ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బెల్టు షాపులు వెంటనే మూసివేసేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఆదేశించారు. ఈ నెల 29న సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్ ఒకటిన పోలింగ్ ముగిసేవరకు గ్రేటర్ పరిధిలో మద్యం షాపులు మూసేయించాలన్నారు. డిసెంబర్ 4న కౌంటింగ్ సందర్భంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో మద్యం షాపులు మూసివుంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా పార్థసారథి మాట్లాడారు.
3,133 మందిపై బైండోవర్ కేసులు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి ఇప్పటిదాకా 65,098 ప్రచార బ్యానర్లు, పోస్టర్లు, బోర్డులు, ఫ్లెక్సీలు, జెండాలు తొలగించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) వెల్లడించింది. ఇప్పటివరకు 3,133 మందిపై బైండోవర్ కేసులు పెట్టినట్టు తెలిపింది. 243 నాన్‌బెయిలబుల్ వారంట్లను అమలుచేయగా, ఇంకా 1,549 వారంట్లు పెండింగ్‌లో ఉన్నాయని, బుధవారందాకా దాదాపు రూ.1.41 కోట్ల నగదును, రూ.11 లక్షల పైచిలుకు విలువ చేసే మెఫెగ్రోన్ డ్రగ్, విడిగాంజా, మద్యం, ఐఎంఎఫ్‌ఎల్, మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది.
గ్రేటర్ బరిలో 49 మంది నేరచరితులు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పలు డివిజన్లలో కార్పొరేటర్లుగా పోటీ చేస్తోన్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో మొత్తం 49 మంది నేరచరితులు ఉన్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) తెలిపింది. టీఆర్‌ఎస్‌లో 13 మంది, బీజేపీలో 17 మంది, కాంగ్రెస్‌లో 12 మంది, ఎంఐఎంలో ఏడుగురిపై మొత్తం 96 కేసులు ఉన్నాయని వివరిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేసింది. వీరిలో ఆరుగురు మహిళా అభ్యర్థులపైనా కేసులు ఉండటం గమనార్హం. వీరంతా 41 వార్డుల్లో పోటీ చేస్తున్నారని పేర్కొంది. మల్కాజిగిరి వార్డు (147)లో పోటీ చేస్తోన్న అభ్యర్థులందరికీ నేరచరిత ఉందని ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి వివరించారు. గత ఎన్నికల్లో 72 మంది నేరచరితులు పోటీ చేయగా, ఈసారి ఆ సంఖ్య 49కు తగ్గిందన్నారు. ప్రజల కోసం పాటుపడేవారికి ఓటు వేయాలని ఎఫ్‌జీజీ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment