pvnr express way
-
HYD: గూగుల్ మ్యాప్‌తో రాంగ్ టర్న్.. చరణ్ ప్రాణం పోయింది
క్రైమ్: ఆ యువకుడు నగరానికి కొత్త. రూల్స్‌కు విరుద్ధమైనప్పటికీ.. ఇద్దరు స్నేహితురాళ్లను బైక్‌పై ఎక్కించుకుని నగరం చూద్దామని బయల్దేరాడు. దారి కోసం గూగుల్ మ్యాప్‌ను ఆశ్రయించాడు. కానీ, అది అతన్ని తప్పుదారి పట్టించింది. తప్పు దోవలో వెళ్తున్నామని గుర్తించి.. మలుపు తీసుకునేలోపే ఊహించని పరిణామం జరిగింది. ఆ యువ ఇంజనీర్ జీవితాన్ని రోడ్డు ప్రమాదం అర్థాంతరంగా ముగించేసింది. ఎంహెచ్ఎన్వీఎస్ చరణ్(22) స్వస్థలం కృష్ణాజిల్లా చిన్నగొల్లపాలెం గ్రామం. బీటెక్ పూర్తి చేసి పోచారం వద్ద ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ సమీపంలోని టౌన్షిప్లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. వీకెండ్ కావడంతో నగరం చూద్దామని శనివారం స్నేహితులతో కలిసి బైక్‌లపై బయల్దేరారు. ఈ క్రమంలో ఇద్దరు స్నేహితురాళ్లను తన బైక్‌పై ఎక్కించుకున్నాడు చరణ్. ట్యాంక్ బండ్ మీద ఉన్నవి చూసుకుని.. దుర్గం చెరువు తీగల వంతెన చూద్దామని బయల్దేరారు. దారి తెలియక గూగుల్ మ్యాప్‌ను ఆశ్రయించారు. ముందు రెండు బైక్‌లు వెళ్లిపోగా.. గూగుల్ మ్యాప్‌ను అనుసరించి ఆరాంఘర్ వద్ద బైక్‌ను పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ మార్గం వైపు మళ్లించాడు. అయితే రెండు కిలోమీటర్లు ముందుకు వెళ్లాక తప్పు దారిలో వెళ్తున్నట్లు గుర్తించారు. బండిని యూటర్న్ తీసుకున్నాడు. గచ్చిబౌలి వెళ్లేందుకు పిల్లర్ నంబరు 82 వద్ద ఎక్స్‌ప్రెస్ వే నుంచి ర్యాంపు ద్వారా కిందకు వెళ్లేందుకు మలుపు తిరిగాడు. అదే సమయంలో ఆరాంఘర్ వైపు నుంచి వస్తున్న ఓ కారు చరణ్ నడుపుతున్న బండిని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన చరణ్ రోడ్డుమీద కొద్దిసేపు కొట్టుమిట్టాడాడు. నిస్సహాయ స్థితిలో రక్తపు చేతులతో అక్కడికి వచ్చిన వారి పాదాలు పట్టుకొని కాపాడమంటూ సైగలు చేశాడు. ఆ సమయంలో రక్షించకపోగా.. కొందరు వీడియోలు, ఫొటోలు తీసి వైరల్ చేశారు. ఈలోపు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి తీవ్రంగా గాయపడిన చరణ్‌ను, స్వల్పంగా గాయపడిన అతని స్నేహితురాళ్లను స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ చరణ్.. ఆదివారం ఉదయం కన్నుమూశాడు. స్వల్పగాయాలతో బయటపడిన యువతులు ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. మెహిదీపట్నం-శంషాబాద్ వరకు 11.6 కిలోమీటర్ల మేర పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించారు. ఈ మార్గంలో కార్లు, ఎయిర్పోర్ట్ వైపు వెళ్లే బస్సులు ప్రయాణించేందుకు మాత్రమే అనుమతి ఉంది. అయితే.. పర్యవేక్షణ లోపంతో కొందరు ద్వి, త్రి చక్ర వాహనదారులు ఆ రూట్లో ప్రయాణిస్తున్నారు. -
హైదరాబాద్: సునామీ వచ్చిందా ఏంటి?
సాక్షి, హైదరాబాద్: పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే వెంబడి మెహదీపట్నం దగ్గర వాటర్ పైప్‌లైన్ లీకైంది. దీంతో రోడ్డు మొత్తం జలమయమైపోయింది. పిల్లర్ నంబరు 53 దగ్గర పైప్ పగిలి నీళ్లు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. గ్యాలన్ల కొద్దీ నీరు వృథాగా పోయింది. రేతిబౌలి- అత్తాపూర్ మార్గంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ(హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు) సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మరమతులు చేపట్టింది. కాగా పైప్‌లైన్ లీకేజీకి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘‘మొన్నటి దాకా వరదలు.. ఇప్పుడు ఇక్కడ సునామీ కూడా వచ్చిందా ఏంటీ.. నీళ్లు వృథాగా పోనివ్వకండి. అధికారులు కాస్త శ్రద్ధ వహించండి’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.(చదవండి: వచ్చే నెల నుంచి ఉచిత తాగునీరు : కేటీఆర్) మన అత్తాపూర్ లో.. పిల్లర్ నంబర్ 53 దగ్గర.. వాటర్ పైప్ లైన్ పగిలి ఇలా అన్నమాట.. pic.twitter.com/GDICsF3xmV — Phani Kandukuri (@buduggadu) December 19, 2020 -
ఎక్స్‌ప్రెస్ వేపై కారు బోల్తా
హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే పై కారు బోల్తా పడింది. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మెహిదీపట్నం నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న కారు ఆరాంఘర్ సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. కారులో డ్రైవర్ తప్ప ఎవరూ లేరు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇతర వాహనాలేవీ ఆ సమయంలో సమీపంలో లేకపోవటంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. అయితే, వాహనాల రాకపోకలకు మాత్రం అంతరాయం ఏర్పడింది. ఘటన విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని కారును పక్కకు తొలగించారు. కొద్దిసేపటి తర్వాత వాహనాలను క్రమబద్ధీకరించారు. -
మూసీలో దూకిన మహిళ.. రక్షించిన పోలీసులు
మూసీనదిలోకి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఓ మహిళను పోలీసులు రక్షించారు. సోమవారం ఉదయం అత్తాపూర్ సమీపంలో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే ఫ్లై ఓవర్ మీద నుంచి ఓ మహిళ దిగువన ఉన్న మూసీ నదిలోకి దూకింది. అయితే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి, ఆమెను కాపాడగలిగారు. ఆమె ఎందుకు ఆత్మహత్యాప్రయత్నం చేసిందన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. సమయానికి పోలీసులు స్పందించడం వల్ల ఆమె ప్రాణాలు దక్కించుకోగలిగిందని స్థానికులు అంటున్నరు.