ఆఫీస్​ ఎన్ని గంటలకు?..మీరు వస్తున్నది ఎన్నింటికి? | GHMC Mayor Gadwal Vijayalakshmi Fires On Officials For Not Coming Office In Time | Sakshi
Sakshi News home page

ఆఫీస్​ ఎన్ని గంటలకు?..మీరు వస్తున్నది ఎన్నింటికి?

Published Thu, Nov 7 2024 11:03 AM | Last Updated on Thu, Nov 7 2024 11:24 AM

GHMC Mayor Gadwal Vijayalakshmi Fires On Officials For Not Coming Office In Time

సాక్షి,సిటీబ్యూరో: అయినా తీరు మారలేదు. ఎంతకూ రీతి మారలేదు. ఇష్టం వచి్చనప్పుడు రావడం.. ఓపిక ఉన్నప్పుడు ఫైళ్లు కదపడం.. ఏళ్లుగా ఇదే తంతు. తనిఖీలు చేసి హెచ్చరించినా వారికి లెక్కలేదు. మేయర్‌ సీరియస్‌ అయినా పట్టించుకోరు. ఇదీ జీహెచ్‌ఎంసీ సిబ్బంది, అధికారుల పనితీరు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మికి మరోసారి కోపమొచ్చింది. గతంలో రెండు పర్యాయాలు కార్యాలయాల్లో తనిఖీలు చేసినప్పుడు సిబ్బంది ఎవరూ తమ సీట్లలో కనిపించకపోవడంపై మేయర్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

తాజాగా బుధవారం ఆయా విభాగాల్లో ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొన్ని విభాగాల్లో మధ్యాహ్నం 12 గంటలవుతున్నా అధికారులు తమ తమ స్థానాల్లో లేకపోవడంపై మేయర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై సహించేది లేదని, సమయపాలన పాటించనివారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలస్యంగా వచ్చేవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తనకు నివేదిక పంపాల్సిందిగా అన్ని విభాగాలకు సర్క్యులర్లు పంపినా, ఎందుకు పంపలేదంటూ టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

టౌన్‌ ప్లానింగ్‌పైనే ఎక్కువ ఫిర్యాదులు 
ప్రజావాణిలో ఎక్కువ ఫిర్యాదులు టౌన్‌ ప్లానింగ్‌వే ఉంటున్నాయని, పరిష్కారం కాక ప్రజలు జీహెచ్‌ఎంసీ చుట్టూ తిరుగుతున్నారని మేయర్‌ అన్నారు. హెల్త్‌ సెక్షన్‌లో కొందరు పని మాని సెల్‌ఫోన్‌ వీక్షణంలో నిమగ్నం కావడాన్ని గుర్తించి సీరియస్‌ అయ్యారు. ఇన్‌చార్జి సీఎంఓహెచ్‌ సీట్లో లేకపోవడంపై మండిపడ్డారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఎక్కడ తనిఖీలు చేస్తున్నారో తెలుసుకోవాలని అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ ముత్యం రాజును ఆదేశించగా, ఆయన శేరిలింగంపల్లి ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్‌ చేశారు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ సక్రమంగా సమాధానం ఇవ్వకపోవడంతో మేయర్‌ మండిపడ్డారు. వెటర్నరీ విభాగంలోనూ తనిఖీ చేశారు.

 ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ ఇంతకు ముందు కూడా రెండుసార్లు అన్ని విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు చేశానని, అయినా వారి తీరు మారలేదన్నారు. ఆయా విభాగాల సిబ్బంది ఉదయం 10:30 గంటల వరకు ఆఫీసులకు రావాలని, 10:40 నిమిషాల వరకు కూడా రాకపోతే ఆలస్యంగా నమోదు చేస్తామని, ఇలా మూడు పర్యాయాల ఆలస్యానికి క్యాజువల్‌ లీవ్‌ కట్‌ చేస్తామని, అవి లేనివారికి ఈఎల్‌ కట్‌చేస్తామని హెచ్చరించారు. తనిఖీల సందర్భంగా మేయర్‌ వెంట అడిషనల్‌ కమిషనర్‌ నళినీపద్మావతి ఉన్నారు. అనంతరం మేయర్‌ మీడియాతో మాట్లాడుతూ ఆలస్యంగా వచ్చేవారి గురించి తనకు ప్రతినెలా నివేదిక అందజేయాలని అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీలోని ప్రతి ఉద్యోగి ఫేషియల్‌ రికగి్నషన్‌ హాజరులో పేర్లు నమోదు చేయించుకోవాలని 
సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement