల పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు భాగ్యలక్ష్మితో ఆమె భర్త ఆదాయపు పన్ను శాఖకు రూ.18 కోట్లు బాకీ పడ్డారని, ఈ నేపథ్యంలోనే సోదాల కోసం వచ్చామంటూ చెప్పారు. ఇద్దరు దుండగులు హాలులోనే కాపలా ఉండగా.. మిగిలిన ఇద్దరూ నేరుగా పడక గదిలోకి వెళ్లారు. అక్కడ ఉన్న హ్యాండ్ బ్యాగ్ నుంచి లాకర్ తాళాలు తీసుకున్నారు. వాటితో లాకర్ తెరిచి అందులో ఉన్న 1.34 తులాల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు తీసుకుని ఉడాయించారు. ఈ వ్యవహారం మొత్తం 25 నిమిషాల్లో పూర్తయింది. బాధితురాలు తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పగా... సీబీఐ ఏజెంట్లు అయితే బంగారు నగలు తీసుకొని ఎందుకు వెళతారంటూ ఆయన ప్రశ్నించారు. దీంతో జరిగిన వ్యవహారం గుర్తించి సాయంత్రం 5 గంటలకు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమవరంలో చిక్కిన నిందితులు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఎంట్రీ వద్ద సుబ్రహ్మణ్యం పేరు చెప్పి వెళ్లడంతో పాటు తెలుగులో స్పష్టంగా మాట్లాడటంతో పరిచయస్తుల పనిగా అనుమానించారు. బాధితుల వివరాలు తెలిసిన వాళ్లే వెనుక ఉండి దుండగులతో కథనడిపి ఉంటారని అంచనా వేశారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన వివరాల ఆధారంగా దుండగులు కారులో వచ్చారని, నంబర్ ప్లేట్ లేదని తేల్చారు. దాని డ్రైవర్ రోడ్డు పైనే ఆగిపోగా నలుగురు మాత్రం కౌంటీలోని ప్రవేశించినట్లు నిర్ధారణైంది. పలు ప్రాంతాల్లోని సీసీ పుటేజ్ పరిశీలించిన పోలీసులు ఆ కారు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడ వైపు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో పాటు సాంకేతిక ఆధారాలతో ముందుకు వెళ్లిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు నిందితులను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పట్టుకున్నారని తెలిసింది. (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో కరోనా రావడంతో కోమాలోకెళ్లింది..! అప్పటికే..) -
రాదనుకున్న సొమ్ము రాబట్టారు..
గచ్చిబౌలి: చోరీకి గురైన సొత్తును బాధితులకు అప్పగించేందుకు సైబరాబాద్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. దేశంలోనే తొలిసారిగా ‘స్టోలెన్ ప్రాపర్టీ రిలీజ్ మేళా’ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా 176 కేసుల్లో కోటిన్నర విలువైన కిలో బంగారు ఆభరణాలు, మూడున్నర కిలోల వెండి, రూ.30.67 లక్షల నగదు, 90 వాహనాలు బాధి తులకు అప్పగించారు. మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో జరిగిన ఈ కార్య క్రమంలో పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చోరీ జరిగిన సొమ్మును బాధితులకు అప్పగించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. చోరీ జరిగితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, క్లూస్ సేకరించి నిందితులను రిమాండ్ చేసి చార్జిషీట్ వేయడం వరకే ఆగిపోతున్నట్లు చెప్పారు. సొమ్ము గురించి అంతగా పట్టించు కోకపోవడంతో న్యాయపరంగా సొత్తు తీసుకోవట్లేదని తెలిపారు. చోరీ అయిన సొత్తును త్వరితగతిన ఇప్పించాలనే ఉద్దేశంతో కొద్ది నెలలుగా కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. సొత్తును అప్పగించేందుకు సహకరించిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, డీసీపీలు, సీసీఆర్బీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. స్టోలెన్ ప్రాపర్టీ రిలీజ్ మేళాను నిరంతరం నిర్వహించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శంషాబాద్ జోన్ పోలీసులు 101 కేసుల్లో సొత్తు రికవరీ చేశారని తెలిపారు. -
అయ్యో పాపం.. చిన్నారి ప్రాణం తీసిన కారు
గచ్చిబౌలి: ఇంటి సమీపంలోని రోడ్డుపై ఆడుకుంటున్న ఓ బాలుడి పైనుంచి కారు వెళ్లడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గచ్చిబౌలి ఎస్ఐ రమేష్ తెలిపిన ప్రకారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ఎనమదల గ్రామానికి చెందిన తోట రమేష్, అనూష దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి కొండాపూర్ శ్రీరాంనగర్ బి బ్లాక్‌లోలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు తోట జశ్వంత్ (11 నెలలు) ఉన్నారు. ఇంటి సమీపంలో రోడ్డుపై ఇద్దరు అక్కలు, జశ్వంత్‌తో పాటు మరి కొత మంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఓఎన్సీ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేసే తాటి కిరణ్ కూకట్‌పల్లిలోని ఆఫీస్‌కు వెళ్లేందుకు మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో కారులో బయలుదేరాడు. హారన్ కొట్టడంతో మూల మలుపు వద్ద ఆడుతున్న పిల్లలందరూ పక్కకు జరిగారు. 11 నెలల జశ్వంత్ నడవలేక పాకుతుండగా...ఆ బాలుడిని గమనించకపోవడంతో ముందు టైరు పైనుంచి వెళ్లింది. వెంటనే శ్రీరాంనగర్ కాలనీలోని ఓ క్లినిక్‌లో చికిత్సచేయించగా కోలుకోలేక పోవడంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. నిందితుడు కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: కరోనాతో ఉద్యోగం రాదని విద్యార్థి బలవన్మరణం -
హైదరాబాద్ చేరుకున్న కేంద్ర బృందం
-
మూడు రోజులపాటు హైదరాబాద్‌లో కేంద్ర బృందం
సాక్షి, హైదరాబాద్ : కరోనా ఉధృతి అధికంగా ఉన్న నగరాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర బృందం శనివారం హైదరాబాద్ చేరుకుంది. గచ్చిబౌలి ఆస్పత్రిలో సదుపాయాలను కేంద్ర బృందం పరిశీలించింది. మూడు రోజుల పాటు ఈ బృందం హైదరాబాద్‌లోనే ఉండనుంది. ఇవాళ సాయంత్రం 3.30 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో బృంద సభ్యులు భేటీ అవుతారు. ఆదివారం డీజీపీ కార్యాలయం, ఎల్లుండి (సోమవారం) జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించనున్నారు. అనంతరం మరోసారి సీఎస్‌తో ఈ కేంద్ర బృందం సమావేశం అవుతుంది. కాగా దేశంలో అతి పెద్ద కరోనా హాట్‌స్పాట్ ప్రాంతాల్లో హైదరాబాద్ కూడా ఉంది. దీంతో ఈ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉండటంతో ‘విపత్తు నిర్వహణ చట్టం–2005’ నిబంధనలను అనుసరించి ఈ బృందం నగరంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తోంది. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించనుంది. (విమానం ఎక్కాలంటే మాస్క్‌లు ఉండాల్సిందే) కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇటీవలే హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్పోర్ట్ విలేజ్ కాంప్లెక్స్ భవనంలో కోవిడ్–19 అధునాతన ఆస్పత్రి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(టిమ్స్) అందుబాటులోకి వచ్చింది. 1,500 బెడ్లతో కూడిన ఈ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు, వైద్య పరికరాలు, ఐసీయూ, వెంటిలేటర్ సదుపాయాలు ఉన్నాయి. ఈ ఆస్పత్రిలో 468 గదులు ఉండగా 153 మంది డాక్టర్లు, 228 మంది నర్సులు, 578 మంది ఇతర వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. (గుడ్‌న్యూస్.. మరికొన్ని ఆంక్షలు సడలింపు) ఇక కరోనా పాజిటివ్ కేసులు, అనుమానితుల సంఖ్య తగ్గడంతో నిన్న( శుక్రవారం) నగరంలోని పలు ప్రాంతాల్లో కంటైన్మెంట్ క్లస్టర్లను ఎత్తివేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కొత్తగా కేసులు వెలుగులోకి రావడంతో ఆయా ప్రాంతాలను రెడ్జోన్లుగా ప్రకటించారు. (కాస్త ఊరట!) -
‘దిశ హత్య ప్రాంతంలో అవి ఏర్పాటు చేయాలి’
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల చోటుచేసుకున్న దిశ హత్య జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గచ్చిబౌలి వాని నగర్ ప్రాంత వాసులు హెచ్ఆర్సీ(మానవ హక్కుల కమిషన్)కి పిటిషన్ దాఖలు చేశారు. రాత్రి సమయంలో ఈ ప్రాంత నుంచి వెళ్లలంటే భయంగా ఉందని మహిళలు వాపోతున్నారు. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ విచారణకు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ సీపీలకు నోటీసులు జారీ చేసి.. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. -
నకిలీ పట్టాతో మోసం !
కోర్టుకు టోకరా వేసేందుకు యత్నం న్యాయమూర్తి అప్రమత్తతో బండారం బట్టబయలు విచారణకు ఆదేశించిన న్యాయమూర్తి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం హైదరాబాద్ : వందల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ‘మొబైల్ వెల్ఫేర్ సొసైటీ’ పేరుతో కబ్జా చేసిన ఓ ప్రబుద్ధుడు హైకోర్టుకే టోకరా వేసే ప్రయత్నం చేశాడు. అత్యంత ఖరీదైన గచ్చిబౌలి ప్రాంతంలో ప్రభుత్వం తమకు 99 ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చిందని చెప్పడంతో, అనుమానించిన హైకోర్టు ఒరిజినల్ పట్టాను తమ ముందుంచాలని ఆ వ్యక్తిని ఆదేశించింది. దీంతో తన బండారం బట్టబయలు అవుతుందని గ్రహించిన ప్రబుద్ధుడు, అతని తరఫు న్యాయవాది తదుపరి విచారణకు హాజరు కాలేదు. దీంతో అప్రమత్తమైన హైకోర్టు, రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి పిటిషన్‌తో పాటు ఆ ప్రబుద్ధుడు జత చేసిన పట్టా కాపీ నకిలీదని తేల్చింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ కమిషనర్‌ను ఆదేశించింది. నకిలీ డాక్యుమెంట్లు పెట్టి కోర్టును తప్పుదోవ పట్టించినందుకు మొబైల్ వెల్ఫేర్ సొసైటీ జీపీఏ హోల్డర్, ఇతర ఆఫీస్ బేరర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కబ్జాలో ఉన్న భూముల్లోని ఆక్రమణదారులను వెంటనే ఖాళీ చేయించి, ఆ భూమిని నిజమైన హక్కుదారులకు స్వాధీనం చేయాలని కమిషనర్‌కు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు నాలుగు రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కోర్టు ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని ఇటువంటి సొసైటీలు పబ్బం గడుపుకుంటున్నాయని న్యాయమూర్తి ఈ సందర్భంగా తన ఉత్తర్వుల్లో వ్యాఖ్యానించారు. ‘ఇటువంటి సొసైటీలన్నీ కూడా వారివారి అనైతిక కార్యకలాపాలకు న్యాయస్థానాలను వేదికలుగా చేసుకుంటున్నాయి. కోర్టు ఉత్తర్వులను రక్షణ కవచంలా చేసుకుని పోలీసులు, రెవెన్యూ అధికారులను కోర్టు ధిక్కారం పేరుతో బెదిరిస్తూ బాధితులకు సాయం చేయకుండా అడ్డుకుంటున్నాయి. ఈ కేసులో పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించి, కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేశారు. ఇటువంటి చర్యలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. శాంతి,భద్రతల పరిరక్షణ పోలీసుల విధి. శాంతి, భద్రతలు లేని సమాజంలో అరాచకం చోటు చేసుకుంటుంది. దీని వల్ల అశాంతి నెలకొంటుంది. ఈ కేసు విచారణ బాధ్యతలను పోలీసులకు అప్పగిస్తున్నాం.’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మోసం ఇలా.. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, గచ్చిబౌలి గ్రామంలోని 32 నుంచి 40 వరకు గల సర్వే నంబర్లలోని 99 ఎకరాల భూమిని ప్రభుత్వం తమ సొసైటీకి ఉచితంగా ఇచ్చిందని, ఆ భూమి నుంచి తమను ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ మొబైల్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన ఎస్.రాంబాబు 2012లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిని అప్పట్లో విచారించిన హైకోర్టు, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి వాయిదాలు పడుతూ వస్తున్న ఈ కేసు ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ముందుకు విచారణకు వచ్చింది. వృద్ధాశ్రమాల నిర్మాణం, నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం, వీధి బాలల పునరావాస కేంద్రాల నిర్మాణం కోసం తమకు ప్రభుత్వం ఈ భూమిని కేటాయించిందని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. అందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ పేరుతో జారీ చేసిన పట్టా కాపీని కోర్టు ముందుంచారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి, ఒరిజినల్ పట్టాను కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 25కి వాయిదా వేశారు. ఈ నెల 25న ఈ కేసు విచారణకు రాగా, అటు పిటిషనర్ గానీ, ఇటు పిటిషనర్ తరఫు న్యాయవాది గానీ వాదనలు వినిపించేందుకు రాలేదు. దీంతో పిటిషనర్ తీరుపై అనుమానంతో రికార్డులను మొత్తం పరిశీలించారు. పిటిషనర్ తన పిటిషన్‌తో పాటు కోర్టు ముందుంచిన పట్టా కాపీ నకిలీదని తేల్చారు. రాంబాబు.. దొరికాడిలా పిటిషనర్ రాంబాబు కోర్టు ముందుంచిన పట్టా కాపీలో దానిని తమకు కలెక్టర్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. దానిపై కలెక్టర్ సంతకం ఉంది. ఇక్కడే రాంబాబు అడ్డంగా దొరికిపోయారు. రెవెన్యూశాఖ (సాంఘిక సంక్షేమం) పేరుతో కలెక్టర్ ఆ ఉత్తర్వులిచ్చినట్లు న్యాయమూర్తి గమనించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి మాత్రమే ఉత్తర్వులు ఇస్తారని, కలెక్టర్ స్థాయిలో ఇవ్వరు కనుక అది నకిలీదని న్యాయమూర్తి తేల్చారు. వివాదాస్పద భూముల్లో ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదని, కేవలం చిన్నపాటి నివాసాలు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని కూడా ఉండటాన్ని న్యాయమూర్తి గుర్తించారు. దీంతో న్యాయమూర్తి, ఓ వ్యక్తికి ప్రభుత్వం ఏకంగా 99 ఎకరాల భూమిని కేటాయిస్తుందా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పేదల కోసం ప్రభుత్వం భూమిని కేటాయించిందని చెబుతున్న పిటిషనర్ సొసైటీకి, ఆ భూములను ఇతరులకు అమ్మే హక్కు ఎక్కడదని ప్రశ్నించారు. ఓ పక్కా ప్రణాళిక, వ్యూహంతో పిటిషనర్ సొసైటీ కథ మొత్తం నడిపిందన్న న్యాయమూర్తి, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి, 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ కమిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. -
గచ్చిబౌలి కేవీఎస్ బాలుర జట్టుకు టైటిల్
ఎల్బీ స్టేడియం: జేఎఫ్హెచ్ఏ ఇంటర్ స్కూల్స్ హాకీ టోర్నమెంట్ టైటిల్‌ను గచ్చిబౌలికి చెందిన కేంద్రీయ విద్యాలయం (కేవీ) హైస్కూల్ జట్టు చేజిక్కించుకుంది. హాకీ ఒలింపియన్ జూడ్ ఫెలిక్స్ హాకీ అకాడ మీ(జెఎఫ్హెచ్ఏ) ఆధ్వర్యంలో బెంగళూర్‌లో జరిగిన ఈ టోర్నీలో బాలుర విభాగం ఫైనల్లో గచ్చిబౌలి కేవీఎస్ జట్టు 4-0 స్కోరుతో జేఎఫ్హెచ్ఏ స్కూల్ జట్టుపై విజయం సాధించింది. ఈ టోర్నీలో రాహుల్ దాస్ బెస్ట్ ప్లేయర్‌గా, సూర్య ప్రకాష్ బెస్ట్ ఫార్వర్డ్ ఆటగాడిగా అవార్డును అందుకున్నాడు. ఎం.ఎ.ఎస్.కుషాల్ ప్రతాప్, విశ్వజిత్ శుక్లాలు మాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను గెల్చుకోగా, నజీబుల్లా బెస్ట్ గోల్ కీపర్‌గా ఎంపికయ్యాడు.