సాధారణ చెత్తతో పాటే కోవిడ్ వ్యర్థాలను తరలిస్తున్న విరించి ఆస్పత్రి యాజమాన్యం
సాక్షి, సిటీబ్యూరో: జనావాసాల మధ్యన కోవిడ్ వ్యర్థాలను నిర్లక్ష్యంగా తరలిస్తున్న ఓ ఆస్పత్రి నిర్వాకంపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బంజారాహిల్స్ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ‘విరించి’ ఆస్పత్రి ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకుండా.. ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు.. కనీస రక్షణ చర్యలు లేకుండానే సాధారణ వ్యర్థాలతో పాటే కోవిడ్ వ్యర్థాలను తరలిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిణామంతో నిత్యం ఆస్పత్రికి వస్తున్న సాధారణ రోగులు, వారి బంధువులతో పాటు ప్రధాన రహదారి, ఆ పక్కనే ఉన్న జనావాసాల నుంచి రాకపోకలు సాగిస్తున్న సాధారణ ప్రజలు కోవిడ్ బారిన పడుతున్నారు. మరికొందరు ముందున్న ముప్పును తలచుకుంటూ బెంబేలెత్తుతున్నారు. ఇక ఈ ఆస్పత్రికి వస్తున్న రోగులు, వారి బంధువులు తమ వాహనాలను రోడ్డుపై నిలుపుతున్నారని..
ఆస్పత్రి యాజమాన్యం వారికి పార్కింగ్ వసతి కల్పించడంలో విఫలమవడంతో నిత్యం ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌జాం ఏర్పడుతోందని ట్రాఫిక్ పోలీసులు ఇటీవలే ఈ ఆస్పత్రికి నోటీసులు జారీచేశారు. ఆస్పత్రి ప్రాంగణంలో నిత్యం మురుగు నీరు ఉప్పొంగుతుందంటూ జలమండలి సైతం విరించి ఆస్పత్రికి నోటీసులు జారీచేయడం గమనార్హం. నిత్యం నగరంలో కోవిడ్ కేసులతోపాటు రోగులు వాడిపడేసిన వ్యర్థాలు సుమారు టన్నుకు పైగానే వెలువడుతున్నాయి. వీటిని కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా పడవేస్తుండడం.. మరికొందరు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా తరలిస్తుండడంతో అనర్థాలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఇళ్లలో హోం ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్ రోగులు వాడి పడేసిన వస్తువులు సైతం సాధారణ చెత్తతో పాటే పారవేస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ అంశంపై వైద్యారోగ్యశాఖ సీరియస్‌గా దృష్టి సారించాలని సిటీజన్లు డిమాండ్ చేస్తున్నారు.
కోవిడ్ వ్యర్థాలివే..
ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో రోగులు వాడిన మాస్క్‌లు, గ్లౌజులు, దుస్తులు, మలమూత్రాలు, సిరంజీలు, కాటన్, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్స్, మెడిసిన్ కవర్స్ తదితరాలను కోవిడ్ వ్యర్థాలుగా పరిగణిస్తున్నారు. ఆయా వ్యర్థాల పరిమాణం రోగుల సంఖ్యతో పాటే అంతకంతకూ పెరుగుతూనే ఉండడం భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వ్యర్థాలను మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, వనపర్తి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, యాదాద్రి జిల్లాల్లోని బయోమెడికల్ వేస్ట్ ట్రీట్‌మెంట్ కేంద్రాల్లో ప్రత్యేకమైన పరిస్థితుల్లో శుద్ధి చేయాల్సి ఉంది. అయితే కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు సాధారణ చెత్తతోపాటే ఈ వ్యర్థాలను తరలిస్తుండడంతో అనర్థాలు తలెత్తుతున్నాయి.
వ్యర్థాలు తరలింపు సిబ్బందికి కోవిడ్ ఎఫెక్ట్..
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్‌మెంట్ కేంద్రాల్లో పనిచేస్తున్న సుమారు 300 మంది సిబ్బందిలో సుమారు 50 మంది వరకు కోవిడ్ మహమ్మారి బారిన పడినట్లు సమాచారం. దీంతో ఉద్యోగులు భయాందోళనల మధ్య విధులు నిర్వర్తిస్తున్నారు. తమకు వైద్య,ఆరోగ్య శాఖ ఉద్యోగుల తరహాలో మెరుగైన బీమా, వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని 12 ప్రభుత్వ ఆస్పత్రులు, 128 క్వారంటైన్ కేంద్రాలు,7 నమూనా సేకరణ కేంద్రాలు, 10 ల్యాబ్‌ల నుంచి నిత్యం కోవిడ్ వ్యర్థాలను సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 55 వాహనాలను ఏర్పాటు చేశారు. వీటిని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్‌మెంట్ కేంద్రాలకు తరలించి అక్కడ వ్యర్థాలను బూడిద చేసి అనంతరం ఈ బూడిదను గ్రేటర్ శివార్లలోని దుండిగల్ హజార్డస్ వేస్ట్‌ట్రీట్‌మెంట్ కేంద్రానికి తరలించాలి. అక్కడ తిరిగి ప్రత్యేక పరిస్థితుల్లో శుద్ధిచేసి నేలలో అత్యంత లోతున పూడ్చివేయడం ద్వారా పర్యావరణంలో కరోనా వైరస్ చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అయితే అందరూ కాకపోయినా కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఈ నిబంధనలను పాటించకపోవడంతో అనర్థాలు తలెత్తుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ఈ అంశంపై తక్షణం దృష్టిసారించాలని సిటీజన్లు కోరుతున్నారు. కోవిడ్ వ్యర్థాలను నిర్లక్ష్యంగా తరలిస్తున్న వైనంపై ఆస్పత్రి యాజమాన్యాన్ని ‘సాక్షి’ వివరణ కోరగా.. స్పందించేందుకు ఆస్పత్రి వర్గాలు అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment