దుబ్బాకటౌన్/తొగుట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. గోదావరి జలాలు కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి అడుగుపెట్టాయి. ప్రాజెక్టు ఈఎన్‌సీ హరిరాం, ఎస్‌ఈ వేణు, ఈఈ వెంకటేశ్వర్‌రావు ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ పంపుహౌస్ వద్ద ప్రత్యక పూజలు నిర్వహించి మోటార్లను ప్రారంభించారు. పంపుల నుంచి దూసుకెళ్లిన గోదావరి నీళ్లు.. గలగలమంటూ కొద్దిసేపట్లోనే మల్లన్నసాగర్‌లోకి అడుగుపెట్టాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో నీటిని నింపాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో.. అధికారులు కొద్దిరోజులుగా రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ట్రయల్‌రన్ విజయవంతం అవడంతో సంబురాలు జరుపుకొన్నారు.
10 టీఎంసీలు నింపేందుకు..
మల్లన్నసాగర్‌లో ప్రస్తుతం 10 టీఎంసీల నీటిని నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తుక్కాపూర్ పంపుహౌజ్‌లోని మొత్తం ఎనిమిది పంపులకుగాను.. మూడు పంపుల (రెండో, ఆరో, ఏడో నంబర్ పంపుల) ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక్కో మోటార్ ద్వారా రోజుకు (24 గంటల్లో) 1.5 టీఎంసీల నీటిని పంపింగ్ చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన మూడింటిని పూర్తిస్థాయిలో నడిపితే.. రెండు, మూడు రోజుల్లోనే మల్లన్నసాగర్‌లో 10 టీఎంసీలు చేరే అవకాశం ఉంది.
భారీగా బందోబస్తు
మల్లన్నసాగర్‌లో నీళ్లు నింపుతున్న నేపథ్యంలో పోలీసులు శనివారం మధ్యాహ్నమే రిజర్వాయర్ పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తుక్కాపూర్, రాంపురం వాగుగడ్డ, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాలకు వెళ్లే రహదారిపై పికెట్లు ఏర్పాటు చేశారు. ఎవరినీ కట్ట వద్దకు వెళ్లనీయడం లేదు. గ్రామస్తులను కూడా పూర్తి వివరాలు అడిగి నిర్ధారించుకున్నాకే వెళ్లనిస్తున్నారు.
అర్ధరాత్రి గ్రామాలు ఖాళీ
మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోని కుటుంబాలను రెవెన్యూ అధికారులు శనివారం అర్ధరాత్రి ఖాళీ చేయించారు. వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్, బి.బంజేరుపల్లి గ్రామాల నుంచి అందరినీ బయటికి తరలించారు. నిజానికి ఈ గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు గతంలోనే ఆదేశించారు. కానీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి సంబంధించి కొందరు ఖాళీ చేయలేదు. వారిని ఇప్పుడు బయటికి తరలించారు.
గట్టు గుట్ట పూజారి అక్కడే..!
వేములఘాట్ శివారు అటవీప్రాంతంలోని గట్టు గుట్టపై దీకొండ మైసమ్మ, ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. ఏటిగడ్డ కిష్టాపూర్ తండాకు చెందిన మంగీలాల్.. ఆలయంలోనే నివసిస్తూ పూజారిగా పనిచేస్తున్నారు. ముంపు గ్రామాలన్నీ పూర్తిగా ఖాళీ చేస్తుండటంతో.. ఏటిగడ్డ కిష్టాపూర్ సర్పంచ్ ఆయనతో మాట్లాడి బయటికి రావాలని కోరారు. కానీ మంగీలాల్ తిరస్కరించారు. అధికారులు ఆయనను బయటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
కేసీఆర్ స్వప్నం సాక్షాత్కారం: మంత్రి హరీశ్
‘కేసీఆర్ స్వప్నం సాక్షాత్కారం.. తెలంగాణకు అమృత జలాభిషేకం’ అని పేర్కొంటూ రిజర్వాయర్‌లోకి నీటి విడుదల ఫొటోలను ట్విట్టర్లో మంత్రి హరీశ్‌రావు పోస్టు చేశారు.
‘సాకారమైన సాగరం..
అనుమానాలు, అపశకునాలు, అవరోధాలు తలవంచి తప్పుకున్నాయి.కుట్రలు, కుహానా కేసులు, వందల విమర్శలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. గోదారి గంగమ్మ మల్లన్నసాగరాన్ని ముద్దాడింది. తెలంగాణ రైతాంగం ఆనందంతో మురిసింది. పట్టుదలతో పనిచేస్తే కానిదేదీ లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచానికి చాటింది..’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment