తెలంగాణలో వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అదే సమయంలో ఆపదలో ఆదుకునే హెల్ఫింగ్ హ్యాండ్స్ అక్కడక్కడా కనిపిస్తున్నాయి.
వాగులో కొట్టుకుపోయి.. పైపులో ఇరుక్కుని..
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం లంబాడితండాలో ఎర్రవాగు పోటెత్తి లోలెవల్ వంతెనపైనుంచి ప్రవహిస్తోంది. ఇక్కడి జంగాల్‌పేటకు చెందిన సమ్మయ్య అనే రైతు వంతెన దాటేందుకు ప్రయతి్నస్తూ నీటిలో కొట్టుకుపోయాడు. కొంత దూరంలో వాగులో ఉన్న పైపులో చిక్కుకున్నాడు. పోలీసులు, స్థానిక యువకులు కలిసి ఆయనను కాపాడారు.
మూలవాగులో చిక్కుకుని..
జగిత్యాల జిల్లా శెట్టిపల్లికి చెందిన మారుతి ప్రమాదవశాత్తు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మూలవాగులో చిక్కుకుపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వాగు వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, శ్రీనివాస్‌రావు తాళ్ల సాయంతో వాగులోకి దిగి మారుతిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు.
వరద నీటిలో అంతిమయాత్ర
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామానికి చెందిన బస్వరాజు బాలయ్య (70) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామానికి ఆనుకుని వాగు ఒడ్డున వైకుంఠ ధామం ఉంది. భారీ వర్షాలతో వాగులో నడుములోతు నీటి ప్రవాహం కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు, బంధువులు వరదలోనే మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇళ్లలోకి రోళ్ల వాగు నీళ్లు
జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలంలో రోళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనిపై ఉన్న ప్రాజెక్టు కాల్వల నుంచి వరద ఉప్పొంగడంతో.. దిగువన ఉన్న నర్సింహులపల్లె గ్రామం జలమయమైంది. ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment