
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న రాజకీయ నేతలు, కార్యకర్తలంతా వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం జిల్లాల నుంచి అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు, నేతలంతా పెద్ద సంఖ్యలో వచ్చారని, వారంతా లక్షణాలున్నా లేకున్నా 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. అనుమానం ఉంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. ఈ మేరకు బుధవారం డీఎంఈ రమేశ్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు.
జీహెచ్‌ఎంసీ పరి ధిలో 10 రోజులపాటు ఎన్నికల ప్రచారంలో వేలాది మంది పాల్గొన్నారని శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొందరు కోవిడ్ నిబంధనలు పాటించలేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. అందుకే నేతలంతా క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. వైద్యపరంగా అత్యవసరమైతేనే బయటకు రావాలని కోరారు. అంతర్జాతీయంగా, మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత మొదలైందని పేర్కొన్నారు. అందుకే రోజుకు రాష్ట్రంలో 65 వేల పరీక్షలు చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,090 కేంద్రాల్లో కోవిడ్ టెస్టులు జరుగుతుండగా, వాటికి అదనంగా మరో 50 కేంద్రాల్లో పరీక్షలు చేయనున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్‌లో 25, రంగారెడ్డిలో మరో 25 కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటికి తోడు మరో 300 మొబైల్ వాహనాల ద్వారా కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. సెకండ్ వేవ్ పరిస్థితుల దృష్యా వృద్ధాశ్రమాలు, చైల్డ్ హోమ్స్, అనాథ శరణాలయాల్లో ప్రతి పది రోజులకోసారి కరోనా పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల గురించి మరింత సమాచారం కోసం 104కు కాల్ చేయాలని, ఒకవేళ అది కలవకుంటే ప్రజారోగ్య డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 040–24651119కు ఫోన్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చని చెప్పారు.
పెళ్లిళ్ల వల్ల భారీగా కేసులు..
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పెళ్లిళ్ల వల్ల కూడా కొన్నిచోట్ల కేసులు ఆకస్మికంగా పెరుగుతున్నట్లు తెలిపారు. పెళ్లిళ్లకు వందలాది మంది హాజరుకావడం వల్ల జగిత్యాలలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. సెకండ్ వేవ్ రాకుండా చూసే బాధ్యత మన చేతుల్లోనే ఉందన్నారు. మొదటి దశలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేశామన్నారు. టీకా మొదటి డోసు ఇచ్చిన 3 వారాల తర్వాత మళ్లీ ఇంకో డోసు ఇవ్వాలని, అది ఇచ్చిన తర్వాత 9 నెలల పాటు దాని ప్రభావం ఉంటుందన్నారు. వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందరికీ అందించడానికి సమయం పడుతుందన్నారు. వాక్సిన్ సాఫ్ట్‌వేర్ డ్రై రన్‌కు రాజస్తాన్, తెలంగాణ రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేసిందని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బొగ్గులకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేంద్ర బృందం డ్రై రన్ నిర్వహిస్తోందని తెలిపారు. గత నాలుగు నెలలుగా కరోనా వ్యాప్తి రేటు తగ్గిందన్నారు. రాష్ట్రంలో 70–80 లక్షల మందికి మొదటి దశలో కరోనా టీకాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయితే అందరికీ టీకాలివ్వడం సాధ్యం కాదని కేంద్రం రాష్ట్రాలకు తెలిపిందని చెప్పారు.
మెడికల్ కాలేజీల ప్రారంభానికి చర్యలు..
టీకా వచ్చిన తర్వాత వైద్య సిబ్బందికే ముందుగా వ్యాక్సిన్ ఇస్తామని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిందన్నారు. మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. నర్సులు పరిధి దాటి ధర్నాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్వారంటైన్ సెలవులను రద్దు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని, అదే పాటిస్తున్నామని చెప్పారు. కోవిడ్ సోకిన వారు 3 నెలల నుంచి ఏడాది పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో నాన్ కోవిడ్ సేవలు మొదలు పెట్టినట్లు వెల్లడించారు. అన్ని శస్త్ర చికిత్సలు త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment