
గచ్చిబౌలి: చోరీకి గురైన సొత్తును బాధితులకు అప్పగించేందుకు సైబరాబాద్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. దేశంలోనే తొలిసారిగా ‘స్టోలెన్ ప్రాపర్టీ రిలీజ్ మేళా’ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా 176 కేసుల్లో కోటిన్నర విలువైన కిలో బంగారు ఆభరణాలు, మూడున్నర కిలోల వెండి, రూ.30.67 లక్షల నగదు, 90 వాహనాలు బాధి తులకు అప్పగించారు. మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో జరిగిన ఈ కార్య క్రమంలో పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చోరీ జరిగిన సొమ్మును బాధితులకు అప్పగించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. చోరీ జరిగితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, క్లూస్ సేకరించి నిందితులను రిమాండ్ చేసి చార్జిషీట్ వేయడం వరకే ఆగిపోతున్నట్లు చెప్పారు. సొమ్ము గురించి అంతగా పట్టించు కోకపోవడంతో న్యాయపరంగా సొత్తు తీసుకోవట్లేదని తెలిపారు. చోరీ అయిన సొత్తును త్వరితగతిన ఇప్పించాలనే ఉద్దేశంతో కొద్ది నెలలుగా కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. సొత్తును అప్పగించేందుకు సహకరించిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, డీసీపీలు, సీసీఆర్‌బీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. స్టోలెన్ ప్రాపర్టీ రిలీజ్ మేళాను నిరంతరం నిర్వహించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శంషాబాద్ జోన్ పోలీసులు 101 కేసుల్లో సొత్తు రికవరీ చేశారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment