నకిలీ పట్టాతో మోసం ! | Fake degree scandal | Sakshi
Sakshi News home page

నకిలీ పట్టాతో మోసం !

Published Sun, Nov 30 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

Fake degree scandal

కోర్టుకు టోకరా వేసేందుకు యత్నం
న్యాయమూర్తి అప్రమత్తతో బండారం బట్టబయలు
విచారణకు ఆదేశించిన న్యాయమూర్తి
30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

 
 హైదరాబాద్  : వందల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ‘మొబైల్ వెల్ఫేర్ సొసైటీ’ పేరుతో కబ్జా చేసిన ఓ ప్రబుద్ధుడు హైకోర్టుకే టోకరా వేసే ప్రయత్నం చేశాడు. అత్యంత ఖరీదైన గచ్చిబౌలి ప్రాంతంలో ప్రభుత్వం తమకు 99 ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చిందని చెప్పడంతో, అనుమానించిన హైకోర్టు ఒరిజినల్ పట్టాను తమ ముందుంచాలని ఆ వ్యక్తిని ఆదేశించింది. దీంతో తన బండారం బట్టబయలు అవుతుందని గ్రహించిన ప్రబుద్ధుడు, అతని తరఫు న్యాయవాది తదుపరి విచారణకు హాజరు కాలేదు. దీంతో అప్రమత్తమైన హైకోర్టు, రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి పిటిషన్‌తో పాటు ఆ ప్రబుద్ధుడు జత చేసిన పట్టా కాపీ నకిలీదని తేల్చింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ కమిషనర్‌ను ఆదేశించింది. నకిలీ డాక్యుమెంట్లు పెట్టి కోర్టును తప్పుదోవ పట్టించినందుకు మొబైల్ వెల్ఫేర్ సొసైటీ జీపీఏ హోల్డర్, ఇతర ఆఫీస్ బేరర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కబ్జాలో ఉన్న భూముల్లోని ఆక్రమణదారులను వెంటనే ఖాళీ చేయించి, ఆ భూమిని నిజమైన హక్కుదారులకు స్వాధీనం చేయాలని కమిషనర్‌కు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు నాలుగు రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కోర్టు ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని ఇటువంటి సొసైటీలు పబ్బం గడుపుకుంటున్నాయని న్యాయమూర్తి ఈ సందర్భంగా తన ఉత్తర్వుల్లో వ్యాఖ్యానించారు.

‘ఇటువంటి సొసైటీలన్నీ కూడా వారివారి అనైతిక కార్యకలాపాలకు న్యాయస్థానాలను వేదికలుగా చేసుకుంటున్నాయి. కోర్టు ఉత్తర్వులను రక్షణ కవచంలా చేసుకుని పోలీసులు, రెవెన్యూ అధికారులను కోర్టు ధిక్కారం పేరుతో బెదిరిస్తూ బాధితులకు సాయం చేయకుండా అడ్డుకుంటున్నాయి. ఈ కేసులో పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించి, కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేశారు. ఇటువంటి చర్యలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. శాంతి,భద్రతల పరిరక్షణ పోలీసుల విధి. శాంతి, భద్రతలు లేని సమాజంలో అరాచకం చోటు చేసుకుంటుంది. దీని వల్ల అశాంతి నెలకొంటుంది. ఈ కేసు విచారణ బాధ్యతలను పోలీసులకు అప్పగిస్తున్నాం.’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మోసం ఇలా..

రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, గచ్చిబౌలి గ్రామంలోని 32 నుంచి 40 వరకు గల సర్వే నంబర్లలోని 99 ఎకరాల భూమిని ప్రభుత్వం తమ సొసైటీకి ఉచితంగా ఇచ్చిందని, ఆ భూమి నుంచి తమను ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ మొబైల్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన ఎస్.రాంబాబు 2012లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిని అప్పట్లో విచారించిన హైకోర్టు, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి వాయిదాలు పడుతూ వస్తున్న ఈ కేసు ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ముందుకు విచారణకు వచ్చింది. వృద్ధాశ్రమాల నిర్మాణం, నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం, వీధి బాలల పునరావాస కేంద్రాల నిర్మాణం కోసం తమకు ప్రభుత్వం ఈ భూమిని కేటాయించిందని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. అందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ పేరుతో జారీ చేసిన పట్టా కాపీని కోర్టు ముందుంచారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి, ఒరిజినల్ పట్టాను కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 25కి వాయిదా వేశారు. ఈ నెల 25న ఈ కేసు విచారణకు రాగా, అటు పిటిషనర్ గానీ, ఇటు పిటిషనర్ తరఫు న్యాయవాది గానీ వాదనలు వినిపించేందుకు రాలేదు. దీంతో పిటిషనర్ తీరుపై అనుమానంతో రికార్డులను మొత్తం పరిశీలించారు. పిటిషనర్ తన పిటిషన్‌తో పాటు కోర్టు ముందుంచిన పట్టా కాపీ నకిలీదని తేల్చారు.
 
రాంబాబు.. దొరికాడిలా


పిటిషనర్ రాంబాబు కోర్టు ముందుంచిన పట్టా కాపీలో దానిని తమకు కలెక్టర్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. దానిపై  కలెక్టర్ సంతకం ఉంది. ఇక్కడే రాంబాబు అడ్డంగా దొరికిపోయారు. రెవెన్యూశాఖ (సాంఘిక సంక్షేమం) పేరుతో కలెక్టర్ ఆ ఉత్తర్వులిచ్చినట్లు న్యాయమూర్తి గమనించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి మాత్రమే ఉత్తర్వులు ఇస్తారని, కలెక్టర్ స్థాయిలో ఇవ్వరు కనుక అది నకిలీదని న్యాయమూర్తి తేల్చారు. వివాదాస్పద భూముల్లో ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదని, కేవలం చిన్నపాటి నివాసాలు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని కూడా ఉండటాన్ని న్యాయమూర్తి గుర్తించారు. దీంతో న్యాయమూర్తి, ఓ వ్యక్తికి ప్రభుత్వం ఏకంగా 99 ఎకరాల భూమిని కేటాయిస్తుందా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పేదల కోసం ప్రభుత్వం భూమిని కేటాయించిందని చెబుతున్న పిటిషనర్ సొసైటీకి, ఆ భూములను ఇతరులకు అమ్మే హక్కు ఎక్కడదని ప్రశ్నించారు. ఓ పక్కా ప్రణాళిక, వ్యూహంతో పిటిషనర్ సొసైటీ కథ మొత్తం నడిపిందన్న న్యాయమూర్తి, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి, 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ కమిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement