Hyderabad: Techie Dies After Being Hit By Car On PVNR Expressway While Searching For Destination On Google Map - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: గూగుల్‌ మ్యాప్‌తో రాంగ్‌ టర్న్‌.. కాపాడమంటూ వేడుకోలు.. చివరకు ప్రాణం పోయింది

Published Mon, May 15 2023 7:15 PM | Last Updated on Tue, May 16 2023 10:29 AM

Google Map Wrong Direction Kills Young Engineer Hyderabad - Sakshi

క్రైమ్‌: ఆ యువకుడు నగరానికి కొత్త. రూల్స్‌కు విరుద్ధమైనప్పటికీ.. ఇద్దరు స్నేహితురాళ్లను బైక్‌పై ఎక్కించుకుని నగరం చూద్దామని బయల్దేరాడు. దారి కోసం గూగుల్‌ మ్యాప్‌ను ఆశ్రయించాడు. కానీ,  అది అతన్ని తప్పుదారి పట్టించింది. తప్పు దోవలో వెళ్తున్నామని గుర్తించి.. మలుపు తీసుకునేలోపే ఊహించని పరిణామం జరిగింది. ఆ యువ ఇంజనీర్‌ జీవితాన్ని రోడ్డు ప్రమాదం అర్థాంతరంగా ముగించేసింది.

ఎంహెచ్‌ఎన్‌వీఎస్‌ చరణ్‌(22) స్వస్థలం కృష్ణాజిల్లా చిన్నగొల్లపాలెం గ్రామం. బీటెక్‌ పూర్తి చేసి పోచారం వద్ద ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ సమీపంలోని టౌన్‌షిప్‌లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. వీకెండ్‌ కావడంతో నగరం చూద్దామని శనివారం స్నేహితులతో కలిసి బైక్‌లపై బయల్దేరారు. ఈ క్రమంలో ఇద్దరు స్నేహితురాళ్లను తన బైక్‌పై ఎక్కించుకున్నాడు చరణ్‌. 

ట్యాంక్‌ బండ్‌ మీద ఉన్నవి చూసుకుని.. దుర్గం చెరువు తీగల వంతెన చూద్దామని బయల్దేరారు. దారి తెలియక గూగుల్‌ మ్యాప్‌ను ఆశ్రయించారు. ముందు రెండు బైక్‌లు వెళ్లిపోగా.. గూగుల్‌ మ్యాప్‌ను అనుసరించి ఆరాంఘర్‌ వద్ద బైక్‌ను పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ మార్గం వైపు మళ్లించాడు. అయితే రెండు కిలోమీటర్లు ముందుకు వెళ్లాక తప్పు దారిలో వెళ్తున్నట్లు గుర్తించారు. బండిని యూటర్న్‌ తీసుకున్నాడు. 

గచ్చిబౌలి వెళ్లేందుకు పిల్లర్‌ నంబరు 82 వద్ద ఎక్స్‌ప్రెస్‌ వే నుంచి ర్యాంపు ద్వారా కిందకు వెళ్లేందుకు మలుపు తిరిగాడు. అదే సమయంలో ఆరాంఘర్‌ వైపు నుంచి వస్తున్న ఓ కారు చరణ్‌ నడుపుతున్న బండిని ఢీకొంది.  తీవ్రంగా గాయపడిన చరణ్‌ రోడ్డుమీద కొద్దిసేపు కొట్టుమిట్టాడాడు. నిస్సహాయ స్థితిలో రక్తపు చేతులతో అక్కడికి వచ్చిన వారి పాదాలు పట్టుకొని కాపాడమంటూ సైగలు చేశాడు. ఆ సమయంలో రక్షించకపోగా.. కొందరు వీడియోలు, ఫొటోలు తీసి వైరల్‌ చేశారు. ఈలోపు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి తీవ్రంగా గాయపడిన చరణ్‌ను, స్వల్పంగా గాయపడిన అతని స్నేహితురాళ్లను స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. 

చికిత్స పొందుతూ చరణ్‌.. ఆదివారం ఉదయం కన్నుమూశాడు. స్వల్పగాయాలతో బయటపడిన యువతులు ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 

మెహిదీపట్నం-శంషాబాద్‌ వరకు 11.6 కిలోమీటర్ల మేర పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించారు. ఈ మార్గంలో కార్లు, ఎయిర్‌పోర్ట్‌ వైపు వెళ్లే బస్సులు ప్రయాణించేందుకు మాత్రమే అనుమతి ఉంది. అయితే.. పర్యవేక్షణ లోపంతో కొందరు ద్వి, త్రి చక్ర వాహనదారులు ఆ రూట్‌లో ప్రయాణిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement